
ఆ కంటి జ్యోతిని కాపాడలేమా..
కంటి లో చిన్న నలక పడితే విలవిలలాడిపోతాం.. అలాంటిది 12 ఏళ్ల చిన్నారికి నిత్యం కంటి నుంచి ఇసుక ముద్దలు రాలుతున్నాయి.
చిన్నారి కంటి నుంచి ఇసుకలాంటి పదార్థం
పేదింటికి ఎదురైన పెద్ద కష్టం
టెక్కలి రూరల్: కంటి లో చిన్న నలక పడితే విలవిలలాడిపోతాం.. అలాంటిది 12 ఏళ్ల చిన్నారికి నిత్యం కంటి నుంచి ఇసుక ముద్దలు రాలుతున్నాయి. దీంతో కన్నవారు చలించిపోతున్నారు. పూటగడవని ఆ నిరుపేద కుటుంబం పాప కంటివైద్యం కోసం ఆసుపత్రుల వైపు వేలకు వేలు అప్పులు చేసి పరుగులు తీస్తున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు. టెక్కలిలోని పట్టుమహాదేవి కోనేరు గట్టుపై బెల్లాన మునమ్మ తన కుమార్తె జ్యోతితో కలిసి నివాసముంటుంది. రోజు కూలీ చేసుకునే ఈమె కుమార్తెకు పెద్ద కష్టం ఎదురయింది.
6వ తరగతి చదువుతున్న జ్యోతికి కొన్నేళ్లుగా కంటి నుండి ఇసుక ముద్దలు వస్తుండడంతో ఒడిశాలోని రాణిపేట గ్రామంలో ఉన్న ఓ కంటి ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. కంటి నుండి ఇసుక రావడంలో గల ఆంతర్యం అంతు చిక్కడంలేదని స్థానిక వైద్యులు తెలిపారు. వెద్యుల సూచన మేరకు మందులు వాడినప్పటికీ సుమారు పదిరోజులు తగ్గుముఖం పట్టి మళ్ళీ కంటి నుండి ఇసుక వస్తుంటుందని బాలిక తెలియజేంది. ఆసుపత్రులు తిప్పినా శాశ్వత పరిష్కారం దొరకడంలేదని తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది.
చూపు పోతుందని భయంగా ఉంది
నా కుమార్తెకు చిన్నతనం నుండే కంటి నుండి ముద్దలుముద్దలుగా ఇసుక వస్తుంది. నిరుపేదలమైన మేము అప్పులు చేసి పలు ఆసుపత్రులకు తిప్పి వైద్యం అందించినా ఫలితం లేకుండాపోయింది. ఇలాగే కొనసాగితే కుమార్తె చూపు కోల్పోతుందేమోనని భయంగా ఉంది. ప్రభుత్వం ఆదుకుని వైద్య సహాయం అందించాలని కోరుతున్నాను.
- బెల్లాన మునమ్మ, తల్లి.