పెంచు.. పంచు!
పెంచు.. పంచు!
Published Mon, May 8 2017 11:41 PM | Last Updated on Tue, Sep 5 2017 10:42 AM
కార్పొరేషన్ పనులపై విజిలెన్స్!
– పుష్కర పనులపై కూడా..
– నేరుగా ఫిర్యాదు చేసిన చిన్న కాంట్రాక్టర్లు
- అంచనా విలువ భారీగా పెంపు
- అన్నింటా కమీషన్ల వ్యవహారం
– త్వరలో విచారణ షురూ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు కార్పొరేషన్ పరిధిలో నిర్వహిస్తున్న అభివృద్ధి పనులపై విజిలెన్స్ కన్నుపడింది. గత ఏడాది కాలంగా చేపడుతున్న మొత్తం పనుల నాణ్యతతో పాటు టెండర్ల వ్యవహారంపైనా విజిలెన్స్ దృష్టి సారించనుంది. ఈ మేరకు కార్పొరేషన్‌లో జరుగుతున్న టెండర్ల బాగోతంపై చిన్న కాంట్రాక్టర్లు ఫిర్యాదు నేపథ్యంలో విజిలెన్స్ కన్నుపడినట్టు సమాచారం. కార్పొరేషన్ పరిధిలో టెండర్ల అంచనా విలువను కోటి రూపాయల కంటే అదనంగా పెంచి చూపించడం ద్వారా కేవలం పెద్ద కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా చూస్తున్నారని ఈ ఫిర్యాదులో చిన్న కాంట్రాక్టర్లు పేర్కొన్నట్టు తెలిసింది. కృష్ణా పుష్కరాల సందర్భంగా జరిగిన పనులపైనా అనేక ఫిర్యాదులు అందినట్టు సమాచారం. అంతేకాకుండా పెద్ద కాంట్రాక్టర్లు రింగుగా ఏర్పడి టెండర్ విలువ కంటే అదనంగా 5 నుంచి 10 శాతం వరకూ అధిక ధరలను కోట్ చేస్తున్నారని వివరించారు. తద్వారా 10 నుంచి 15 శాతం వరకూ తక్కువ ధరకే కోట్ కావాల్సిన టెండర్లు కాస్తా అధిక ధరతో కార్పొరేషన్ ఖజానాకు గండిపడుతుందని పేర్కొన్నారు. ప్రధానంగా గత ఏడాది కాలంగా జరుగుతున్న ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని విజిలెన్స్‌కు ఇచ్చిన ఫిర్యాదులో వీరు కోరినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ టెండర్ల బాగోతంపై విజిలెన్స్ విచారణ ప్రారంభించనున్నట్టు తెలిసింది.
పనులన్నీ పెద్ద కాంట్రాక్టర్లకే..
కార్పొరేషన్‌లో వాస్తవ పనుల విలువ కంటే అధిక ధరను పెంచేస్తున్నారని.. తద్వారా పనులన్నీ పెద్ద కాంట్రాక్టర్లకే దక్కేలా చూస్తున్నారని ప్రధాన ఫిర్యాదు. వాస్తవానికి రూ.90 లక్షల విలువైన పనుల అంచనా వ్యయాన్ని కూడా కోటి రూపాయలకంటే అదనంగా పెంచి టెండర్లను పిలిచారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిసింది. తద్వారా కేవలం ఇద్దరు, ముగ్గురు కాంట్రాక్టర్లు మాత్రమే బరిలో నిలుస్తున్నారు. ఈ ముగ్గురి మధ్య అధికార పార్టీ నేత రింగు ఏర్పడేలా చేసి అధిక ధరకు టెండర్లను దాఖలు చేయిస్తున్నారు. తద్వారా కమీషన్ రూపంలో 10 శాతం మేరకు నొక్కేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా చిన్న కాంట్రాక్టర్లకు పెద్దగా పనులు లేకుండా పోతున్నాయి. అంతేకాకుండా కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు కూడా పనులు చేయకుండా అధికార పార్టీ నేతలకు చెందిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకే పనులు అప్పగిస్తున్నారు. ఫలితంగా నాణ్యత నగుబాటు అవుతోంది. ఈ నేపథ్యంలో పెద్ద కాంట్రాక్టర్ల జేబులు నింపే విధంగా జరుగుతున్న మొత్తం వ్యవహారంపై విచారణ జరపాలని విజిలెన్స్ అధికారులను చిన్న కాంట్రాక్టర్లను కోరినట్టు తెలిసింది. ఇందుకోసం ఎక్కడెక్కడ అంచనా విలువలను రూ.80 లక్షలు–రూ.90 లక్షల విలువైన పనులను కోటి రూపాయలకు దాటించారనే సమాచారాన్ని కూడా విజిలెన్స్ అధికారులో చేతిలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఖజానాకు 20 శాతం నష్టం
కర్నూలు కార్పొరేషన్‌లో జరిగే పనులను దక్కించుకునేందుకు కాంట్రాక్టు సంస్థల మధ్య పోటీ ఉంది. ఈ పోటీలో భాగంగా ఒక్కో కాంట్రాక్టు పనికి 10 నుంచి 15 శాతం వరకూ తక్కువ ధరకే టెండర్లు వేస్తున్నారు. అయితే, అంచనా విలువను కోటి రూపాయలకుపైగా పెంచడంతో చిన్న కాంట్రాక్టర్లు టెండర్‌లో పాల్గొనే అర్హతను కోల్పోతున్నారు. తద్వారా కేవలం నలుగురైదుగురు ఉన్న పెద్ద కాంట్రాక్టర్లు కాస్తా అధిక ధరకు టెండర్లను దక్కించుకుంటున్నారు. ఈ విధంగా 5 నుంచి 10 శాతం వరకూ అధిక ధరను కోట్ చేస్తున్నారు. ఫలితంగా 10 నుంచి 15 శాతం తక్కువకే దక్కాల్సిన పనులు కాస్తా 5–10 శాతం అధిక ధరకు టెండర్లను కార్పొరేషన్ అప్పగించాల్సి వస్తోంది. ఫలితంగా 15 నుంచి 20 శాతం వరకూ కర్నూలు కార్పొరేషన్ ఆదాయాన్ని కోల్పోతుందని తమ ఫిర్యాదులో చిన్న కాంట్రాక్టర్లు వాపోయినట్టు తెలిసింది. ఈ విధంగా వందల కోట్ల పనుల్లో కార్పొరేషన్‌కు కూడా కోట్లలోనే గండిపడుతోందని వివరించారు. దీంతో విజిలెన్స్ అధికారుల విచారణ షురూ కానున్నట్టు సమాచారం.
Advertisement