దోమల దండయాత్ర
Published Sat, Jan 7 2017 2:04 AM | Last Updated on Sat, Sep 15 2018 4:22 PM
జిల్లాలో దోమలు రాజ్యమేలుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు జనం రక్తం తాగుతున్నాయి. కాయిల్స్, లిక్విడ్‌లు వాటిని కనీసం నిద్రlపుచ్చలేకపోతున్నాయి. ఇక ప్రభుత్వం చేపట్టిన దండయాత్ర వాటికి చీమకుట్టినట్టయినా అనిపించడం లేదు. ఈ దోమల రాజ్యంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. పట్టణాల్లో పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది.
ఖాళీ జాగా.. దోమల పాగా
భీమవరం టౌన్ : ఇటీవల నిర్వహిస్తున్న జన్మభూమి సభల్లో కౌన్సిలర్లు, ప్రజలు దోమల సమస్యను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. భీమవరం 5వ వార్డు జన్మభూమి సభను ఆకస్మికంగా సందర్శించిన డీఎంఏ కె.కన్నబాబు దృష్టికి కూడా దోమల సమస్యను ప్రజలు తీసుకువచ్చారు. పట్టణంలో ఖాళీ స్థలాలు మురుకికూపాలుగా మారడంతో దోమల సమస్య పెరిగిందని అధికారులు గుర్తించారు. పట్టణంలో 2,300 ఖాళీ స్థలాలు ఉన్నాయి. మునిసిపాలిటీకి చెందిన 34 ఎకరాల మేర ఉన్న 72 రిజర్వుడు స్థలాల్లో 80 శాతం దోమలకు నిలయాలుగా మారాయి. ఖాళీ స్థలాలను శుభ్రం చేయించాలని వాటి యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నారు. మునిసిపాలిటీ మాత్రం తమ స్థలాలను నిర్లక్ష్యంగా వదిలేసింది. కాగా స్థలాలకు ప్రహరీ నిర్మాణానికి రూ.50 లక్షలు, స్థలాల లెవెలింగ్‌కు రూ.20 లక్షలు బడ్జెట్‌లో కేటాయిస్తూ వస్తోంది. మలేరియా, ఫైరోసిన్ ఆయిల్‌కు ఏటా రూ.11 లక్షలు, ఫాగింగ్ నిర్వహణకు రూ.13 లక్షలు కేటాయిస్తోంది. దోమలపై దండయాత్రకు బడ్జెట్‌లో రూ.10 లక్షలు కేటాయించడం విశేషం.
పేరుగాంచిన గూడెం
తాడేపల్లిగూడెం :తాడేపల్లిగూడెంకు దోమలగూడెం అనే పేరు కొనసాగుతున్న దుస్థితి. స్మార్ట్‌వార్డు కార్యక్రమం అంటూ తీసుకున్న చర్యలు కొంత ఫలితాన్ని ఇచ్చినప్పటికీ మాస్ స్ప్రేయింగ్ ప్రయోగం ఫలించలేదు. ఖాళీ జాగాల యజమానులకు మున్సిపాలిటీ నోటీసులు ఇచ్చినా స్పందన కానరాలేదు. దోమల పునరుత్పత్తికి అనువైన సమయం డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి మాసాలు కావడంతో మరింతగా వృద్ధి చెందుతున్నాయి. కాయిల్స్. కెమికల్ కాగితాలు, లిక్విడ్‌లు బలాదూర్. చేతిలో సత్తువ ఉంటే కునుకు పట్టేవరకూ రూ.360 దోమల బ్యాట్ వినియోగించాల్సిందే.
