పత్తి విత్తన పరిశోధనలు పెరగాలి
పత్తి విత్తన పరిశోధనలు పెరగాలి
Published Fri, Oct 14 2016 9:54 PM | Last Updated on Mon, Sep 4 2017 5:12 PM
నంద్యాలరూరల్: పత్తి విత్తనంపై పరిశోధనలు పెరగాలని ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఎన్‌వీనాయుడు కోరారు. శుక్రవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో విజన్ 2030 లక్ష్యంగా పత్తి విత్తన పరిశోధనలపై శాస్త్రవేత్తలతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఏడీఆర్ గోపాల్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు అతిథిగా డాక్టర్ నాయుడు హాజరై మాట్లాడారు. కార్పొరేట్ సంస్థలు పత్తి విత్తన పరిశోధనల్లో ముందున్నాయని, వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నూతన పత్తి విత్తన వంగడాల ఆవిష్కరణకు సంసిద్ధం కావాలని కోరారు. అందు కోసమే విజన్ డాక్యుమెంట్ 2030పేరుతో శాస్త్రవేత్తలతో సమీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లలో పత్తి సాగు అధికంగా ఉందని, రాష్ట్రంలో కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉండగా గుంటూరు జిల్లా రెండో స్థానంలో ఉందన్నారు. దిగుబడుల్లో మాత్రం గుంటూరు జిల్లానే ముందుంటుందని, ఈ వ్యత్యాసానికి కారణాలు కనుగొనాలని సూచించారు. భూసార పరీక్షలు ఆధారంగానే ఎరువులు వాడే పద్ధతిని రైతులకు తెలియజేయాలని చెప్పారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నూతన వంగడాలు, యాజమాన్య పద్ధతులు, చెరుకు, చిరుధాన్యాల సాగు, వాటిపై వివరించారు. ఏడీఆర్ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు రైతుల ముంగిటకు నూతన వంగడాలను ఆవిష్కరించారని, అందులో పత్తి, వరి, శనగ, పొద్దుతిరుగుడు, కొర్ర, జొన్న, ఎంతో ప్రాచుర్యం పొందాయని వివరించారు. ఇటీవల వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలో ఏడు నూతన వంగడాల ఆవిష్కరణలో నాలుగు నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి శాస్త్రవేత్తలు ఆవిష్కరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతపురం డ్రైల్యాండ్ అగ్రికల్చర్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ పద్మలత, సీనియర్ పత్తి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ చెంగారెడ్డి, సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ రామారెడ్డి, డాక్టర్ జోసెఫ్‌రెడ్డి, తదితర సీనియర్, జూనియర్ వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement