ఇట్లయితే ఎట్టా బతకాలమ్మా?
- కాల్వల శుభ్రత లేదు..
దోమల నియంత్రణ పట్టదు
- అర్ధరాత్రి నీటి సరఫరా
- ఎంపీ బుట్టా రేణుక ఎదుట సమస్యలను
ఏకరువు పెట్టిన పాతబస్తీవాసులు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ‘కాల్వల్లో పూడిక పేరుకుపోతున్నా తొలగించరు.. ఫలితంగా దుర్వాసనతోపాటు దోమల బెడద పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం.. కుళాయిలకు అర్ధరాత్రి సమయాల్లో నీటిని సరఫరా చేస్తుండడంతో నిద్ర మేల్కొని జాగరణ చేయాల్సి వస్తోంది.. ఇలా ఎంతకాలం’ అంటూ కర్నూలు నగర పాతబస్తీవాసులు ఎంపీ బుట్టా రేణుక వద్ద ఏకరువు పెట్టారు. వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ ఇటీవలే 3, 4, 5 వార్డుల్లో పర్యటించారు. కుమ్మరివీధి, నాయీబ్రాహ్మణుల వీధి, ఛత్రీబాగ్, బండిమెట్ట ప్రాంతాల్లోని ప్రజలు సమస్యలతో సహవాసం చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆదివారం పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక వార్డు పర్యటనలో భాగంగా ఆయా ప్రాంతాలను సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘క్లీనింగ్ లేదు, దోమల నివారణా లేదు, అర్ధరాత్రి నీళ్లు వస్తే ప్రజలు ఎలా పట్టుకుంటారు.. వాసన వచ్చే నీళ్లు ఎలా తాగుతారు.. పాతబస్తీ ప్రజలు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమృత్ పథకం కింద కేంద్రం నుంచి విడుదలవుతున్న నిధులను సక్రమంగా వినియోగిస్తామని రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇవ్వాల్సి ఉందన్నారు. బండిమెట్ట వీధిలో నిర్మించిన పురుషుల మరుగుదొడ్లు ఆరేళ్లుగా ప్రారంభానికి నోచుకోలేదని, మహిళల మరుగుదొడ్లలో సరైన నీటిసదుపాయం లేకపోవడం వల్ల వాడుకోలేకపోతున్నారని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. నాగమయ్యకట్టకు అరుగు నిర్మించాలని, దోమల బాధ నుంచి గట్టెక్కించాలని, మంచినీటి ఎద్దడిని నివారించాలని, సీసీరోడ్లు, కాల్వలు నిర్మించాలని కోరారు. 34-102 ఇంటి వద్ద బోరింగ్ పనిచేయడం లేదని, వీధిలైటు లేదని స్థానికులు ఎంపీకి విన్నవించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత సమస్యలపై అధికారులతో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీ వారకి హామీ ఇచ్చారు. హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ కాలువలను వారం రోజులకోసారి కూడా శుభ్రం చేయడం లేదని, దోమల నివారణలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని పేర్కొన్నారు. నిర్వహణ లోపం వల్ల పాతబస్తీ ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, నగరపాలక సంస్థ అధికారులు అవసరమైతే ఎక్కువమంది సిబ్బందిని నియమించి సమస్యలు తీర్చాలని కోరారు. వారి వెంట పార్టీ నాయకులు ఎస్.ఎ.రహ్మాన్, బోదెపాడు భాస్కర్‌రెడ్డి, రవీంద్రనాథ్‌రెడ్డి, హరినాథ్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, శేషుబాబు, మాజీ కార్పొరేటర్ దాదామియ్య, డి.కె.రాజశేఖర్, పేలాల రాఘవేంద్ర, మహ్మద్ తౌఫిక్ తదితరులు పాల్గొన్నారు.