రంగడు... మహా మాయగాడు! | illicit liquor flow in kurnool district | Sakshi
Sakshi News home page

రంగడు... మహా మాయగాడు!

Published Wed, Jun 15 2016 8:49 AM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM

illicit liquor flow in kurnool district

  • జిల్లాలో జోరుగా కల్తీ మద్యం
  • కర్ణాటక రాష్ట్రం నుంచి భారీగా స్పిరిట్, నకిలీ మూతల సరఫరా
  • డీటీఎఫ్ దాడులతో గుట్టురట్టు
  • పట్టుబడిన పాత నేరస్తుడు రంగన్న
  • ఇది వరలో పలుమార్లు జైలుకు..
  • భారీ లాభాల నేపథ్యంలో తిరిగి ఇదే వ్యాపారం
  •  
    రంగన్న. నకిలీ మద్యం వ్యాపారంలో ఆరితేరిన మాయగాడు. జైలుకు వెళ్లి రావడమంటే.. అత్తగారింటికి వెళ్లొచ్చినట్లే. కాస్త కష్టపడితే.. లాభాలు మూటకట్టుకోవచ్చనే భావన పోలీసులకు పట్టుబడినా తిరిగి అదే వ్యాపారం వైపు నడిపిస్తోంది. పీడీ యాక్ట్ కూడా ఇతన్ని నిలువరించలేకపోవడం చూస్తే.. ఇతనొక్కడే ఈ వ్యాపారంలో లేడనే విషయం ఇట్టే అర్థమవుతోంది. మరి కనిపించని ఆ మద్యం మాఫియాను ఎక్సైజ్ శాఖ ఎందుకు పట్టుకోలేకపోతోంది?

     
     కర్నూలు: జిల్లాలో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. నకిలీ మూతలను కర్ణాటక రాష్ట్రం నుంచి దిగుమతి చేసుకొని బ్రాండ్ మిక్సింగ్ చేసి వ్యాపారాలు సాగిస్తున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా టాస్క్‌ఫోర్స్ విచారణలో వెలుగు చూసింది. జిల్లాలోని మద్యం మాఫియా ఒకవైపు అధిక ధరలకు విక్రయాలు జరుపుతూనే సరికొత్త రూటును ఎంచుకొని ప్రీమియం బ్రాండ్ల మూతలు బాటిళ్లపై ట్యాపింగ్ చేసి బెల్టు దుకాణాల ద్వారా విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం.
     
     మద్యం డైల్యూషన్ అమ్మకాలను అధికార పార్టీ నేతల అండదండలతో జోరుగా సాగిస్తున్నారు. ప్రధానంగా జిల్లాలోని పత్తికొండ, ఎమ్మిగనూరు, కోవెలకుంట్ల, బనగానపల్లె, ఆళ్లగడ్డ, ఆలూరు, ప్రాంతాల్లో మద్యం మాఫియా బెల్టు దుకాణాల ద్వారా ఈ తర హా వ్యాపారం సాగిస్తున్నట్లు సమాచారం.
     
     టాస్క్‌ఫోర్స్ దాడులతో గుట్టురట్టు
     ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జిల్లా టాస్క్‌ఫోర్సు అధికారుల దాడులతో నకిలీ మద్యం గుట్టు రట్టయింది. డీటీఎఫ్ సీఐ కృష్ణకుమార్, ఎస్‌ఐ కిషోర్‌కుమార్ నేతృత్వంలో సోమవారం రాత్రి గోనెగండ్ల మండలం పుట్టపాశంలో దాడులు నిర్వహించి భారీ మొత్తంలో స్పిరిట్, నకిలీ మూతలు.. ఖాళీ సీసాలను స్వాధీనం చేసుకున్నారు. పుట్టపాశం గ్రామానికి చెందిన పాత నేరస్తుడు బోయ రంగన్న, ఆయన కుమారుడు బోయ గోవిందును అదుపులోకి తీసుకొని నకిలీ మద్యం రాకెట్ వెనుక ఎవరున్నారనే సమాచారాన్ని సేకరిస్తున్నారు.
     
      అతని వద్ద నుంచి 10 లీటర్ల స్పిరిట్, 270 నకిలీ మూతలు, 236 ఒరిజినల్ చాయిస్ ఖాళీ సీసాలు, 60 ఎక్సైజ్ అడేసివ్ లేబుళ్ల(ఈఏఎల్)ను స్వాధీనం చేసుకున్నారు. రెండున్నర నెలల క్రితం కూడా రంగన్న ఇంటిపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి భారీ మొత్తంలో నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకొని జైలుకు తరలించారు. బెయిల్‌పై విడుదలై మళ్లీ ఇదే తరహా వ్యాపారం సాగిస్తున్నట్లు ఇన్‌చార్జి డిప్యూటీ కమిషనర్ శ్రీరాములుకు సమాచారం అందడంతో ఆయన ఆదేశాల మేరకు డీటీఎఫ్ అధికారులు దాడులు నిర్వహించారు.
     
