ప్రతీకాత్మక చిత్రం
‘వరంగల్ రూరల్ జిల్లా పరకాల మండలం పోచారం గ్రామంలో 17 మంది దళితులకు భూమి పంపిణీ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఇందుకు 9 ఎకరాలు కొనుగోలు చేసేందుకు సిద్ధమవగా యజమాని ఎకరానికి రూ.5.25 లక్షలకు విక్రయించేందుకు ముందుకొచ్చాడు. విషయం తెలుసుకున్న రియల్టర్లు ప్రభుత్వం చెల్లించే ధర కంటే ఎక్కువ చెల్లిస్తామని చెప్పడంతో సదరు భూమి యజమాని అటువైపు మొగ్గుచూపాడు. దీంతో ఏమిచేయాలో తోచక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి’.
సాక్షి, వరంగల్ రూరల్: భూమిలేని నిరుపేద దళితుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ పంపిణీ పథకం ముందుకు సాగడం లేదు. ప్రభుత్వ భూమి లేని ప్రాంతంలో ప్రైవేట్ స్థలం కొనుగోలు చేసి ఇవ్వాలని, ఇందుకు ఎస్సీ కార్పొరేషన్‌కు బాధ్యతలు అప్పగించారు. ఎకరం భూమి రూ.2 లక్షల నుంచి రూ.7లక్షల ధరతో కొనుగోలు చేయాలని సర్కారు నిర్ణయిం చింది. పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో 627 మంది దళితులకు మూడేళ్లలో 1739.33 ఎకరాల భూమి మాత్రమే పంపిణీ చేశారు. వరంగల్ రూరల్ జిల్లాకు 2017–18 ఆర్థిక సంవత్సరంలో 220 ఎకరాల భూమి కొనుగోలు చేసి పంపిణీ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు సుమారు 40 ఎకరాలు మాత్రమే పంపిణీ చేశారు.
ఉమ్మడి వరంగల్‌లో నాలుగేళ్లలో పంపిణీ చేసిన భూమి, లబ్ధిదారుల వివరాలు..
మార్కెట్ కంటే తక్కువ ధర..
జిల్లాల పునర్విభజనతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పోటీపడి భూములు కొనుగోలు చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఎకరానికి రూ.7లక్షల నుంచి రూ.15లక్షల వరకు ధర ఉంది. ప్రభుత్వం రూ.2 లక్షల నుంచి రూ.7లక్షల మధ్య కొనుగోలు చేయాలని నిర్ణయించడంతో భూమి అమ్మడానికి యజమానులు మందుకురావడం లేదు. 100 ఎకరాల పైన భూమి అమ్మడానికి యజమానులు ముందుకు వచ్చినా ధర విషయంలో వెనక్కి వెళ్తున్నారని అధికారులు చెబుతున్నారు.
తప్పని ఎదురు చూపులు..
దళితులకు భూ పంపిణీ పథకం అమలులోకి వచ్చి నాలుగేళ్లు పూర్తికావస్తున్నా ఇప్పటి వరకు భూమి పంపిణీ చేసింది కొద్దిమందికే. ఇచ్చిన భూముల్లోనూ నీటి వసతులు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరికి పట్టాలు మాత్రమే ఇచ్చారు. భూములకు మాత్రం చూపించకపోవడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. వేలాది మంది లబ్ధిదారులు భూమి కోసం ఎదురు చూస్తున్నారు. అసలు భూములే పూర్తిస్థాయిలో అందుబాటులో లేకుండా ప్రభుత్వం ఆర్భాటంగా పథకాన్ని ప్రకటించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
150 ఎకరాల స్థలం గుర్తించాం..
వరంగల్ రూరల్ జిల్లా వ్యాప్తంగా 150 ఎకరాల భూమిని గుర్తించాం. అనువైన స్థలం ఎంపిక చేసి అన్ని సౌకర్యాలు ఉండేలా చుస్తున్నాం. త్వరలో పంపిణీ చేస్తాం.
– సురేష్, ఎస్సీకార్పొరేషన్ ఈడీ
Comments
Please login to add a commentAdd a comment