ఓటర్ల జాబితాలో తప్పుల సవరణకు సత్వరం చర్యలు
– బోగస్ ఓటర్లను గుర్తించి తొలగించండి
– కలెక్టర్ ఆదేశాలు
కర్నూలు(అగ్రికల్చర్): ఓటర్ల జాబితాలోని తప్పులను తక్షణమే సవరించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధికారులకు ఆదేశించారు. శనివారం సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. డూప్లికేట్ ఓటర్ల తొలగింపు, తప్పుల సవరణ, అర్బన్ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల విభజన తదితర వాటిపై కలెక్టర్ విధి విధానాలు వివరించారు. జిల్లాలో అనేక మంది ఒకే ఫొటోతో రెండు, మూడు చోట్ల ఓటర్లుగా ఉన్నారని ప్రత్యేక సాఫ్‌వేర్ ద్వారా వీటిని మ్యాచ్ చేయాలని సూచించారు. మ్యాచ్ అయితే ఒక చోట మాత్రమే ఓటరుగా ఉంచి మిగిలిన చోట్ల తొలగించాలని తెలిపారు. మ్యాచ్ కాకపోతే అవి వేరువేరు ఓటర్లుగా భావించాలని వివరించారు. ఓటర్ల జాబితాలో అచ్చు తప్పులు భారీగా ఉన్నాయని. వీటిని ఎన్నికల కమిషన్ సీరియస్‌గా తీసుకుందని వెంటనే సరిచేసేందుకు చర్యలు తీసుకోవాలని వివరించారు. అన్‌లైన్ ఎంట్రీలో అనుమానాలు ఉంటే సంబంధిత ట్రై నర్ 95733 11084కు పోన్ చేయాలని సూచించారు. సమావేశంలో జేసీ–2 రామస్వామి, డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, కర్నూలు, ఆదోని, నంద్యాల ఆర్‌డీఓలు రఘుబాబు, ఓబులేసు, సుధాకర్‌రెడ్డి, ఈఆర్‌ఓలు, నియోజక వర్గ తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.