గూడు చెదిరె.. గోడు మిగిలె..
* సజ్జవారిపాలెంలో రహదారి పక్కన 40 ఇళ్ల కూల్చివేత
* పోలీసుల సాయంతో ఆర్‌అండ్‌బీ అధికారుల జులుం
* నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారని నిర్వాసితుల ఆవేదన
* మగ పోలీసులే మహిళలను ఈడ్చేచిన వైనం
* రోడ్డున పడిన కుటుంబాలు
వారంతా రెక్కాడితేగాని డొక్కాడని పేదలు.. కూలి పనులకు వెళ్లి కడపు నింపుకొనే అభాగ్యులు.. దినదినగండం నూరేళ్ల ఆయుష్షులా వారి జీవనం.. ఉండేందుకు కొంత చోటే వారికి ఆధారం.. నలభై ఏళ్ల నుంచి అక్కడ గూడు నిర్మించుకొని బతకుడీస్తున్న దీనులపై ‘ఖాకీ’ క్రౌర్యం ప్రదర్శించింది.. ‘అధికారం’ అరాచకం సృష్టించింది.. ఉన్నపళ్లంగా గూళ్లు వీడి పోవాలని హుకుం జారీ చేసింది.. అన్నంత పనీ చేసింది. దిక్కు మొక్కులేని జనాలగోడు కన్నీటి సంద్రమైంది.
– సజ్జావారిపాలెం(నగరం)
నగరం మండలంలోని సజ్జావారిపాలెనికి నలభై ఏళ్ల క్రితం కొన్ని కుటుంబాలు వచ్చాయి. ఉండేందుకు రోడ్డు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఇళ్లు నిర్మించుకున్నాయి. అక్కడే జీవనం సాగిస్తున్నాయి. ఇన్నేళ్ల తర్వాత రహదారి అభివృద్ధి పేరుతో ఆర్‌అండ్‌బీ అధికారులు వారికి ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా ఆదివారం పోలీస్ బలగాలతో వచ్చి 40 ఇళ్లు కూల్చివేయించారు. దీంతో నిర్వాసితులు ఆవేదనతో అడ్డుపడ్డారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిర్వాసితులకు సీపీఎం నాయకులు మద్దతు ఇచ్చి వెంట నిలబడ్డారు. సుమారు గంటకుపైగా నిర్వాసితులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
పోలీసుల జులం..
రహదారి పక్కన నివసిస్తున్న పేదలపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇళ్లు కూల్చివేతను అడ్డుకున్న మహిళలను సైతం మగ పోలీస్‌లే పక్కకు నెట్టి ఈడ్చుకెళ్లారని స్థానికులు చెబుతున్నారు. ఇష్టానుసారంగా కర్రలతో కోట్టారని నిర్వాసితులు వాపోయారు. నలభై ఏళ్లుగా అక్కడే నివసిస్తున్న తమకు కనీసం నోటీసులు జారీ చేయలేదన్నారు. పోలీస్ బలగాలతో పొక్లెయిన్లతో వచ్చిన అధికారులు ఇళ్లు కూల్చివేశారన్నారు. నిన్నా మొన్నా రాస్తారోకో చే శామని, అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూపుతామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు మాట తప్పి ఇలాంటి పనులకు పాల్పడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. నివేశన స్థలాలు చూపించిన తర్వాతే ఇళ్లు తొలగిస్తామని హమీ ఇచ్చి ఇప్పుడు పోలీస్‌లతో వచ్చి ఇళ్లు కూల్చడం సబబు కాదన్నారు.
నిర్వాసితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..
ఇళ్ల కూల్చివేతను అడ్డుకున్న నిర్వాసితులు షేక్ గుల్జార్, సిమ్లా, మౌలాలి, జాన్‌బీ, కె నాంచారమ్మతో పాటు సీపీఎం రేపల్లె డివిజన్ కార్యదర్శి చిక్కాల మణిలాల్, కె.శరత్‌బాబును పోలీసులు అదుపులోకి తీసుకుని నగరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నగరం, చెరుకుపల్లి, చోడాయిపాలెం ఎస్.ఐలు బి.అశోక్‌కుమార్, భాస్కర్, శివాజీ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
నోటీసులు ఇవ్వకుండా జులుం..
నలభై ఏళ్లు ఇళ్లగా ఇక్కడే నివసిస్తున్నాం. ఇళ్లు తొలగించాలని నోటీస్‌లు కూడా ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేశారు. కూలి పనులకు వెళితేనే పూట గడుస్తుంది. ఉన్నపళంగా ఇళ్లు కూల్చితే ఇప్పటికిప్పుడు కట్టుబట్టలతో ఎక్కడికి వెళ్లాలి. పోలీసులను అడ్డంపెట్టుకుని ఇళ్లు తొలగించడం సమంజసం కాదు.
- సుజాత, సజ్జావారిపాలెం