
పేపర్ లో విడాకుల ప్రకటన, కంగుతిన్న భార్య
హైదరాబాద్: ‘తలాక్..తలాక్..తలాక్’ అంటూ భార్యకు ఉర్దూ దినపత్రికలో ప్రకటన ద్వారా విడాకులిచ్చిన భర్తపై మొఘల్‌పురా పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఇన్‌స్పెక్టర్ దేవేందర్ కథనం మేరకు... శాస్త్రిపురం కింగ్స్‌కాలనీ కి చెందిన ముస్తాక్ ఉద్దీన్, నాజ్మీన్‌కు 2015 జనవరిలో వివాహం జరిగింది. ఐదునెలల అనంతరం దంపతులిద్దరూ సౌదీకి వెళ్లారు. ఈ ఏడాది ఫిబ్రవరి 2న భార్యాభర్తలు నగరానికి వచ్చారు.
19న నాజ్మీన్ మొఘల్‌పురాలోని తల్లిగారింటికి రాగా, 24న ముస్తాక్ ఉద్దీన్ భార్యకు చెప్పకుండా తిరిగి సౌదీకి వెళ్లాడు. అదే రోజు ఫోన్ చేసి తలాక్ నోటీసులు పంపిస్తున్నట్లు చెప్పిన అతను గత నెలలో ఒక ఉర్దూ దినపత్రికలో తలాక్ అంటూ విడాకుల ప్రకటన ఇచ్చాడు. దీంతో కంగుతిన్న నాజ్మీన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితునిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.