     రాష్ట్రం మద్య నిషేధం అమలులో ఉన్నప్పుడు కూడా రంగన్న జిల్లాలో మద్యం వ్యాపారాన్ని కొనసాగిస్తూ పలుమార్లు ఎక్సైజ్ అధికారులకు పట్టుబడి జైలుకు వెళ్లాడు. ఈ తరహా వ్యాపారంలో భారీగా లాభాలు ఉండటంతో ఈ వ్యాపారాన్ని ఆయన కొనసాగిస్తున్నాడు. గతంలో ఈయనపై పీడీయాక్ట్ కూడా అమలు చేసి సుమారు 6 మాసాల పాటు జైలుకు పంపారు. మద్యం బ్రాండ్ మిక్సింగ్ కోసం నకిలీ మూతలు, నకిలీ మద్యం తయారీ కోసం స్పిరిట్, ఎక్కడెక్కడ సరఫరా చేస్తున్నారనే విషయంపై ఎక్సైజ్ అధికారులు ఆరా తీస్తున్నారు.
     
     రాయచూరు కేంద్రంగా నకిలీ మద్యం సరఫరా
     కర్ణాటక రాష్ట్రం రాయచూరు కేంద్రంగా జిల్లాలోకి నకిలీ మద్యంతో పాటు బాటిళ్లు, స్పిరిట్, నకిలీ మూతలు, ఖాళీ సీసాలు సరఫరా అవుతున్నాయి. రాయచూరుకు చెందిన కొంతమంది ముఠాగా ఏర్పడి జిల్లాలోని పలు ప్రాంతాలకు నకిలీ మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు సమాచారం. క్యాన్లలో స్పిరిట్‌ను సరఫరా చేసి రహస్య ప్రాంతాల్లో ఉంచి నకిలీ మద్యాన్ని తయారు చేసి బె ల్టు దుకాణాల ద్వారా విక్రయాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
     
     బ్రాండ్ మిక్సింగ్ అంటే..
     బ్రాండ్ మిక్సింగ్ అంటే మద్యాన్ని డైల్యూట్ చేయడం. ప్రీమియర్ బ్రాండ్లలో కొంత మద్యం తీసి చీప్ లిక్కర్ కలపడాన్ని బ్రాండ్ మిక్సింగ్ అంటారు. రాయల్‌స్టాగ్, ఎంసీ విస్కీ వంటి ముఖ్యమైన ప్రీమియం బ్రాండ్లలో చీప్ లిక్కర్‌ను కలిపి మద్యం మాఫియా సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. జిల్లాలో ప్రయోగశాల ఉన్నప్పటికీ అది అలంకార ప్రాయంగా మారడంతో మద్యం వ్యాపారులకు వరంగా మారింది.
     
     మూలాలు ఎక్కడ?
     పుట్టపాశం ఘటన సమాచారాన్ని రాష్ట్ర ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులకు డీటీఎఫ్ అధికారులు చేరవేయడంతో సమగ్ర విచారణకు ఆదేశించినట్లు సమాచారం. వారం రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో ఇదే తరహాలో భారీ ఎత్తున బ్రాండ్‌మిక్సింగ్ మూతలు బయటపడటంతో కర్నూలు జిల్లాలో కూడా అదే తరహా వ్యాపారం సాగుతున్నట్లు రాష్ట్రస్థాయి అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఎంతకాలం నుంచి బ్రాండ్ మిక్సింగ్ మూతలు సరఫరా అవుతున్నాయి? ఏఏ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు? అందులో రంగన్నతో పాటు జిల్లాలో ఇంకా ఎంతమంది ఉన్నారు? అనే విషయాలను నిర్ధారించే పనిలో జిల్లాటాస్క్‌ఫోర్సు నిమగ్నమైంది. భారీ మొత్తంలో నకిలీ మద్యంతో పట్టుబడిన రంగన్నను కోర్టులో హాజరు పరిచి ఎక్సైజ్ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. గతంలో డోన్ సమీపంలోని కొత్తపల్లె వద్ద భారీ మొత్తంలో నకిలీ మద్యం బయటపడిన సంగతి తెలిసిందే. జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు కావడం అప్పట్లో సంచలనం రేపింది. ప్రస్తుతం జిల్లాలో బయటపడుతున్న నకిలీ మద్యం కేసులపై పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరికొందరు అక్రమార్కుల గుట్టు రట్టయ్యే అవకాశం లేకపోలేదు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement