స్వాధీనం చేసుకున్న తాబేళ్లతో అటవీశాఖ సిబ్బంది
చింతూరు(తూర్పుగోదావరి): ఆంధ్రప్రదేశ్ నుంచి ఒడిశాకు అక్రమంగా తరలిస్తున్న 10 క్వింటాళ్ల తాబేళ్లను తూర్పు గోదావరి జిల్లా లక్కవరం ప్రాంత అటవీ అధికారులు ఆదివారం పట్టుకున్నారు. తాబేళ్ల అక్రమ రవాణా సమాచారం తెలుసుకున్న రేంజ్ అధికారి ఉషారాణి ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతమైన కొత్తపల్లి సమీపంలో సీలేరు నది వద్ద ఆదివారం వాహనాల తనిఖీ చేపట్టారు.
రాజమండ్రి నుంచి వచ్చిన టాటా ఏస్ వాహనాన్ని తనిఖీ చేయగా 8 మూటల్లో కట్టి ఉంచిన 420 తాబేళ్లు లభ్యమయ్యాయి. డ్రైవర్ పరారవ్వగా, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించామని రేంజ్ అధికారి తెలిపారు. తాబేళ్లను రాజమండ్రి నుంచి కొత్తపల్లి మీదుగా ఒడిశాకు రవాణా చేయబోతుండగా పట్టుకున్నామని చెప్పారు. కాగా, ఆ తాబేళ్లను మోతుగూడెం వద్ద సీలేరు నదిలో వదిలారు.