సాఫ్ట్‌వేర్‌ టు ఐపీఎస్‌.. సేవలోనే సంతృప్తి | Nalgonda District New SP Sarath Chandra Pawar Interview | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ టు ఐపీఎస్‌.. సేవలోనే సంతృప్తి

Published Sun, Sep 29 2024 7:21 AM | Last Updated on Sun, Sep 29 2024 7:24 AM

Nalgonda District New SP Sarath Chandra Pawar Interview

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ‘మా నాన్న బాలాజీ పవార్‌. ఆయన డాక్టర్‌. ఎప్పుడూ ప్రజలతో మేమేకం అయ్యేవారు. ఆయనను చూశాక నాకూ అలాగే ప్రజలకు దగ్గరగా ఉండి సేవ చేయాలనిపించేది. అంతేకాదు.. కలెక్టర్లు, ఎస్పీల గురించి నాన్న ఎప్పుడూ చెబుతుండే వారు. నాన్న స్ఫూర్తితోనే సివిల్స్‌ వైపు వచ్చాను’ అని చెప్పారు యువ ఐపీఎస్‌ అధికారి శరత్‌చంద్ర పవార్‌. నల్లగొండ ఎస్పీగా పనిచేస్తున్న ఆయన.. ఐపీఎస్‌ సాధించడానికి స్ఫూర్తినిచ్చిన అంశాలను, తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, ఉద్యోగ జీవితంలో అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. 

నా బాల్యం సికింద్రాబాద్‌లో గడిచింది. పదో తరగతి వరకు మహీంద్రాహిల్స్‌లోని ఆక్జిలియం హైసూ్కల్లో చదువుకున్నాను. నారాయణగూడలోని రత్న జూనియర్‌ కాలేజీలో ఇంటరీ్మడియట్‌ పూర్తిచేశా. ఆ తరువాత జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించి ప్రతిష్టాత్మక విద్యా సంస్థ అయిన ఐఐటీ బాంబేలో సీటు సాధించా. అక్కడ బీటెక్‌ పూర్తి చేశాక ఏడాది పాటు సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేసి.. ఆ తర్వాత స్నేహితులతో కలిసి ఓ స్టార్టప్‌ను అభివృద్ధి చేసి, రెండేళ్లపాటు నిర్వహించా. అయినా, చిన్నతనంలోనే నా మనస్సులో 
నాటుకున్న సేవ అనే బీజం అక్కడ ఉండనీయలేదు.

  •  సాఫ్ట్‌వేర్‌ రంగంలో కేవలం నా కోసం నేను పనిచేస్తున్నట్లుగానే అనిపించేంది. అక్కడ ప్రజలకు సేవ చేసే అవకాశం లేదు. 

  • ఐపీఎస్‌ అధికారిగా ఇప్పుడు ప్రజలకు నేరుగా సేవలు అందించగలుగుతున్నా. నా వద్దకు వచ్చే బాధితులకు న్యాయం చేకూరిస్తే ఎంతో సంతృప్తి ఇస్తుంది.

సాఫ్ట్‌వేర్‌లో ఉంటూనే సివిల్స్‌పై దృష్టి
స్టార్టప్‌లో ఉండగా సివిల్స్‌పై దృష్టిపెట్టాను. సాఫ్ట్‌వేర్‌తో వచ్చే డబ్బులతోనే సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యేవాడిని. రెండుసార్లు అటెంప్ట్‌ చేశా. ఇక మూడోసారి మరింత సీరియస్‌గా తీసుకొని పూర్తిగా సాఫ్ట్‌వేర్‌ రంగాన్ని వదిలేసి సివిల్స్‌కు సిద్ధమయ్యాను. 2015లో సివిల్స్‌ మూడోసారి రాశాను. 2016లో ఐపీఎస్‌కు ఎంపికయ్యాను. శిక్షణ పూర్తయ్యాక 2018 డిసెంబర్‌లో ఏటూరునాగారం అదనపు ఎస్పీగా మొదటి పోస్టింగ్‌ వచ్చిది. ఆ తరువాత రామగుండం ఓఎస్‌డీ, మహబూబాబాద్‌ ఎస్పీగా పనిచేశా. ఆ తరువాత పోలీసు అకాడమీ డిప్యూటీ డైరెక్టర్‌గా, సెంట్రల్‌ జోన్‌ డీసీసీగా, నార్కొటిక్స్‌ ఎస్పీగా చేశా. అక్కడి నుంచి నల్లగొండ ఎస్పీగా వచ్చా.

