ఇళ్ల ముసుగులో.. దోపిడీ
ఇళ్ల ముసుగులో.. దోపిడీ
Published Sat, Jul 22 2017 11:38 PM | Last Updated on Tue, Sep 5 2017 4:38 PM
- డబ్బులిచ్చుకో... ఇల్లు పుచ్చుకో...!
- కాకినాడలో ఓ నేత కనుసన్నల్లో అడ్డగోలు బాగోతం
- లబ్ధిదారుల ఎంపిక ఏకపక్షం
- ప్రహసనంగా మారిన ప్రధాని ఆవాజ్ యోజన పథకం
కాకినాడ: ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకం ప్రహసనంగా మారింది. పేదలకు దక్కాల్సిన ఇళ్లు అధికార పార్టీల నేతల సిఫార్సుల మేరకు వారి అనుచరులకే దక్కుతుండడంతో అర్హత కలిగిన లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అధికారుల ప్రమేయం లేకుండా లబ్ధిదారులను ఏక పక్షంగా ఎంపిక చేసి రెండు చేతులా సొమ్ము చేసుకుంటున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రమైన కాకినాడలో కీలక నేత కనుసన్నల్లో అవినీతి బాగోతమంతా నడుస్తోంది.
జిల్లాల వ్యాప్తంగా 19,240 ఇళ్లు...
ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకంలో జిల్లాకు 19 వేల240 ఇళ్లను మంజూరు చేశారు. కాకినాడ నగర పాలక సంస్థలో 4,608, రాజమహేంద్రవరంలో 4200, మండపేటలో 4,064, పెద్దాపురంలో 1724, అమలాపురంలో 1636, పిఠాపురంలో 874, సామర్లకోటలో 1048, రామచంద్రపురం 1068 లబ్ధిదారులను ఎంపిక చేశారు. 300,365,403 ఎస్‌ఎఫ్‌టీ కేటగిరీల్లో ప్లాట్లు నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అర్బన్ ప్రాంతాలైన జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో అపార్ట్‌మెంట్ తరహాలో నిర్మాణం చేపట్టేందుకు గడచిన ఆరు నెలలుగా భూసేకరణ ప్రక్రియ, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టారు. అంతవరకూ బాగానే ఉన్నా అర్హత కలిగిన పేద వర్గాలకు దక్కాల్సిన ఇళ్లు మాత్రం దళారుల చేతుల్లోకి వెళ్లి పోతుండడంతో లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. ఎన్నో ఏళ్ళుగా సొంతింటి కోసం కంటున్న కలలు నెరవేరుతాయనుకునే సమయంలో అధికార పార్టీకి చెందిన నేతలు, జన్మభూమి కమిటీ సభ్యులు నచ్చిన వారిని ఎంపిక చేయడంతో లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో లబ్ధిదారుని నుంచి కొన్నిచోట్ల రూ.10 వేలు, మరికొన్ని చోట్ల రూ.20 వేల వరకు ముడుపులు కూడా తీసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
కాకినాడలో అవినీతి దందా...
కాకినాడలో అవినీతిపరుల దందా ఎక్కువైంది. ఇప్పటికే భూముల కబ్జా, ఇతరత్రా వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలే ఇక్కడ కీలక పాత్ర పోషిస్తున్నారు. మార్గదర్శకాలు పక్కన పెట్టి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. వాస్తవానికైతే, ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన పథకం కింద వచ్చిన దరఖాస్తులను పీఎంఏవై వెబ్‌సైట్‌లో నమోదు చేస్తూ వచ్చారు. వచ్చిన దరఖాస్తుల్లో సీనియారిటీ, ప్రాధాన్యతా క్రమంలో అర్హత కలిగిన పేద వర్గాలను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇందు కోసం హౌసింగ్, నగరపాలక సంస్థకు చెందిన సిబ్బందితో సర్వే చేపట్టాల్సి ఉంటుంది. ఇవేమీ లేకుండానే జిల్లా కేంద్రం కాకినాడలో అకస్మాతుగా కీలక ప్రజాప్రతినిధి కార్యాలయం నుంచి ఇళ్లు మంజూరైనట్టుగా కొంతమందికి మెసెజ్ రూపంలో సమాచారం పంపించారు. అసలు ఎవరు ఎంపిక చేశారు.? ఎప్పుడు సర్వే చేశారు? లబ్ధిదారుల జాబితాను ఎవరు, ఎక్కడ ప్రకటించారు? అన్నది వివరాలు వెల్లడించకుండానే సదరు ప్రజాప్రతినిధి నుంచి మెసెజ్‌లు వెళ్లాయి. అందులో క్లారిటీ లేకపోవడంతో మెసెజ్ అందుకున్న లబ్ధిదారులంతా సదరు నేత ఇంటికి క్యూ కట్టారు. అక్కడ స్పష్టత ఇచ్చాక మంజూరైన ఇళ్లకు సంబంధించిన డీడీలు పట్టుకుని కార్పొరేషన్ కార్యాలయానికి ఎగబడ్డారు.
