
'అగ్రీగోల్డ్' వివరాలివ్వండి
సాక్షి, హైదరాబాద్ : అగ్రిగోల్డ్‌కు చెందిన 12 ఆస్తులను, అక్షయగోల్డ్ చెందిన 5 ఆస్తులను ప్రభుత్వ ఈ పోర్టల్ ద్వారా వేలం వేసే విషయంలో ఇప్పటి వరకు తీసుకున్న చర్యలను, వేలం పురోగతికి సంబంధించిన వివరాలతో ఒక నివేదికను తమ ముందుంచాలని ఉమ్మడి హైకోర్టు గురువారం ఏపీ సీఐడీ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 4కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
అగ్రిగోల్డ్, అక్షయగోల్డ్ డిపాజిట్ల ఎగవేత వ్యవహారంపై విచారణకు ఆదేశించాలని కోరుతూ డిపాజిటర్లు హైకోర్టులో పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం వాటిపై మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా సీఐడీ తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కృష్ణ ప్రకాశ్ వాదనలు వినిపిస్తూ, వేలానికి పోర్టల్‌ను సిద్ధం చేశామన్నారు. వేలంలో పాల్గొనేందుకు పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయని కోర్టుకు తెలిపారు.
ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ అర్థరాత్రి వరకు బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, వేలం పురోగతికి సంబంధించిన వివరాలతో ఓ నివేదికను తమ ముందుంచాలని సీఐడీ అధికారులను ఆదేశిస్తూ విచారణను జూలై 4కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే, అగ్రిగోల్డ్ వ్యవహారంలో అనేక పోలీస్‌స్టేషన్‌లలో నమోదైన కేసులన్నింటినీ ఒకే కేసు కింద పరిగణించి విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ అగ్రిగోల్డ్ ఎండీ వెంకట శేషు నారాయణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది.