తిరుపతికి సురేంద్రరెడ్డి తరలింపు
తిరుపతికి సురేంద్రరెడ్డి తరలింపు
Published Mon, Aug 22 2016 12:20 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
నెల్లూరు(అర్బన్) : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ పెద్దాసుపత్రిలో ఆమరణ దీక్ష చేస్తున్న ఏపీ ప్రజాసమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పెళ్లకూరు సురేంద్రరెడ్డిని పోలీసులు ఆదివారం తిరుపతికి తరలించారు. సురేంద్రరెడ్డి హోదా కోసం నెల్లూరులోని కొండాయపాళెం గేటు సమీపంలో ఉన్న తన ఇంటిలో ఆమరణ దీక్షకు పూనుకున్నారు. ఐదు రోజులు గడిచేసరికి ఆరోగ్యం క్షీణించిందని ఆయన దీక్షను శనివారం రాత్రి పోలీసులు భగ్నం చేసి పెద్దాసుపత్రికి తరలించారు. అయితే ఆయన అక్కడ కూడా తన దీక్షను కొనసాగిస్తానని ప్రకటించారు. ఈ క్రమంలో ఆదివారం సురేంద్రరెడ్డిని పెద్దాసుపత్రిలో డాక్టర్లు పరిశీలించారు. గుండెకి సంబంధించి ఈసీజీలో మార్పులు వచ్చాయని, బీపీ సమస్య కూడా ఉందని తెలిపారు. ఈనేపథ్యంలో మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు సూచించారు. గుంటూరు లేదా తిరుపతి ఆసుపత్రికి తీసుకెళ్లాలని పోలీసులకు రెఫర్ చేశారు.
దీక్ష కొనసాగిస్తా..
ఫిజిషియన్ శ్రీచందన్ సూచన మేరకు పోలీసులు తిరుపతికి తీసుకెళ్లేందుకు సురేంద్రరెడ్డి వద్దకు వెళ్లారు. ఆయన తిరుపతికి వెళ్లేందుకు అంగీకరించలేదు. తాను ఇదే ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తానని పట్టుపట్టారు. ఐదో నగర పోలీసులు ఎస్సై జగత్ సింగ్ ఆధ్వర్యంలో ఆయన్ను బలవంతంగా తిరుపతికి తరలించబోగా అక్కడున్న కార్యకర్తలు ప్రత్యేక హోదా కోసం ప్రాణాలు అర్పిస్తాం అంటూ నినదించారు. పోలీసులు బలవంతంగా 108 వాహనంలో ఎక్కించి తిరుపతికి తరలించారు. ఈసందర్భంగా సురేంద్రరెడ్డి మాట్లాడుతూ తాను తిరుపతిలో కూడా దీక్ష కొనసాగిస్తానన్నారు. ఆయన వెంట సమితి జిల్లా అధ్యక్షుడు సాల్మన్‌రాజు, ప్రధాన కార్యదర్శి తిరుపతి యాదవ్ ఉన్నారు.
Advertisement