కేంద్ర చట్టం పాటించం.. రాష్ట్ర చట్టం వర్తించదు.. | Margadarsi Chit Funds Do Not Comply With Central And State Laws | Sakshi
Sakshi News home page

కేంద్ర చట్టం పాటించం.. రాష్ట్ర చట్టం వర్తించదు..

Published Thu, Jun 1 2023 8:44 AM | Last Updated on Thu, Jun 1 2023 3:38 PM

Margadarsi Chit Funds Do Not Comply With Central And State Laws - Sakshi

సాక్షి, అమరావతి: ‘కేంద్ర చిట్‌ఫండ్‌ చట్టం పాటించం.. రాష్ట్ర డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టం మాకసలు వర్తించదు.. కంపెనీల చట్టం పేరిట చిట్‌ఫండ్‌ వ్యాపారం చేస్తున్నాం.. రశీదుల రూపంలో డిపాజిట్లు సేకరిస్తాం.. మేం ఏం చేసినా ప్రభుత్వం ప్రశ్నించకూడదు.. చట్టం అడ్డురాకూడదు.. చందాదారులు నిలువునా మోసపోయే పరిస్థితి ఉన్నా ఎవరూ అడగకూడదు.. ఎందుకంటే రామోజీరావు ఏం చేసినా సరే ప్రశ్నించకూడదన్న అలిఖిత రాజ్యాంగం ఈ రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతోంది’ .. ఇదీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థ అడ్డగోలు వాదన. 

ఆర్థిక అక్రమాలకు పాల్పడినట్టు ఆధారాలతోసహా దొరికిపోయిన మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజల్ని మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. చందాదారుల హక్కుల పరిరక్షణ కోసం ఆ సంస్థకు చెందిన రూ.793.50 కోట్ల చరాస్తులను సీఐడీ అటాచ్‌ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయాన్ని వక్రీకరిస్తూ మొసలి కన్నీరు కారుస్తోంది. తమ చందాదారులను బెదిరించేందుకే ఇలా చేస్తున్నారంటూ రామోజీరావు ఈనాడు పత్రికలో దుష్ప్రచారానికి తెరతీశారు. అందులో కూడా తాము చట్టానికి అతీతమన్నట్టుగానే వాదించడం విస్మయపరుస్తోంది. 

కేంద్ర చట్టాన్ని ఎందుకు పాటించరు..? రాష్ట్ర చట్టం ఎందుకు వర్తించదు...?
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట రామోజీరావు చేస్తోంది చిట్‌ఫండ్‌ వ్యాపారమన్నది అందరికీ తెలిసిందే. కానీ కేంద్ర ప్రభుత్వం చిట్‌ఫండ్‌ సంస్థల చందాదారుల హక్కుల ప్రయోజనం కోసం 1982లో చేసిన కేంద్ర చిట్‌ఫండ్‌ చట్టాన్ని తాము పాటించబోమని రామోజీరావు, ఆయన కోడలు శైలజ చెప్పడం విడ్డూరంగా ఉంది. అసలు ఆ చట్టాన్ని పాటించబోమని చెప్పడంలోనే ఈ దేశంలో చట్టాలపట్ల వారికి ఏమాత్రం గౌరవం లేదన్నది స్పష్టమైపోయింది. ఇక ఆర్‌బీఐ మార్గదర్శకాల మేరకు అన్ని రాష్ట్రాలు డిపాజిటర్ల హక్కుల పరిరక్షణ చట్టాలను చేశాయి. ఉమ్మడి ఏపీలో అప్పటి టీడీపీ ప్రభుత్వమే 1999లో రాష్టడిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని చేసింది. కానీ ఆ చట్టం కూడా తమకు వర్తించదని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ వాదిస్తోంది. 