తమ్ముళ్ల చేతివాటం ...
ఇళ్ల మంజూరులో తెలుగు తమ్ముళ్లు చేతివాటం ప్రదర్శించినట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో ఇంటికి రూ.20 వేలు చొప్పున వసూళ్లు చేసినట్టు కొందరు లబ్ధిదారులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. ముడుపులిచ్చాకే ఇళ్లు అన్నట్టుగా సంకేతాలివ్వడంతో తప్పని పరిస్థితుల్లో చెల్లించుకుంటున్న పరిస్థితి నెలకుంది. మిగతా మున్సిపాల్టీల్లో కూడా రూ.10 వేల నుంచి రూ. 20 వేల వరకు ముడుపులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
కాకినాడలో కొందరి తమ్ముళ్ల తిరుగుబాటు
కాకినాడలో తెలుగు తమ్ముళ్లందర్నీ సదరు నేత సంతృప్తి పరచలేదు. కొందరికే ప్రాధాన్యత ఇచ్చి మిగతా కొందర్ని విస్మరించారు. దీంతో లబ్ధి చేకూరని తెలుగు తమ్ముళ్లంతా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. వీరంతా శనివారం ఆందోళనకు దిగేందుకు సన్నద్ధమవ్వగా విషయం తెలిసి సదరు కీలక నేత హుటాహుటిన వారందర్నీ బుజ్జగించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. వారిని సంతృప్తి పరిచేందుకు జాబితాలో స్వల్ప మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
అడ్డగోలుగా లబ్ధిదారుల ఎంపిక
ప్రధానమంత్రి ఆవాజ్ యోజన పథకాన్ని ఏ శాఖ పర్యవేక్షిస్తుందనే అంశంపై కూడా స్పష్టత లేకపోయింది. గతంలో ఇళ్ల కోసం అర్హులైన వారినుంచి డీడీలు తీసుకున్నారు. వారి జాబితాలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ జాబితాలో ఉన్న వారికి మొదట ప్రాధాన్యం కల్పించి, మిగతా వారిని ఎంపిక చేయాలి. ఒక్క కాకినాడ విషయానికొస్తే గతంలో వచ్చిన వాటిలో 1200 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా సుమారు 39 వేల దరఖాస్తులొచ్చాయి. పెండింగ్‌లో ఉన్న వాటికి ప్రాధాన్యతనిచ్చి, తాజాగా వచ్చిన వాటిలో ప్రాధాన్యత మేరకు ఎంపిక చేయాలి. అదికూడా గృహ నిర్మాణశాఖ ఆధీనంలో ఎంపిక జరగాల్సి ఉండగా ప్రస్తుతం నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీలకు అప్పగించారు. లబ్ధిదారుల ఎంపికపై గృహనిర్మాణ సంస్థ అధికారులను వివరణ కోరితే అంతా కార్పొరేషన్ చూసుకుంటుందని చెబుతున్నారు. కార్పొరేషన్ అధికారులను అడిగితే కేవలం దరఖాస్తులను స్వీకరించి ఆన్‌లైన్ మాత్రమే చేస్తున్నామని, ఉన్నతాధికారుల సూచన మేరకు డీడీలు మాత్రమే తీసుకుంటున్నామని చెబుతున్నారు. మరి లబ్ధిదారులను ఎవరు ఎంపిక చేశారంటే మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు.
దరఖాస్తులు ఆన్‌లైన్ మాత్రమే చేశాం...
గృహ నిర్మాణ లబ్ధిదారులకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను ఆన్‌లైన్ చేశాం. ఎంపికైన లబ్ధిదారుల నుంచి డీడీలు తీసుకున్నాం. ఎంపిక ప్రక్రియపై టౌన్‌ప్లానింగ్ విభాగానికి సంబంధం లేదు.
– కాలేషా, సిటీప్లానర్, కాకినాడ
Advertisement