కొత్త జిల్లాల్లో ముమ్మరంగా ఏర్పాట్లు
–అధికారుల పనితీరు భేష్
–రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ
భువనగిరి : కొత్తగా ఆవిర్భవించనున్న జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల కోసం గుర్తించిన భవనాల్లో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ తెలిపారు. అధికారుల పని తీరు బాగుందని కితాబునిచ్చారు. యాదాద్రి జిల్లా కేంద్రమైన భువనగిరిలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ కార్యాలయాల కోసం గుర్తించిన తాత్కాలిక భవనాలను ఆదివారం ఆయన పరిశీలించారు. తొలుత భువనగిరి శివారులోని పగిడిపల్లిలో గల బంజారా ట్రైబల్ పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని, జగదేవ్‌పూర్ రోడ్డులోని మాధవ బీఈడీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్న జిల్లా పోలీస్ కార్యాలయాన్ని కలెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్పీ ప్రకాష్‌రెడ్డితో కలిసి సందర్శించారు. కలెక్టర్ భవన సముదాయంలో వివిధ శాఖల కోసం ఏర్పాటు చేస్తున్న కార్యాలయాలు, కేటాయించిన బ్లాక్‌లు, తీసుకుంటున్న చర్యల గురించి కలెక్టర్ సీఎస్‌కు వివరించారు. అనంతరం హన్మాపురం శివారులో ఉన్న మాధవ బీఈడీ కళాశాలకు వెళ్లారు. అక్కడ ఎస్పీ, డీఎస్పీ, ఎస్‌బీతో పాటు వివిధ విభాగాల కోసం నిర్మితమవుతున్న గదులను పరిశీలించారు. ఏర్పాట్ల గురించి ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి సీఎస్‌కు వివరించారు. అక్కడి నుంచి రాయగిరిలో గల మాసుకుంట సమీపంలో ఉన్న డ్వాక్రా భవనాలను, ప్రభుత్వ భూమిని పరిశీలించారు. తదనంతరం సూర్యాపేటకు వెళ్లారు. ఆయన వెంట జేసీ సత్యనారాయణ, ఏఎస్పీ గంగారం, ఆర్డీఓ ఎంవీ భూపాల్‌రెడ్డి,డీఎస్పీ మోహన్‌రెడ్డి, తహసీల్దార్ కె. వెంకట్‌రెడ్డి, సీఐలు శంకర్‌గౌడ్, అర్జునయ్య, డిప్యూటీ తహసీల్దార్ మందడి ఉపేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. అంతకుముందు కలెక్టరేట్ వద్ద సీఎస్‌కు కలెక్టర్, ఎస్పీ ఇతర అధికారులు స్వాగతం పలికారు. అలాగే భువనగిరి రహదారి బంగ్లాలో పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.