సీఎం సభ.. పిల్లలకు సెలవు!
- ముఖ్యమంత్రి సభలకు ప్రైవేట్ స్కూల్ బస్సుల ఏర్పాటు
- 200 వాహనాలు పంపాలని ఆర్టీఏ అధికారుల హుకుం
- పాఠశాలల్లో తరగతులకు సెలవు .. సిలబస్ పూర్తి కావడం లేదని యాజమాన్యాల ఆవేదన
మంగళగిరి : జిల్లాలో ముఖ్యమంత్రి సభ అంటే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు హడలిపోతున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వం సభలకు ఆర్టీసీ బస్సులను వినియోగించగా వారికి కోట్లాది రూపాయలు బకాయిలు పేరుకుపోవడంతో ట్రెండ్ మార్చారు. కొద్ది రోజులుగా ప్రైవేటు స్కూల్స్ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారు. గత నెల వ్యవధిలో జిల్లాలో 8 సార్లు సీఎం పర్యటించగా ఐటిందిటి ఆర్టీసీ బస్సులను ఉపయోగించగా, చివరి 3 కార్యక్రమాలకు ప్రైవేటు స్కూల్స్ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా..
పాఠశాలల పని దినాల్లో ఎలాంటి ఇతర పనులకు సెలవు ప్రకటించరాదని సుప్రీంకోర్టు ఆదేశాలున్నా, సాక్షాత్తూ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ సైతం స్కూల్ బస్సులను వినియోగించరాదని ఆదేశాలు జారీ చేసినా.. జిల్లా ఉన్నతాధికారి మాత్రం సీఎం సభకు అంటేనే విద్యా, రవాణా శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ప్రైవేటు స్కూల్స్ నుంచి బస్సులు ఏర్పాటు చేయాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. దీంతో మండల అధికారులు తమ ప్రతాపాన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలపై చూపుతున్నారు.
సిలబస్ పూర్తికాక..
ఇప్పటికే సిలబస్ పూర్తి కాక ఇబ్బంది పడుతున్న పాఠశాలలు సీఎం పర్యటనల నేపథ్యంలో సెలవులతో విద్యార్థులకు ఆదివారం సైతం క్లాసులు నిర్వహించి ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
ఇప్పటికే జిల్లాలో 15 రోజుల క్రితం జరిగిన వ్యవసాయ యూనివర్సిటీ శంకుస్థాపన, పొన్నూరు సభలకు సెలవులు ప్రకటించిన యాజమాన్యాలు శనివారం అమరావతిలో జరుగనున్న సీఎం పర్యటనకు బస్సులు ఏర్పాటు చేసి సెలవులు ఇవ్వాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
200 బస్సులు కావాలన్నాం..
దీనిపై జిల్లా రవాణా శాఖలోని ఓ అధికారిని వివరణ కోరగా.. సీఎం అమరావతి పర్యటనకు 200 బస్సులు ఏర్పాటు చేయాలని జిల్లా ఉన్నతాధికారి ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. దీంతో తాము విద్యా శాఖతో కలిసి ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అయితే పాఠశాలలకు అధికారికంగా ఎటువంటి సెలవులు వుండవని, స్కూల్ బస్సులను మాత్రం సీఎం సభకు తీసుకెళ్తామని వివరించారు.