
నా టాలెంట్‌ను ఎలా గుర్తించాలి సార్?
పిల్లలు సంధించిన ప్రశ్నలు.. తికమకపడ్డ పెద్దలు
(తిరుమల నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): సార్, నా పేరు శ్రీకాంత్. ప్రతి ఒక్కరికీ దేవుడు ఏదో ఒక టాలెంట్ ఇచ్చారంటారు గదా.. మరి నాలో ఏ టాలెంట్ ఉందో ఎలా గుర్తించడం..?
బాలల సైన్స్ కాంగ్రెస్ సందర్భంగా ప్రముఖ విద్యావేత్తలతో నిర్వహించిన ముఖాముఖిలో పిల్లలు సంధించిన ప్రశ్నలివి. పిల్లలు అడిగే ప్రశ్నలకు వేదికపైనున్న పెద్దలు సహా హాలంతా నవ్వులతో ఘొల్లుమంది. విద్యార్థులు– జ్ఞాపకశక్తి, అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు మార్గాలు అనే అంశంపై గురువారం మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శినీ ఆడిటోరియంలో సదస్సు జరిగింది.
ఈ సదస్సుకు కాకినాడ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఎస్‌ఎస్ కుమార్, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దుర్గాభవానీ, స్విమ్స్ డైరెక్టర్ టీఎస్ రవికుమార్ సహా పలువురు విద్యా వేత్తలు హాజరయ్యారు. కుమార్ ప్రసంగం అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. వాటిలో నవ్వులు పూయించిన ప్రశ్నలు, సమాధానాల్లో కొన్ని..
విద్యార్థి: మనిషి మెదడులో మూడు భాగాలుంటాయి కదా సార్.. ఏ భాగంలో జ్ఞాపకశక్తికి సంబంధించినది ఉంటుంది సార్?
వీసీ: నీవు ఎన్నో తరగతి చదువుతున్నావు.. (ఏడో తరగతి సార్.. విద్యార్థి సమాధానం) నీకు ఎవరు చెప్పారు మూడు మెదళ్లు ఉంటాయని.. దేవుడు మనకిచ్చిన వరం మన మెదడు. అందులో చాలా స్వల్ప శాతమే మనం వినియోగించుకుంటున్నాం. మనం దేన్నయితే గుర్తుపెట్టుకుంటామో దానికి మనం అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్న మాట.
గుర్తు లేదు అంటే మనం ప్రాధాన్యత ఇవ్వడం లేదని అర్థం. మన మెదడుకు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఏక కాలంలో మనం సమాంతరంగా ఆలోచనలు కూడా చేస్తుంటాం. యోగా చేస్తున్నప్పుడు సైతం మనకు అనేక ఆలోచనలు వస్తుంటాయి. మీరు పిల్లలు గనుక మీరు చదువుకు సంబంధించిన వస్తుంటాయి. అదే పెద్దవాళ్లకయితే వాళ్ల కుటుంబం, ఆఫీసు వ్యవహారాలు, ఎవరితోనైనా ఏదైనా పని ఉంటే ఆ పనికి సంబంధించిన విషయాలు గుర్తుకువస్తుంటాయి.
విద్యార్థి: దేవుడు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక టాలెంట్ ఇచ్చాడంటారు గదా. మరి నాలో ఏ టాలెంట్ ఉందో ఎలా గుర్తించాలి సార్?
వీసీ: అవునమ్మా.. నీలో ఏమి టాలెంట్ ఉందో చిన్నప్పుడే గుర్తించడం కష్టం. అయితే కొందరిలో అవి చిన్నతనంలోనే బయటపడతాయి. మిగతా వాళ్లకు ఓ వయస్సు వచ్చే వరకు తెలియదు. మన దేశంలో దురదృష్టవశాత్తు మీ తల్లిదండ్రుల ఆశలు, ఆకాంక్షలే మీ భవిష్యత్‌ను నిర్దేశిస్తున్నాయి. ఆ పరిస్థితి పోవాలి. పదో తరగతి లోపు మీరు ఏమి కావాలనుకుంటున్నారో మీకు అర్థమవుతుంది. దాన్ని మీ తల్లిదండ్రులకు, టీచర్లకు చెప్పండి. మీకు ఏది ఇష్టమో ఆవైపు పోయేలా చూసుకోండి.