బాధితులకు న్యాయం చేస్తే ఎంతో తృప్తి
ఐఏఎస్‌ లేదా ఐపీఎస్‌ అయితే నేరుగా ప్రజలకు సేవ చేయొచ్చు. ఐపీఎస్‌ అధికారిగా ఇప్పుడు ప్రజలకు నేరుగా సేవలు అందించగలుగుతున్నా. మా వద్దకు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చూడటం ఎంతో సంతృప్తి ఇస్తోంది. ఇప్పుడు వచ్చే జీతం.. అప్పుడు సాఫ్ట్‌వేర్‌లో వచ్చే జీతం కంటే తక్కువే అయినా.. ప్రజలకు సేవలందించడం ద్వారా ఇప్పుడు కలిగే తృప్తి ముందు అది తక్కువే అనిపిస్తుంది. మహబూబాబాద్‌లో ఎస్పీగా ఉన్నప్పుడు రెండు జాబ్‌ మేళాలు నిర్వహించాను. దాదాపు 1200 మంది గిరిజన యువతకు ఉద్యోగాలు ఇప్పించగలిగా. అది ఎంతో సంతృప్తి ఇచ్చింది. నల్లగొండలో కూడా త్వరలో జాబ్‌ మేళాలు నిర్వహిస్తాం. ప్రస్తుతం యువత గ్రూప్స్‌కు ప్రిపరేషన్‌లో ఉంది. అవి పూర్తయ్యాక జాబ్‌మేళా నిర్వహిస్తాం.

కుటుంబ నేపథ్యం ఇదీ..
ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ తండ్రి బాలాజీ పవార్‌ ప్రభుత్వ వైద్యుడు. ఆయన ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో పనిచేశారు. ఎక్కువ కాలం నిజమాబాద్‌లో పనిచేశారు. ఆ తరువాత సంగా రెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో వైద్యారోగ్య శాఖ అధికారిగా పనిచేశారు. తల్లి గృహిణి. శరత్‌చంద్ర భార్య పూజ ఇంటీరియర్‌ డిజైనర్‌. వారికి ఇద్దరు పిల్లలు. సంవ్రీత్, ఐరా. ‘పోలీసు వృత్తిలో రోజూ ఏదోరకమైన ఒత్తిడికి లోనవుతుంటామని, ఎంత ఒత్తిడి ఉన్నా పిల్లలతో కాసేపు గడిపితే అన్నీ మర్చిపోతా..’ అంటున్నారు ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌.

అధిక వేతనం.. అయినా లోటు
ఐఐటీ బాంబేలో బీటెక్‌ పూర్తయ్యాక క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో సన్‌టెక్‌ బిజినెస్‌ సొల్యూషన్స్‌లో జాబ్‌ వచ్చింది. త్రివేండ్రం వెళ్లి అక్కడ ఏడాదిపాటు ఆ సంస్థలో ఇన్నోవేషన్‌ అనలిస్ట్‌గా పనిచేశా. ఆ తరువాత స్టార్టప్‌ ప్రారంభించాం. ఫుడ్‌ ఎన్‌ బ్రేవరేజెస్‌ ఇండస్ట్రీలో (ఎఫ్‌ఎన్‌బీ) రిసోర్స్‌ ఆప్టిమైజేషన్‌ చేశాను. రెండేళ్ల పాటు కొనసాగింది. మొదట ఏడాది జాబ్‌ చేసినప్పుడు వేతనం బాగానే వచ్చేది. స్టార్టప్‌లో ఉన్నప్పుడు బాగానే ఉంది. అయినా ఏదో వెలితిగా ఉండేది. అక్కడ ప్రజలకు సేవ చేసే అవకాశం లేదు. సాఫ్ట్‌వేర్‌ రంగంలో కేవలం నా కోసం నేను పనిచేస్తున్నట్లుగానే అనిపించేంది. నాన్న చూపిన బాటలో నడిచేందుకు సివిల్స్‌ వైపు మళ్లాను. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement