- తక్కువ ధరలకే కోట్ చేసేలా మిల్లర్లతో చర్చలు
హైదరాబాద్
రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ లబ్ధిదారులకు సరఫరా చేసే రాయితీ కందిపప్పు సేకరణపై ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. వచ్చే మూడు నెలల కాలానికి పప్పు సేకరణ, తక్కువ ధరకే టెండర్లు వేసేలా దాల్ మిల్లర్లతో చర్చలు ఆరంభించింది. మంగ ళవారం రాష్ట్ర ఆర్ధిక, పౌరసరఫరాల శాఖా మంత్రి ఈటల రాజేందర్, పౌర సరఫరాల శాఖ కమీషనర్ రజత్‌కుమార్‌లు దాల్ మిల్లర్లతో సచివాలయంలో చర్చలు జరిపారు. రెండు, మూడు రోజుల్లో కందిపప్పు టెండర్లు పిలువనున్న నేపథ్యంలో మంత్రి మిల్లర్లతో చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గతంతో పోలిస్తే కంది సాగు విస్తీర్ణం పెరగడం, మార్కెట్‌లో ధర తగ్గిన దృష్ట్యా తక్కువ ధరలకే టెండర్ కోట్ చేసి ప్రభుత్వానికి సహకరించేలా మిల్లర్లకు విజ్ఞప్తి చేశారు. సరైన సమయానికి పప్పు అందించడంతో మిల్లర్లు విఫలమవుతున్నందున ప్రస్తుత టెండర్ నిబంధనల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ నిర్నయం చేసినట్లు మంత్రి వారికి వివరించినట్లుగా తెలిసింది. ఇదే సందర్భంగా..ప్రభుత్వం నిరుపేదలకు రాయితీతో కూడిన పప్పును ఇస్తున్నందున మిల్లర్లు ప్రభుత్వానికి సరసమైన ధరకు పప్పు అందివ్వాలని కోరారు.
ధర విషయంలో మిల్లర్లు ఆలోచించి నిర్ణయం చేయాలని విన్నవించారు. నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, లోకల్ క్వాలిటీని సరఫరా చేయాలని సూచించారు. నాసిరకం పప్పును సరఫరాచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పేదలకు అందాల్సిన పప్పును పక్కదారి పట్టించినా, రీ సైక్లింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.