ఎందుకంటే తాము డిపాజిట్లను సేకరించడంలేదంటూ వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించింది. కానీ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ, సీఐడీ అధికారులు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో ఆ సంస్థ అనధికారికంగా డిపాజిట్లు సేకరిస్తున్నట్టు నిగ్గు తేలింది. చిట్టీలు పాడినవారికి ఆ మొత్తాన్ని పూర్తిగా చెల్లించకుండా కొంత మొత్తాన్ని తమ వద్దే అట్టిపెడుతోంది. అందుకు ఓ రశీదు ఇస్తోంది. ఆ రశీదులో పేర్కొన్న మొత్తంపై 4 నుంచి 5 శాతం వడ్డీ చెల్లిస్తోంది. అంటే రశీదు రూపంలో అనధికారికంగా డిపాజి­ట్లు సేకరిస్తున్నట్టే. చిట్‌ఫండ్స్‌ సంస్థలు డిపాజిట్లు సే­కరించడం ఆర్‌బీఐ మార్గదర్శకాలకు విరుద్ధం. కా­నీ రశీదు రూపంలో డిపాజిట్లు సేకరిస్తున్నట్టు ని­ర్ధార­ణ అయ్యింది. ఈ విషయాన్ని పలువురు చందా­దారులు కూడా సీఐడీకి ఇచ్చిన వాంగ్మూలంలో స్ప­ష్టంగా చెప్పారు. అంటే రాష్ట్ర డిపాజిట్‌దారుల హ­క్కుల పరిరక్షణ చట్టం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు కచ్చి­తంగా వర్తిస్తుందని న్యాయ నిపుణులు తేల్చి చెప్పారు. 

అక్రమంగా నిధుల మళ్లింపు.. సొంత పెట్టుబడులు
తాము నిధులను మళ్లించలేదని చెబుతూ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ప్రజల్ని మరోసారి మోసగించేందుకు యత్నించింది. కానీ చిట్‌ఫండ్స్‌ చట్టానికి విరుద్ధంగా బ్రాంచి కార్యాలయాల్లోని నిధులను హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి మళ్లించినట్టు సీఐడీ సోదాల్లో వెల్లడైంది. చట్ట ప్రకారం బ్రాంచి మేనేజర్‌ (ఫోర్‌మేన్‌)కు ఉండాల్సిన చెక్‌ పవర్‌తో సహా ఎలాంటి అధికారాలు లేనే లేవు. బ్యాంకు వ్యవహారాలు, చెక్‌ పవర్‌ అంతా హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ ఎండీ శైలజతోపాటు ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలోని 11 మందికే ఉంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చందాదారులకు చెందిన సొమ్మును నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్‌ ఫండ్స్, ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్, తమ అనుబంధ కంపెనీల్లో పెట్టుబడులుగా పెట్టారు. ఆ సంస్థ బ్యాలన్స్‌ షీట్, కొన్ని బ్యాంకు ఖాతాలను చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ద్వారా పరిశీలిస్తే ఈ విషయాలు బయటపడ్డాయి.

చందాదారులను భయపెట్టేందుకు కాదు.. వారి హక్కుల పరిరక్షణకు
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ చరాస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వం అనుమతిఇవ్వడంపైన కూడా ఆ సంస్థ గగ్గోలు పెడుతోంది. తమ చందాదారులను బెదిరించేందుకే ప్రభుత్వం ఇలా చేసిందని వాదించడం విస్మయపరుస్తోంది. అసలు వాస్తవం ఏమిటంటే.. మార్గదర్శి చందాదారుల హక్కుల పరిరక్షణకు ముందస్తు చర్యగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే రాష్ట్రంలో గత ఏడాది డిసెంబర్‌ నుంచి కొత్త చిట్టీలు వేయడంలేదు. కేంద్ర చట్టాన్ని పాటించాలని రాష్ట్ర చిట్స్‌ రిజిస్ట్రార్‌ చెప్పారు. అందుకు సమ్మతించకుండా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ కొత్త చిట్టీలు వేయడం నిలిపివేసింది. 

దాంతో ఇప్పటికే దాదాపు రూ.400 కోట్ల టర్నోవర్‌ కోల్పోయింది. అప్పటికే కొనసాగుతున్న చిట్టీలను పాడినవారికి చిట్టీల మొత్తాన్ని సక్రమంగా చెల్లించలేకపోతోంది. పలువురు చందాదారులు మార్గదర్శి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా ఫలితం ఉండటంలేదు. వారిలో పలువురు ఇప్పటికే సీఐడీ అధికారులను కూడా ఆశ్రయించారు. దాంతో పరిస్థితిని విశ్లేషించిన సీఐడీ.. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థ మున్ముందు చందాదారుల చిట్టీల మొత్తం మరింతగా ఎగవేసే అవకాశాలున్నాయని గుర్తించింది. ఆ సంస్థ హఠాత్తుగా బోర్డు తిప్పేసినా, కార్యకలాపాలు నిలిపివేసినా చందాదారులు నిలువునా మునిగిపోయే ప్రమాదం ఉందని గ్రహించింది. దాంతో చందాదారుల హక్కుల పరిరక్షణ కోసమే మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన చరాస్తులు రూ.793.50 కోట్లను జప్తు చేసేందుకు సీఐడీకి ప్రభుత్వం అనుమతినిచి్చంది. ఇందులో చందాదారుల ప్రయోజనాలను కాపాడాలనే ఉద్దేశమే తప్ప వారిని బెదిరించాలనే తలంపే ప్రభుత్వానికి లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

