హైదరాబాద్ మహా నగరాన్ని డిల్లీ, చంఢీ ఘర్ తరహాలో కాలుష్య నివారణ కోసం కిరోసిన్ ఫ్రీ సిటీగా మార్చేందుకు పౌరసరఫరాల శాఖ నడుంబిగించింది. నగరంలో కిరోసిన్ వినియోగం నివారించేందుకు గ్యాస్ కనెక్షన్ ఉంటేనే బీపీఎల్ కుటుంబాలకు కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ లేకుండా కార్డులు కలిగి ఉన్న బీపీఎల్ కుటుంబాలు సైతం విధిగా వంట గ్యాస్ వినియోగించే విధంగా చర్యలకు ఉపక్రమించింది.
సర్కిల్ వారిగా గ్యాస్ కనెక్షన్లు లేని కుటుంబాలను గుర్తించి నేరుగా తక్షణమే వంట గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసే విధంగా ఆయిల్ కంపెనీల డిస్ట్రిబ్యూటర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ చౌకధరల దుకాణాల డీలర్లు కార్డు దారులకు వంటగ్యాస్ కనెక్షన్లు ఇప్పించే విధంగా బాధ్యతలు అప్పగించారు. మరోవైపు కొత్త కార్డుల జారీలో గ్యాస్ కనెక్షన్ తప్పని సరిగా నిబంధనను అమలు చేస్తోంది. బీపీఎల్ కుటుంబాలు పూర్తి స్థాయిలో వంటగ్యాస్ ను వినియోగిస్తే కిరోసిన్‌ను పూర్తిగా నివారించవచ్చని పౌరసరఫరాల శాఖాధికారులు యోచిస్తున్నారు.