ఇంత ఆనందం ఎన్నడూ లేదు: నరసింహన్
⇒ తన పుట్టినరోజు వేడుకల్లో నరసింహన్ 72వ పడిలో అడుగుపెట్టిన గవర్నర్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, కేసీఆర్, చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: తాను ఇన్నేళ్లుగా పుట్టిన రోజులు జరుపుకొంటున్నా.. ఇప్పుడున్నంత ఆనందంగా ఎన్నడూ లేనని తన 71వ పుట్టినరోజు సందర్భంగా గవర్నర్ నరసింహన్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి గవర్నర్ కావడం, పురోగమిస్తున్న రాష్ట్రంలో తన భాగస్వామ్యం ఉండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గవర్నర్ నరసింహన్ శుక్రవారం 72వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా రాజ్‌భవన్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విడివిడిగా గవర్నర్‌ను కలసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లిన చంద్రబాబు గవర్నర్‌కు శుభాకాంక్షలు చెప్పారు. నరసింహన్‌తో కేక్ కట్ చేరుుంచి తినిపించారు. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. నరసింహన్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కేసీఆర్ వెంట శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు గవర్నర్ నరసింహన్‌ను కలసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రముఖుల సందడితో రాజ్‌భవన్‌లో పండుగ వాతావరణం కనిపించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, పలువురు ఏపీ అధికారులు గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ గవర్నర్ ధన్యవాదాలు తెలిపారు.
ప్రధాని శుభాకాంక్షలు
గవర్నర్ నరసింహన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్ష లు తెలిపారు. శుక్రవారం ఉదయాన్నే గవర్నర్‌కు ప్రధాని ఫోన్ చేశారు. నిండు నూరేళ్లు, మంచి ఆరోగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు.
గవర్నర్‌కు జగన్ శుభాకాంక్షలు
గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ఏపీ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
ఈ రోజును జీవితంలో మర్చిపోలేను
‘‘నేను 70 ఏళ్లుగా పుట్టిన రోజులు జరుపుకొంటున్నా.. ఇంత ఆనందంగా ఎన్నడూ లేను. ఇంత మంది వచ్చారు. మొత్తం రాష్ట్రమంతా ఇక్కడే ఉన్నట్టుంది. నేను రాష్ట్రాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఈ పుట్టిన రోజును జీవితంలో మరిచిపోలేను. తెలంగాణకు మొదటి గవర్నర్ కావడం, పురోగమిస్తున్న రాష్ట్రంలో నా భాగస్వామ్యం ఉండడం ఆనందంగా ఉంది. భవిష్యత్తులో తెలంగాణ గురించి మాట్లాడుకున్నప్పుడు నేను ఆ రాష్ట్రానికి మొదటి గవర్నర్‌గా పనిచేశాననే తృప్తి నాకుంటుంది.
కేసీఆర్ నాయకత్వంలో ప్రతి ఒక్కరు సమష్టిగా కష్టపడుతున్నారు. మీ కృషి అద్భుతం. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామనే నమ్మకం మీలో కనిపిస్తోంది. 29 నెలలుగా ఈ రాష్ట్రాన్ని గమనిస్తున్నాను. ఎంతో పురోగమించింది. ఇదే వేగంతో ఎన్నో మైలు రాళ్లు అధిగమిస్తుందనే విశ్వాసం నాకుంది. నేను, సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఎప్పుడూ అభివృద్ధి గురించే చర్చించుకుంటాం..’’ - గవర్నర్ నరసింహన్