
సిగపట్లు.. మహిళల బహిరంగ పోరు
భువనేశ్వర్(ఒడిశా): నగరంలో శుక్రవారం ఉదయం సంచలనాత్మక సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ మరో మహిళను నడిరోడ్డు మీద జుట్టు పట్టి జాడించేసింది. ఇదంతా స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రాంగణంలో జరిగింది. దీంతో నగరంలో ఈ సంఘటన వాడిగా వేడిగా చర్చకు దారితీసింది. తన భర్తతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న మరో మహిళపై అకస్మాత్తుగా భార్య బహిరంగ దాడికి దిగడంతో అంతా అవాక్కయ్యారు. వీరిలో ఒకరు పాత్రికేయులు కావడంతో గొడవ మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. విద్యాధికులు ఇలా వీరంగానికి పాల్పడడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
పెళ్లికి ముందు నుంచే కొనసాగుతున్న వివాహేతర సంబంధం గురించి తదుపరి దశలో తెలిసిన తరువాత భర్తకు పలు విధాలా భార్య నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోయింది. కొద్ది కాలం గడువు ఇస్తే ఈ సంబంధానికి తెర దించేస్తానని తరచూ భర్త బూటకపు హామీలు ఇస్తూ యథాతథంగా వివాహేతర సంబంధం కొనసాగించడాన్ని సహించలేకపోయినట్లు భార్య వాపోయింది. దీనిపై నగర పోలీసు డిప్యుటీ కమిషనర్ సత్యబ్రొతొ భొయి స్పందించి బాధిత వర్గం ఫిర్యాదు చేయనంత వరకు చేసేదేమీ ఉండదన్నారు. ఇరు వర్గాల మధ్య సయోధ్య కోసం అభ్యర్థన దాఖలైతే రాజీ కుదిర్చేందుకు మధ్యమ విభాగానికి సిఫారసు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
విచారణ జరగాల్సిందే
భర్తతో వివాహేతర సంబంధం వివాదం నేపథ్యంలో రెండు సార్లు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు నమోదు చేసినట్లు బాధిత భార్య పేర్కొంది. మరో వైపు భర్తకు పలు విధాలా నచ్చజెప్పి సంస్కరించేందుకు విఫలయత్నం చేసినట్లు ఆమె వాపోయింది. ఈ నేపథ్యంలో పోలీసులు చొరవకల్పించుకుని విచారణ జరపాలని ఆమె కోరింది.