చిగురిస్తున్న ఆశలు
– క్రమంగా పెరుగుతున్న సాగర్ నీటిమట్టం
– శ్రీశైలం నుంచి 73,840 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
– ఆయకట్టు రైతుల్లో ఆనందం
నాగార్జునసాగర్
నాలుగు రోజులుగా శ్రీశైలం జలాశయం నుంచి విడుదలవుతున్న నీటితో సాగర్ జలాశయం క్రమంగా పెరుగుతోంది. 512 అడుగులున్న జలాశయ నీటిమట్టం ఎగువ నుంచి ఇన్‌ఫ్లో పెరగడంతో ప్రస్తుతం 522.20(153.3180టీఎంసీలు)అడుగులకు చేరుకుంది. రెండవ పంటకైనా నీరు వస్తుందని ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వాగులు,వంకలు,ఉపనదులు పొంగిపొర్లుతుండటంతో కృష్ణానదిలోకి నీరు వచ్చి చేరుతోంది. సాగర్ ఎగువ జలాశలయాలైన ఆల్‌మట్టి,నారాయణపూర్, జూరాల జలాశయాలు నిండుకుండలా ఉన్నాయి. శ్రీశైలం జలాశయం 881.80(197.9120టీఎంసీలు)అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు(215టీఎంసీలు). ఎగువ నుంచి 1,20,300క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరదనీరు వస్తుండటంతో విద్యుదుత్పాదన రెండు యూనిట్ల ద్వారా 73,840క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి సోమవారం 1,90వేల మేరకు వరద నీరు రాగా మంగళవారానికి వరద తగ్గుముఖం పట్టింది.ఉదయం 1,40వేల క్యూసెక్కులు రాగా సాయంత్రానికి 1.30వేల వచ్చింది. రాత్రి సమయానికి అది ఇంకా తగ్గింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయం ఎగువ నుంచి వరద వస్తేనే సాగర్ జలాశయంలోకి వరద తీవ్రత పెరిగే అవకాశాలున్నాయి.
సాగర్‌కు శ్రీశైలమే ఆధారం
నాగార్జునసాగర్ జలాశయం వరద నీటి కోసం శ్రీశైలం జలాశయం మీదనే ఆధారపడాల్సి ఉంది. శ్రీశైలం జలాశయానికి,పులిచింతల ప్రాజెక్టుకు ఉన్నన్నీ ఉపనదులు సాగర్ జలాశయానికి లేవు. స్థానికంగా కురిసిన వర్షాలకు సాగర్లోకి ఏ మాత్రం నీరు చేరే అవకాశాలు లేవు. కేవలం డిండి వాగు,ఉప్పాగు,మైనంపల్లివాగులు మినహాయిస్తే సాగర్ జలాశయంలోకి నీరు భారీ స్థాయిలో వచ్చే ఉపనదులు లేవు.సాగర్ ప్రాజెక్టు దిగువన ఆంధ్రావైపు నుంచి వచ్చే, చంద్రవంక వాగు,తెలంగాణ వైపు నుంచి వచ్చి కలిసే అహాల్యవాగు,మూసినీరు ఇలా చాలా ఉపనదుల నుంచి పులిచింతల ప్రాజెక్టుకు నీరు చేరుతుంది.