జబర్దస్త్ బందోబస్తు
జబర్దస్త్ బందోబస్తు
Published Tue, Jul 26 2016 2:06 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
సాక్షి ప్రతినిధి, నల్లగొండ :
పుష్కరాలను సజావుగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. సగటు పుష్కర భక్తుడు కించిత్ కూడా ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పుష్కర ఘాట్లకు వెళ్లేందుకు, వచ్చేందుకు వేర్వేరు మార్గాలు కేటాయిస్తున్నామని.. 189 సీసీ కెమెరాలతో నిఘా పెట్టినట్లు వివరించారు. పుష్కారాలు జరిగే 12 రోజులపాటు యాదగిరిగుట్టకు ప్రత్యేక బందోబస్తు చర్యలు తీసుకుంటున్నామని.. భక్తులు, ప్రజలు పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. పుష్కరాల నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్లపై ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు మీకోసం..
సాక్షి: నమస్తే ఎస్పీ గారూ...! కృష్ణా పుష్కరాల భద్రత కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఎంత మంది పోలీసు సిబ్బందిని వినియోగించుకుంటున్నారు?
ఎస్పీ: పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం ఏడు వేల మంది సిబ్బందిని బందోబస్తు కోసం ఉపయోగించుకుంటున్నాం. 2వేల మంది మన జిల్లా సిబ్బంది కాగా, మిగిలిన సిబ్బంది ఖమ్మం, వరంగల్‌సిటీ, రూరల్, మెదక్, సైబరాబాద్ ఈస్ట్, వెస్ట్‌కు చెందిన వారు. ఇందులో ఇద్దరు అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఉంటారు. 15 మంది డీఎస్పీలు, 60 మంది సీఐలు, 150 మంది ఎస్‌ఐలుంటారు. మిగిలిన వారు కానిస్టేబుళ్లు, హోంగార్డులు.
సాక్షి: ఘాట్ల వద్ద చేపడుతున్నæ ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు ఏమున్నాయి?
ఎస్పీ: పుష్కర ఘాట్ల వద్ద క్లోజ్డ్ సర్క్యూట్ (సీసీ) కెమెరాలతో పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం 28 పుష్కర ఘాట్ల వద్ద 180 సీసీ కెమెరాల ఏర్పాటు కోసం రూ.48లక్షల నిధులు వచ్చాయి. భక్తులు ఎక్కువగా వస్తారని భావిస్తున్న నాగార్జునసాగర్, వాడపల్లి, మఠంపల్లిలో ఘాట్ల వద్ద 40 చొప్పున 120 కెమెరాలు పెడుతున్నాం. మిగిలిన చోట్ల 60 కెమెరాలను పంపిణీ చేస్తాం. మూడు వీఐపీ ఘాట్ ప్రాంతాల్లో వద్ద పోలీస్ కంట్రోల్ రూంలుంటాయి. ఈ కంట్రోల్ రూంలనుంచి సీసీ కెమెరాలను పర్యవేక్షిస్తాం. పుష్కరాలు ముగిసిన తర్వాత ఈ సీసీ కెమెరాలను జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, దేవరకొండ పట్టణాల్లో అమర్చుతాం. మరో విషయం ఏమిటంటే... 100 ఎంబీపీఎస్ సామర్థ్యం కల కేబుల్ లైన్ ఇవ్వాలని బీఎస్‌ఎన్‌ఎల్‌ను అడుగుతున్నాం. వారు కూడా సూత్రప్రాయంగా అంగీకరించారు. ఆ లైన్ ఏర్పాటు చేస్తే కేంద్రీకృత భద్రత వ్యవస్థ ఏర్పాటవుతుంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలే కాదు... సెక్రటేరియల్‌లో కూర్చుని కూడా జిల్లాలోని పుష్కర ఘాట్లలో ఏం జరుగుతుందో చూడవచ్చు.
సాక్షి: పుష్కరాల భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు?
ఎస్పీ: సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో తెలంగాణ పోలీస్ ఎప్పుడూ ముందే ఉంది. ఈసారి పుష్కరాల కోసం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఓ మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నాం. ఈ యాప్‌ను మరో వారం రోజుల్లో విడుదల చేస్తున్నాం. ఇందులో జిల్లాలోని పుష్కర ఘాట్లకు సంబంధించిన పూర్తి సమాచారం ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ ఉన్న ఎవరైనా దీన్ని ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్‌ను చూస్తే పుష్కర ఘాట్ల వద్ద ఎలాంటి పరిస్థితి ఉంది? ట్రాఫిక్ ఏ రూట్లో ఎలా ఉంది? ఎక్కడ జామ్ అయింది? ప్రమాదాలు జరిగిన వివరాలు? తప్పిపోయిన వారి సమాచారం? కంట్రోల్ రూం నెంబర్లు... ఇలా పుష్కర భద్రతకు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. ఏ ఘాట్‌కు ఎక్కడి నుంచి ఎలా వెళ్లవచ్చు? ఎలా రావచ్చు? ఎక్కడ పార్కింగ్, హోల్డింగ్ ఏరియాలున్నాయి? లాంటి సమాచారం కూడా పొందుపరుస్తున్నాం. ఈసారి పుష్కరాలకు ఇదే ప్రత్యేకత.