సిబ్బంది కొరతతో ఇబ్బంది
నరసాపురం : పట్టణంలో దోమల నివారణకు ఏటా రూ.5 లక్షలు ఖర్చు చేస్తున్నట్టు మునిసిపల్ రికార్డులు చెబుతున్నాయి. కానీ పట్టణంలో ఎక్కడ చూసినా దోమల బెడదే! ప్రతి కౌన్సిల్ సమావేశంలోనూ దోమలపై రగడ షరా మామూలే! 60 వేల జనాభా, 31 వార్డులతో విస్తరించి ఉన్న పట్టణంలో రెండు శానిటరీ డివిజన్లు ఉన్నాయి. ఈ రెండు చోట్ల ఇన్‌స్పెక్టర్ల పోస్టులు 8 నెలలుగా ఖాళీగా ఉన్నాయి. హెల్త్ అసిస్టెంట్‌ను ఇన్‌చార్జిగా పెట్టి, శానిటరీ పనులు మమ అనిపిస్తున్నారు. ఇక డ్రెయినేజీలను శుభ్రం చేసే పనుల్లోనూ, ఎంఎల్ ఆయిల్ వినియోగంలోనూ జరుగుతున్న అవినీతి కూడా దోమల పెరుగుదలకు దోహదం చేస్తోంది.
ఈ నగరానికి ఏమైంది?
ఏలూరు (సెంట్రల్) : నగరంలోని వన్‌టౌన్ ప్రాంతంలోని తూర్పు వీధి, పంట కాలువ రోడ్డు, వీవర్స్ కాలనీ, ఫిల్ హౌస్‌పేట, నాలుగు కాలువల సెంటరు, మోటేపల్లివారి వీధి, కత్తేపువీధి, టూటౌన్‌లోని తంగెళ్లమూడి, దాదా పలావు సెంటరు, చాణ్యకపూరి కాలనీ, శివగోపాలపురం, పవర్‌పేట, కొత్తపేట, బాలయోగి వంతెన, చేపల తూము సెంటరు, గిలకల గేటు సెంటర్ తదితర ప్రాంతల్లో దోమల బెడద ఎక్కువగా ఉంది. తూర్పు వీధి గంగానమ్మ గుడి వద్ద డ్రెయి¯ŒSపై కల్వర్టు నిర్మాణ పనులు అధికారులు ఇటీవలే చేపట్టారు. అయితే మురుగు నీరు పోయేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో నీరు ఇళ్ల మధ్యనే నిలిచిపోతోంది. దీంతో దోమల బెడద ఎక్కువైందని స్థానికులు వాపోతున్నారు. కాగా దోమల నివారణకు ఏలూరు నగరపాలక సంస్థలో 10 హ్యండ్ ఫాగింగ్ మెషీన్లు, ఒక ఆటో మెషీన్ ఉన్నాయి. వీటిలో 4 హ్యాండ్ మెషీన్లు మరమ్మతులతో మూలనపడ్డాయి.
చైర్మన్ వార్డులోనే అధ్వానం
పాలకొల్లు సెంట్రల్ : పట్టణంలో యడ్ల బజారు సెంటర్ అగ్నిమాపక కేంద్రం వద్ద చూస్తే పారిశుద్ధ్య పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుంది. యడ్లబజారు, బ్రాడీపేట, చిత్రావి చెర్వుగట్టు, యినకొండవారి తోట, బంగారువారి చెర్వు గట్టు, గుత్తులవాని పేటల్లోని డ్రైన్లు దోమలకు నిలయాలుగా మారాయి. బ్రాడీపేట అల్లు వెంకట సత్యనారాయణ హైస్కూల్ వద్ద పరిస్థితి అధ్వానం. ఇది మునిసిపల్ చైర్మ¯ŒS వార్డు కావడం గమనార్హం. బంగారు వారి చెరువు గట్టు ఎస్‌కేపీ స్కూల్ వద్ద సైకిల్‌స్టాండ్ మురుగునీటితో నిండిపోయింది. ఇక్కడ విద్యార్థులు సైకిళ్లు పార్కింగ్ చేయడం మానేశారు. 16వ వార్డులో సుమారు రూ.25 లక్షలతో డ్రైనేజీ నిర్మించినా ప్రయోజనం కనిపించడం లేదు.
స్ప్రేయింగ్ దాఖలాలు లేవు
జంగారెడ్డిగూడెం :దోమలు, పందుల నిర్మూలనకు చర్యలు తీసుకుంటున్నామని ప్రతిసారి కౌన్సిల్ సమావేశంలో అధికారులు చెప్పడమే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మురుగునీరు పారుదల సక్రమంగా లేకపోవడంతో దోమలు పెరిగిపోయాయి. కచ్ఛాడ్రైన్‌ల పరిస్థితి సరేసరి. అప్పుడప్పుడు నామమాత్రంగా పట్టణంలో ఫాగింగ్ నిర్వహిస్తున్నా మలాథియన్ స్ప్రేయింగ్ చేసిన దాఖలాలు కానరావడం లేదు.
