► ఏప్రిల్ 20న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ
► మే 10 వరకు అభ్యంతరాల స్వీకరణ
► స్పెషల్ క్యాంపులు, గ్రామసభల అనంతరం
► మే 31న ఓటరు తుది జాబితా ప్రకటన
► ప్రయోగాత్మకంగా నల్లగొండ నియోజకవర్గంలో ఇంటింటి సర్వే
నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా కొత్త ఓటరు నమోదు కార్యక్రమానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ ఖరారు చేసింది. జిల్లాల పునర్విభజన, పొరుగు జిల్లాల్లో శాసన మండలి ఎన్నికల కారణంగా ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటరు నమోదు ప్రక్రియ ఆలస్యమైంది. ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం సిద్ధమైంది. షెడ్యూల్ ప్రకారం ప్రస్తుతం ఉన్న మూడు జిల్లాల్లో ముసాయిదా ఓటరు జాబితాను ఏప్రిల్ 20న ప్రకటిస్తారు. కొత్త ఓటరు నమోదు ప్రక్రియ కూడా అదే రోజు నుంచి ప్రారంభమవుతుంది.
దీంతో పాటు ముసాయిదా ఓటరు జాబితాపై అభ్యంతరాలు మే 10 తేదీ వరకు స్వీకరిస్తారు. ఏప్రిల్ 26, మే 3న రెండు విడతల్లో గ్రామ సభలు నిర్వహించి ఓటరు జాబితాను చదివి వినిపిస్తారు. ఆ తర్వాత మలి విడత ప్రత్యేక క్యాంపు ఏప్రిల్ 30, మే7న నిర్వహిస్తారు. ఈ రెండు రోజుల్లో పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ లెవల్ ఏజెంట్లు ముసాయిదా జాబితాపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఈ మొత్తం షెడ్యూల్‌లో వలస వెళ్లిన ఓటర్లను జాబితా నుంచి తొలగించడంతో పాటు, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించనున్నారు. మార్పులు, చేర్పుల అనంతరం నియోజకవర్గాల వారీగా ఓటరు తుదిజాబితాను మే 31న అధికారికంగా ప్రకటిస్తారు.
నల్లగొండలో ఇంటింటి సర్వే..
ఓటరు జాబితాను సమగ్రంగా ప్రక్షాళన చేసి ఆ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య, పోలింగ్ కేంద్రాలను నిక్కచ్చిగా తేల్చేందుకు ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోగాత్మకంగా కొన్ని నియోజకవర్గాలను ఎంపిక చేసింది. దీనిలో భాగంగా నల్లగొండ నియోజకవర్గంలో ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. ఈ సర్వేలో ప్రధానంగా లేని వారికి కొత్తగా ఇంటి నంబర్లు వేయడం, పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు చేస్తారు. ఉదాహరణకు ఒక కుటుంబంలో నలుగురు ఓటర్లు ఉంటే వారికి ఒకే పోలింగ్ కేంద్రంలో కాకుండా వేర్వేరు కేంద్రాల్లో ఓటర్లుగా ఉంటున్నారు. దీంతో సమీపంలో ఉన్న పోలింగ్ కేంద్రం కాకుండా దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇలాంటి వాటిన్నింటినీ ఇంటింటి సర్వే ద్వారా సరిచేస్తారు. నల్లగొండ నియోజకవర్గంలో 1,81,528 మంది ఓటర్లు ఉన్నారు. దీంట్లో పురుషులు 91,196, మహిళలు 90,332 మంది ఉన్నారు. పోలింగ్ కేంద్రాలు 258 ఉన్నాయి.
ప్రత్యేక షెడ్యూల్..
ఇంటింటి సర్వే చేపట్టేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక షెడ్యూల్ ఖరారు చేసింది. నాలుగు నెలల పాటు ఈ సర్వే చేస్తారు. ఏప్రిల్ 1 నుంచి 30 వరకు బూత్ లెవల్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తారు. రెండో విడత మే 1 నుంచి జూన్ 15 వరకు నిర్వహిస్తారు. ఈ సర్వేలో బూత్‌లె వల్ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్ ట్యాబెలెట్ పీసీ సహాయంతో ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు తనిఖీ చేస్తారు.
అదే నెల 25 తేదీ వరకు మొత్తం వివరాలను అప్‌డేట్ చేస్తారు. పోలింగ్ కేంద్రాలు, ఓటరు జాబితాలో ఏమైన తప్పుఒప్పులు ఉన్నట్లయితే వాటిని సరిచేసి జూన్ 30న జాబితాలన్నింటిని ప్రింట్ తీస్తారు. జూలై 5న నియోజకవర్గ వ్యాప్తంగా ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తారు. ఈ జాబితాపై అభ్యంతరాలను జూలై 5 నుంచి 20 వరకు స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలను జూలై 31 వరకు పరిష్కరిస్తారు. ఆగస్టు 15 నాటికి మొత్తం ఓటరు జాబితాను అప్‌డేట్ చేస్తారు. ఓటరు తుదిజాబితాను ఆగస్టు 31న అధికారింగా ప్రకటిస్తారు.
వేర్వేరుగానే కసరత్తు...
జిల్లాల పునిర్వభజన జరిగినందున ఓటరు జాబితాలు, కొత్త ఓటరు నమోదు కార్యక్రమం అంతా కూడా వేర్వేరుగానే కొనసాగుతోంది. మూడు జిల్లాల కలెక్టర్లను ఎన్నికల అధికారులుగా నియమిస్తూ ఎన్నికల సంఘం జనవరిలో ఆదేశాలు జారీ చేసింది. నల్లగొండ జిల్లాలో ఆరు, సూర్యాపేట జిల్లాలో నాలుగు, యాదాద్రి జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో ఓటరు జాబితా సవరణ అంతా ఆ జిల్లాలకే పరిమితం చేశారు.
ఈ ఏడాది జనవరి వరకు మూడు జిల్లాల్లోని
12 నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు...
ఓటర్లు మొత్తం : 22, 49, 305
పురుషులు : 11,30,114
మహిళలు :11,19, 191
పోలింగ్ స్టేషన్లు : 3,052