సాక్షి: రాకపోకలు సజావుగా సాగేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
ఎస్పీ: పుష్కర భక్తులు స్నానం చేసి, దైవదర్శనం చేసుకోవడం ఎంత ప్రాధాన్యత కలదో... వెళ్లి రావడం కూడా అంతే ముఖ్యమైనది. అందుకే రోడ్డు మార్గంలో వెళ్లే భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. జిల్లాలోని అన్ని ఘాట్లకు ఒన్‌వేలు ఏర్పాటు చేస్తున్నాం. అంటే పుష్కర ఘాట్‌కు వెళ్లేందుకు ఒక రూట్ ఉంటే... వెళ్లేందుకు మరో రూట్ ఉంటుంది. వెళ్లిన దారిలో వచ్చే పని ఉండదు. తద్వారా ట్రాఫిక్‌జామ్‌లుండవు. ప్రమాదాలు జరగవు. అదే విధంగా పుష్కర స్నానాల కోసం భక్తులను ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వర కే అనుమతిస్తాం. ఆ సమయంలో హైదరాబాద్ – మాచర్లకు వెళ్లే రోజువారీ వాహనాలను దారిమళ్లించి గుర్రంపోడు, నల్లగొండ, మిర్యాలగూడ, వాడపల్లి మీదుగా గుంటూరు జిల్లాకు పంపిస్తాం. అదే విధంగా కృష్ణా జిల్లాకు వెళ్లే వాహనాలను కోదాడ నుంచి ఖమ్మం వైపునకు మళ్లించే ఆలోచన చేస్తున్నాం.
సాక్షి: పార్కింగ్, హోల్డింగ్ ఏరియాల పరిస్థితి ఏంటి?
ఎస్పీ: జిల్లాలో పార్కింగ్, హోల్డింగ్ ఏరియాలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇప్పటికే ప్రతి ఘాట్ వద్ద పార్కింగ్ ప్రదేశాలను గుర్తించి ఏర్పాటు చేశాం. ఘాట్ ఎన్ని మీటర్లుంది... ఆ ఘాట్‌లో గంటకు ఎంతమంది భక్తులు స్నానాలు చేసే వీలుంది... ఆ మేరకు ఎన్ని వాహనాలు వస్తాయనే అంచనాతో ప్రతి చోటా పార్కింగ్‌కు అవసరమైన వందల ఎకరాల స్థలాన్ని తీసుకున్నాం. అదే విధంగా పార్కింగ్ ఏరియాలు నిండిపోయినప్పుడు భక్తుల తాకిడి లేకుండా వాహనాలన్నింటిని దూరంగా నిలిపివేసేందుకు హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేస్తున్నాం. పార్కింగ్, హోల్డింగ్ ఏరియాల్లో మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలుంటాయి. టీషాప్‌లు కూడా ఉంటాయి. రెండు చోట్లా బందోబస్తు ఉంటుంది. జిల్లాలో 25 హోల్డింగ్ ఏరియాలున్నాయి. జాతీయ రహదారులపై వీటిని ఏర్పాటు చేశాం. పార్కింగ్ ఏరియాల్లో క్రేన్, టోయింగ్ వాహనం, మెకానిక్‌లను కూడా అందుబాటులో ఉంచుతున్నాం.
సాక్షి: తొక్కిసలాటలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
ఎస్పీ: ఈసారి పుష్కరాలకు జిల్లాకు సుమారు 1.50 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. ఈ భక్తులు ఎప్పుడు, ఎలా వస్తారన్నది ముందే ఊహించడం కష్టం. ఆ రోజు పరిస్థితిని బట్టి ప్రణాళికలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు ముందు జాగ్రత్తగా ప్రతి ఘాట్‌కు వెళ్లేందుకు దారిసూచికలు ఏర్పాటు చేస్తున్నాం. దారికి ఇరువైపులా ఆర్‌అండ్‌బీ బారికేడింగ్ కూడా చేస్తోంది. ఘాట్ చుట్టూ వల ఏర్పాటు చేస్తాం. అంటే ఘాట్‌పై స్నానం చేసే వాళ్లు నీటి లోపలకు వెళ్లకుండా ఇది అడ్డుకుంటుంది. ఆ మెష్ ఆవల జాలరి బోట్లు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతాం. ఒక్కో ఘాట్ వద్ద ఒక్కో షిఫ్ట్‌లో ఇద్దరు ఈతగాళ్లుంటారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ట్యూబ్‌లు, తాళ్లు ఏర్పాటు చేస్తున్నాం. ఘాట్ల వద్ద పరిస్థితిని పర్యవేక్షించేందుకు జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్డీఆర్‌ఎఫ్) కూడా టీంలను ఏర్పాటు చేస్తోంది. ఈ టీంలో ఒక్కో షిఫ్ట్‌లో 10 మంది సిబ్బంది ఉంటారు. వీరు కూడా ఘాట్లవద్ద ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక పడవల్లో బందోబస్తు చేస్తారు. దేవాలయాల అధికారులతో మాట్లాడి ప్రసాద, అన్నదాన కౌంటర్లను దూరంగా ఏర్పాటు చేస్తాం.