రోజుకు రూ.లక్ష
తణుకు : దోమల నియంత్రణకు రోజుకు పట్టణ ప్రజలు సుమారు రూ.లక్ష వెచ్చిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన దోమలపై దండయాత్ర కేవలం దండగయాత్రగానే ముగిసిందని పలువురు విమర్శిస్తున్నారు. పట్టణంలోని పాతవూరు, ఇరవగవరం కాలనీ, బ్యాంకు కాలనీ, హౌసింగ్‌బోర్డు కాలనీ తదితర ప్రాంతాలతో పాటు కొన్ని మురికివాడల్లో దోమల బెడద అధికంగా ఉంది.
అటకెక్కిన ఫాగింగ్ యంత్రాలు
నిడదవోలు : పట్టణంలోని స్లమ్ ఏరియాల్లో డ్రైన్లు లేకపోవడంతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. ఖాళీ స్థలాలనైతే దోమలు కబ్జా చేశాయి. పట్టణంలో పారిశుద్ధ్య మెరుగుదలకు ఏటా 1.10 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ముగ్గు, ఆయిల్ బాల్స్, చీపుర్లకు రూ.10 లక్షలు, కార్మికుల జీతాలకు ఏటా రూ.కోటి వ్యయం. అయినా దోమల నివారణ సాధ్యం కావడం లేదు. ఉన్న మూడు ఫాగింగ్ యంత్రాలు నిరుపయోగంగా ఉన్నాయి.
నిర్మూలనకు చర్యలు శూన్యం
కొవ్వూరు : పురపాలక సంఘం ఏటా పట్టణంలో పారిశుద్ధ్య మెరుగుదలకు ఏటా రూ.1.80 కోట్లకు పైగా నిధులు వెచ్చిస్తోంది. కేవలం దోమల నిర్మూలనకు ఏటా రూ.లక్షలు వెచ్చిస్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇటీవల ప్రయివేటు స్థలాలను శుభ్రం చేయించడంతో కాస్త పరిస్థితి మెరుగుపడింది. స్వయంగా మునిసిపల్ చైర్మన్ జొన్నలగడ్డ రాధారాణి ఇటీవల నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో పట్టణంలో పారిశుద్ధ ్యం మెరుగ్గా ఉన్నప్పటికీ డ్రెయిన్ల శుభ్రత సంతృప్తికరంగా లేదని ఒప్పుకున్నారు. సిబ్బందిని ఇతర విధులకు వినియోగిస్తు న్నట్టు ఆరోపణలున్నాయి. ఫాగింగ్ యంత్రాలు ఉన్నప్పటికీ వాటిని పూర్తిస్థాయిలో వినియోగించడం లేదు. భారీ ఫాగింగ్ యంత్రం ఐదేళ్లుగా మూలనపడి ఉంది.
దండయాత్ర కొనసాగిస్తున్నాం
దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని నిర్వీర్యం చేయలేదు. కంటిన్యూ చేస్తున్నాం. అక్టోబర్, నవంబర్ నెలల సీజన్ కాబట్టి నిరంతరం దోమల నివారణకు ఎబెట్ ఆయిల్ పిచికారీ చేయించాం. ఇప్పుడు గురు, శుక్రవారం రెండు రోజులు దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
– మునిసిపల్ కమిషనర్, కె.సాయిరాం, పాలకొల్లు
స్ప్రే చేయిస్తున్నాం
దోమల నివారణకు పట్టణంలో ఇటీవల 300 ఆయిల్ బాల్స్ డ్రైయిన్లలో వేయించాం. 15 రోజుల క్రితం స్ప్రే చేయించాం. కొత్తగా పది స్ప్రేయర్లు కొనడానికి ప్రతిపాదనలు తయారు చేశాం. అవి రాగానే తిరిగి స్ప్రేయర్లు వినియోగిస్తాం. –సంగీతరావు. అసిస్టెంట్ కమిషనర్, తాడేపల్లిగూడెం
Advertisement
Advertisement