హైఅలర్ట్‌ | high alert aob | Sakshi
Sakshi News home page

హైఅలర్ట్‌

Published Sun, Mar 12 2017 12:16 AM | Last Updated on Thu, Mar 28 2019 5:07 PM

హైఅలర్ట్‌ - Sakshi

హైఅలర్ట్‌

ఛత్తీస్‌గఢ్‌ ఘటనతో సరిహద్దుల్లో భయం భయం
మావోయిస్టుల షెల్టర్‌ జోన్‌గా ఆంధ్రా సరిహద్దు
అప్రమత్తమైన పోలీసులు.. కూంబింగ్‌ ముమ్మరం
రంపచోడవరం/చింతూరు : ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్, ఒడిశా సరిహద్దుల్లో మరోమారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు శనివారం జరిపిన మెరుపుదాడిలో కోబ్రా బెటాలియన్‌కు చెందిన 12 మంది జవాన్లు మృతి చెందారు. మన జిల్లాకు సరిహద్దునే ఉన్న సుకుమా జిల్లా భెర్జి ప్రాంతంలో.. నిర్మాణంలో ఉన్న రహదారి భద్రతలో నిమగ్నమైన జవాన్లను లక్ష్యంగా చేసుకున్న మావోయిస్టులు.. ముందుగా కాల్పులు జరిపారు. పోలీసులు తేరుకునేలోగానే మందుపాతరలు పేల్చారు. దీంతో పోలీసులకు భారీ నష్టం వాటిల్లింది. అంతలోనే చెలరేగిన మావోయిస్టులు పోలీ సుల ఆయుధాలను లూటీ చేసి తప్పించుకున్నారు. సంఘటన స్థలం మన రాష్ట్ర సరిహద్దు కు కేవలం 25 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో.. దాని ప్రభావం మన రాష్ట్ర సరి హద్దులపై పడే అవకాశముంది. ఘటనకు పాల్పడిన మావోయిస్టులు ఆంధ్రా సరిహద్దులను తమ షెల్టర్‌జోన్‌గా వినియోగించుకునే అవకాశముందని పోలీసులు అనుమానిస్తున్నారు. దండకారణ్యంలో కొంతకాలం గా మావోయిస్టులపై పైచేయి సాధిస్తున్న పోలీసులకు శనివారం జరిగిన మెరుపుదాడితో గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. వేసవికాలం ప్రారంభంలో దండకారణ్యంలో మావోయిస్టులు భారీ దాడులకు పాల్ప డే అవకాశముందని ఇటీవలే నిఘావర్గాలు హెచ్చరించాయి. అంతలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. నెల రోజుల క్రితం వరకూ బస్తర్‌ రేంజ్‌ ఐజీగా పని చేసిన తెలుగు వ్యక్తి శివరామకృష్ణ ప్రసాద్‌ కల్లూరి.. మావోయిస్టులను నియంత్రించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఆయన హయాంలో వరుస ఎన్‌కౌంటర్లు, అరెస్టులు, వందల సంఖ్యలో లొంగుబాట్లు చోటు చేసుకున్నాయి. ఇటీవలే ప్రభుత్వం ఆయనను అక్కడి నుంచి  బదిలీ చేసింది. ఆయన వెళ్లిన కొద్ది రో జులకే భారీ సంఘటన చేసుకోవడం పై ప్రస్తుతం రాజకీయ వేడిని రగిల్చింది.
ఆంధ్రా సరిహద్దుల్లో వరుస సంఘటనలు
ఇటీవల ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో మావోయిస్టులు వరుస దాడులకు పాల్పడుతున్నారు. చింతూరు మండలం ఏడుగురాళ్లపల్లి, పేగ ప్రాంతాల్లో వరుసగా మందుపాతరలు అమర్చడం, రహదారులు తవ్వడం, చెట్లు నరికి రహదారులను దిగ్బంధించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ల నెపంతో చింతూరు మండలం లచ్చిగూడేనికి చెందిన పాస్టర్‌ మారయ్య, అల్లిగూడేనికి చెందిన పర్శిక పుల్లయ్యలను హతమార్చారు. కూంబింగ్‌ నుంచి తిరిగి వస్తున్న పోలీసులను లక్ష్యంగా చేసుకుని మందుపాతర పేల్చగా త్రుటిలో ముప్పు తప్పింది. గత నెల 27వ తేదీన భారత్‌బంద్‌ సందర్భంగా మావోయిస్టులు జాతీయ రహదారిపై విధ్వంసం సృష్టిం చేందుకు మందుపాతర అమరుస్తున్న క్రమంలో అది కాస్తా వారి చేతుల్లోనే పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు దళ సభ్యులు మృతి చెందగా మరో సభ్యుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ మందుపాతర అమర్చి ఉండి ఉంటే పోలీసులకు భారీగా నష్టం కలిగేదని నిఘావర్గాలు అంటున్నాయి.
పోలీసుల ప్రతివ్యూహం
మావోయిస్టుల వ్యూహాలను తిప్పికొట్టేందుకు పోలీసులు ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. వరుస ఘటనలను దృష్టిలో పెట్టుకుని సరిహద్దు గ్రామాలపై నిఘా పెట్టిన పోలీసులు మావోయిస్టులకు సహరిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారిచి్చన సమాచారం ఆధారంగా దర్యాప్తు జరిపి, మరింత మందిని అదుపులోకి తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇటీవల గాయపడి, పోలీసుల అదుపులోనున్న ఓ దళసభ్యుడు సరిహద్దుల్లో మావోయిస్టుల కార్యకలాపాలపై కీలక సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు సరిహద్దునే భారీ ఘటన జరగడంతో అప్రమత్తమైన మన రాష్ట్ర పోలీసులు ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణా రాష్ట్రాల సరిహద్దుల్లోని పోలీస్‌ స్టేషన్లను అప్రమత్తం చేసి, నిఘా ముమ్మరం చేసినట్లు సమాచారం.
కూంబింగ్‌ ముమ్మరం చేశాం
ఛత్తీస్‌గఢ్‌ ఘటన నేపథ్యంలో నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో అదనపు బలగాలతో కూంబింగ్‌ ముమ్మరం చేశాం. ఘటనకు పాల్పడిన మావోయిస్టులు షెల్టర్‌జో¯ŒSగా వినియోగించుకునే అవకాశమున్న గ్రామాలను గుర్తించి ఆ గ్రామాల్లో నిఘాను పెంచడం జరిగింది. మావోయిస్టులు ఆంధ్రావైపు రాకుండా ఏడుగురాళ్లపల్లి ఔట్‌పోస్టు పరిధిలో మరింత అప్రమత్తం చేయడం జరిగింది.
– డాక్టర్‌ కె. ఫకీరప్ప, చింతూరు ఓఎస్డీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement