మానవహక్కుల కమిషన్ స్పందన
-
రాష్ట్ర చీఫ్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీలకు నోటీసులు
-
జనవరి 25వ తేదీనాటికి సమగ్రSనివేదిక ఇవ్వాలని ఆదేశం
నరసరావుపేట టౌన్: ప్రభుత్వాస్పత్రుల్లో పేదలు మృతి చెందితే ఆయా మృతదేహాలను తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు గుర్తు తెలియని మరణాలు సంభవించినప్పుడు శవాలను అంతిమ సంస్కారానికి తీసుకెళ్లేందుకు పోలీసులు అవస్థలు పడుతున్నారు. దీనిపై ఈ నెల ఆరో తేదీన సాక్షి దినపత్రికలో చచ్చినా చావే అనే శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా మృతదేహాల తరలింపులో తీసుకుంటున్న చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని శుక్రవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. తొలుత నరసరావుపేట పట్టణానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ మాడిశెట్టి మోహనరావు మృతదేహాల తరలింపులో ఇబ్బందులపై సాక్షి కథనం ఆధారంగా మానవహక్కుల కమీషన్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన కమీషన్ మానవహక్కుల పరిరక్షణ చట్టంలో భాగంగా మృతదేహాల తరలింపులో అధికారులు వ్యవహరిస్తున్న నిర్లక్ష్యం హక్కుల ఉల్లంఘనగా పరిగణించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యశాలల్లో చికిత్స పొందుతూ ఆయుషు తీరిన మృతులు, అనాథ శవాల తరలింపులో ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై వచ్చే ఏడాది జనవరి 25వ తేదీనాటికి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కేసులో ప్రతివాదులుగా ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ, హోమ్ సెక్రటరీలను చేర్చి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు మోహనరావు తెలిపారు.