ఆకలి బాధ తీర్చాలని ఆందోళన
-
రోడ్డెక్కిన దీనాపూర్ కళాశాల విద్యార్థులు
-
ప్రదర్శనగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
ఫిరంగిపురం : తమకు కడుపు నిండా శుభ్రమైన తిండి పెట్టాలని కోరుతూ దీనాపూర్ కళాశాల విద్యార్థులు గురువారం ఆందోళన చేపట్టారు. తాగడానికి కనీసం చుక్క నీరు...తింటానికి అన్నం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ గదులు సైతం అత్యంత దారుణంగా ఉన్నాయని వాపోయారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దీనాపూర్‌ఽ విద్యాసంస్థల్లోని రూరల్ క్రిస్టియన్ జూనియర్ కళాశాల ఇంటర్ విద్యార్థులు ప్రదర్శన చేసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. నాలుగు నెలలుగా హాస్టల్ నిర్వాహకులకు సమస్యలు తెలియజేసినా తమ గోడు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వసతులు లేకుండా తాము కళాశాలలో చదువులు కొనసాగించలేమని చెప్పారు. నవ్యాంధ్ర సీ విద్యార్థి జేఏసీ జిల్లా అద్యక్షుడు కుర్రం శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం మండల అధ్యక్షుడు ప్రశాంత్ ఆధ్వర్యంలో విద్యార్థులు రోడ్డుపైకి వచ్చారు. దీనాపూర్ డౌన్ డౌన్, హాస్టల్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి, మేనేజ్‌మెంట్ వైఖరి మార్చుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా తహశీల్దారు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. కార్యాలయం ఎదటు బైఠాయించి నిరసన తెలిపారు. ఆకలి మంటలతో అలమటిస్తున్నా తమ గురించి కళాశాల యాజమాన్యం పట్టించుకోవడం లేదని కన్నీరుమున్నీరయ్యారు. ధర్నా చేస్తున్న సమయంలో నవీన్ అనే విద్యార్థి సొమ్మసిల్లి పడిపోయాడు.
అర్ధాకలితో ఆవేదన.....
60 మంది విద్యార్థులు హాస్టల్లో ఉంటే 40 మందికి సరిపడా నాణ్యత లేని అన్నం తెచ్చి సర్దుకోమంటున్నారని విద్యార్థులు తెలిపారు. అర్ధాకలితో అల్లాడిపోతున్నామని చెప్పారు. నిత్యం ఇదే తంతు కొనసాగుతోందని పేర్కొన్నారు. శుభ్రత లేని నీటి వాడకం కారణంగా చర్మవ్యాధుల బారిన పడుతున్నామని చెప్పారు. మురుగుదొడ్లు లేకపోవడంతో బహిరంగ ప్రాంతాల్లో మలవిసర్జనకు వెళుతున్నామని పేర్కొన్నారు. వార్డెన్ ప్రేమానందం తీరు మరింత ఆందోళన కలిగిస్తుందన్నారు.
నూరు శాతం మంది నిరుపేదల పిల్లలే.....
అక్కడ కూలి పనుల చేసుకునే నిరుపేదల పిల్లలే నూరు శాతం మంది ఉంటారు. కనీసం కళాశాల ఫీజు కూడా చెల్లించలేని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వం అందించే స్కాలర్‌షిప్‌తో దీనాపూర్‌లో చేర్పిస్తారు. వసతి కల్పించి మంచి విద్యనందిస్తారని నమ్మి పిల్లలను వదిలి వెళుతున్నారు. ఆ తర్వాత వారి దీనావస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. హాస్టల్ నిర్వాహకులు ఆడిందే ఆటగా...పాడిందే పాటగా వ్యవహరించడంతో విద్యార్థుల కడుపులు మాడుతున్నాయి.
వారంలో పరిష్కారం...
తహసీల్దారు జే పార్థసారథి వద్ద విద్యార్థులు సమస్యలను ఏకరువు పెట్టి వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన తహసీల్దారు అప్పటికే అక్కడకు చేరుకున్న కళాశాల ప్రిన్సిపాల్ పి.మోజెస్, ఫిజికల్ డైరెక్టర్ హృదయరాజులతో చర్చించారు. వారం రోజుల వ్యవధిలో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తహశీల్దారు సూచనలతో విద్యార్ధులు నిరసన కార్యక్రమాన్ని నిలపివేసి కళాశాలకు తిరిగివెళ్ళారు. తాను కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తాననీ, ఇచ్చిన హామీలను నిలుపుకోకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని తహశీల్దారు కళాశాల ప్రతినిధులను హెచ్చరించారు.