సాక్షి: పుష్కరాల నిర్వహణలో స్వచ్ఛంద సంస్థల పాత్ర ఏ విధంగా ఉండబోతోంది?
ఎస్పీ: ఈ పుష్కరాల కోసం మొత్తం 1500 మంది వలంటీర్లను ఉపయోగించుకుంటున్నాం. అందులో 750 మంది సత్యసాయి సేవాసదన్‌కు చెందిన వారుంటారు. వీరు దేవాలయాల వద్ద, ఘాట్ల వద్ద సేవ చేస్తారు. ఘాట్, దేవాలయ పరిసరాలను శుభ్రంగా ఉంచడంతో పాటు భక్తులకు దైవదర్శనం చేసేందుకు వీరు పనిచేస్తారు. వీరితో పాటు 200 మంది ఎన్‌సీసీ, 550 మంది ఎన్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను ఉపయోగించుకుంటాం. వీరు ట్రాఫిక్‌ను నియంత్రించడంతో పాటు పార్కింగ్, హోల్డింగ్ ఏరియాల్లో పనిచేస్తారు.
సాక్షి: దొంగతనాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మొబైల్ పార్టీలుంటాయా?
ఎస్పీ: పుష్కర భక్తులు దొంగతనాల బారిన పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అన్ని జిల్లాల నుంచి సీసీఎస్ (క్రైం పార్టీ) పోలీసులను రప్పించి ఘాట్ల వద్ద నిఘా ఉంచుతాం. జిల్లాలోని అన్ని మేజర్ బస్టాండుల్లో ఈ నిఘా 24 గంటలు కొనసాగుతుంది. పార్కింగ్ ప్రదేశాల వద్ద ఉన్న ఆర్టీసీ షటిల్ బస్‌స్టాపుల్లో కూడా ఉంటుంది. ఇక, హైదరాబాద్ నుంచి వరంగల్, విజయవాడ, అద్దంకి, మాల్ ప్రధాన రహదారులపై మొబైల్ పోలీస్ పార్టీలు నిరంతరం పహారా కాస్తాయి. ప్రతి 20 కిలోమీటర్లకు ఒక ఎస్‌ఐ ఆధ్వర్యంలో వాహనం ఉంటుంది. ప్రతి 40 కి లోమీటర్లకు ఓ సీఐ పర్యవేక్షక అధికారిగా ఉంచుతాం. అదే విధంగా ప్రతి హైవేని ఓ డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు. ఈ బృందాలు ప్రమాదాల నివారణ, సహాయ చర్యల్లో కీలకంగా ఉంటాయి.
సాక్షి: ఇంకా ఎలాంటి బందోబస్తు చర్యలుంటాయి? సాయుధ బలగాలను ఉపయోగించుకుంటున్నారా?
ఎస్పీ: ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో సాగర్‌కు వచ్చే పుష్కర భక్తులను డ్యాం మీదకు అనుమతించడం లేదు. అన్ని ఘాట్లవద్ద, జిల్లా వ్యాప్తంగా డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌లను గస్తీ తిప్పుతాం. అలాగే ప్రతి ఘాట్ వద్దా 24 గంటల పాటు సాయుధ బలగాలు గస్తీ ఉంటాయి. ప్రతి ఘాట్ వద్ద 20 మంది సభ్యులతో కూడిన ఓ బృందం ఉంటుంది. పుష్కరాలు జరిగినన్ని రోజులు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట వద్ద ప్రత్యేక బందోబస్తు ఉంటుంది. ఒక ఎస్సై, 25 మంది కానిస్టేబుళ్లతో పహారా ఉంటుంది. కృష్ణానదిపై ఉన్న అన్ని బల్లకట్టులను ఆ 12 రోజులు ఆపేయాలనుకుంటున్నాం. సాగర్‌లో బోటింగ్ కూడా నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తున్నాం. మొత్తం మీద పుష్కర స్నానం కోసం జిల్లాకు వచ్చే ఏ ఒక్క భక్తుడు ఇబ్బంది పడకుండా ఇంటికి వెళ్లేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నాం. శాంతియుతంగా పుష్కరాలు ముగియాలంటే పోలీసు కృషితో పాటు ప్రజల సహకారం కూడా అవసరం.
Advertisement
Advertisement