అగ్రి గోల్డ్‌ అయితే అలా.. మార్గదర్శి అయితే ఇలానా..!?
చందాదారులు ఎవరూ ఫిర్యాదు చేయనప్పటికీ తమ చరాస్తులను జప్తు చేశారంటూ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ వక్రభాష్యం చెబుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ గతంలో అగ్రిగోల్డ్‌ సంస్థపై కూడా ఖాతాదారులు ఎవరూ ఫిర్యాదులు చేయలేదు. కానీ అగ్రిగోల్డ్‌ సంస్థ అక్రమ డిపాజిట్ల సేకరణ, వాటిపై వడ్డీలు సక్రమంగా చెల్లించకపోవడం, డిపాజిట్ల నిధులను అక్రమ పెట్టుబడులుగా తరలించడం మొదలైన వాటిని ప్రభుత్వమే గుర్తించింది. ఆ అంశాలను చూపిస్తూ అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు అగ్రిగోల్డ్‌ యాజమాన్యాన్ని బ్లాక్‌మెయిల్‌ చేయడం గమనార్హం. 

ఏకంగా అమరావతిలో ఉన్న హాయ్‌ల్యాండ్‌ భూములను తమ పేరిట బదిలీ చేయాలని టీడీపీ ప్రభుత్వంలో ముఖ్య నేత బెదిరించడం అప్పట్లోనే సంచలనం సృష్టించింది. అందుకు అగ్రిగోల్డ్‌ యాజమాన్యం సమ్మతించలేదు. దాంతో డిపాజిట్‌దారుల హక్కుల పరిరక్షణ కోసం కేసు నమోదు చేసి అగ్రిగోల్డ్‌ సంస్థ ప్రతినిధులను అరెస్టు కూడా చేసింది. దీనిపై అప్పట్లో ఈనాడు పత్రిక ప్రభుత్వ చర్యను సమర్థిస్తూ వార్తలు రాసింది కూడా. అదే రీతిలో ప్రస్తుతం మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థ తమ చందాదారులకు చిట్టీల మొత్తం చెల్లించలేని పరిస్థితి ఉన్నందునే ప్రభుత్వం ఆ సంస్థ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీఐడీకి అనుమతిచ్చింది. నాడు అగ్రిగోల్డ్‌ ఆస్తుల జప్తును సమర్థించిన ఈనాడు పత్రిక.. ఇప్పుడు మాత్రం మార్గదర్శి ఆస్తుల జప్తును వ్యతిరేకిస్తుండటం గమనార్హం. అంటే.. అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో అయితే ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని, తమ దాకా వచ్చేసరికి ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోకూడదన్నది రామోజీరావు విధానమన్నది స్పష్టంగా అర్థమవుతుందని నిపుణులు అంటున్నారు.

అగ్రిగోల్డ్‌కు వర్తించిన చట్టాలు మార్గదర్శికి వర్తించవా?
‘చందాదార్లను భయపెట్టే యత్నం’ అంటూ ఈనాడు ప్రచురించిన వార్తలోని అంశాలను ఎవరూ చెప్పలేదు. ఈనాడే ఓన్‌ చేసుకుంది. అగ్రిగోల్డ్‌పై చర్యలు కూడా ఇలాగే మొదలయ్యాయి. అగ్రిగోల్డ్‌పై ఏ ఫిర్యాదులూ లేకుండానే కేసులు, అరెస్టులు జరిగాయి. అప్పుడు ఇదే పత్రిక మొదటి పేజీలో పుంఖానుపుంఖాలుగా వార్తలు రాసింది. అప్పు­డు అగ్రిగోల్డ్‌ను కాపాడేందుకు ఇలాంటి వా­ర్తే ఎందుకు రాయలేదు? అగ్రిగోల్డ్‌కు వర్తించిన చట్టాలు, సూత్రాలు ఇప్పుడు మార్గదర్శికి వర్తించవా? మార్గదర్శిదే వ్యాపారం కానీ, అగ్రిగోల్డుది వ్యాపారం కాదా? 
– సీనియర్‌ జర్నలిస్టు దారా గోపి.

ఇది కూడా చదవండి: చంద్రబాబు ‘కరకట్ట నివాసం జప్తు’పై ముగిసిన వాదనలు.. జూన్ 2న తీర్పు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement