ఖమ్మం : అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పుస్సా వెంకటేశ్వర్లు (35 ) తాపీ మేస్త్రీ గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా అతడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు.
దీంతో అతడు తీవ్ర మనస్తాపం చెందాడు. ఆ క్రమంలో వెంకటేశ్వర్లు సోమవారం తెల్లవారుజామున గ్రామ సమీపంలోని పెద్దవాగు వద్దకు చేరుకుని కొరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. అదే సమయంలో వ్యవసాయ పనుల మీద బావి వద్దకు వెళ్లిన కొందరు రైతులు అది గమనించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.
కానీ వెంకటేశ్వర్లు అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనపై రైతులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వెంకటేశ్వర్లు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.