తెలుగు భాషకు తీరని అన్యాయం
తెలుగు భాషకు తీరని అన్యాయం
Published Thu, Aug 18 2016 11:22 PM | Last Updated on Mon, Sep 4 2017 9:50 AM
– కర్నూలులో తెలుగు భాషా పరిరక్షణ సమితి మాజీ ఎంపీ యార్లగడ్డ
కర్నూలు(కల్చరల్):
తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలోని 47వ పేజీలో తెలుగు భాషా పరిరక్షణకు అన్ని పాఠశాలల్లో తెలుగు భాషా అధ్యయనాన్ని తప్పనిసని చేస్తామన్నారు. తెలుగు సంస్కృతి పరిరక్షణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటామని పొందుపరచి, మేనిఫెస్టోలోని ఒక్క అంశాన్ని సైతం గద్దెనెక్కిన తర్వాత ఇంతవరకూ టీడీపీ ప్రభుత్వం ఆచరణలో పెట్టకపోవడం శోచనీయమని సుప్రసిద్ధ సాహితీవేత్త తెలుగు భాషా పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. కర్నూలులో గురువారం సాయంత్రం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తెలుగు భాష పట్ల రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని తూర్పారబట్టారు. గత సంవత్సరం ఆగస్టు 29న గిడుగు రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకుని విజయవాడలో జరిగిన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగును రెండవ భాషగా అధ్యయనం చేయాలనే ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. కానీ ఇంతవరకు ఆ హామీకి సంబంధించిన ఏ కార్యక్రమం ఆచరణలోకి రాకపోవడం విడ్డూరమన్నారు. ఈ సందర్భంగా గత సంవత్సరం గిడుగు జయంతి సభలో విజయవాడలో చంద్రబాబు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. అదే విధంగా గత సంవత్సరం మేడేను పురస్కరించుకుని విశాఖపట్నంలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొని వైజాగ్‌లో మహా కవి శ్రీశ్రీ జన్మించిన ఇల్లు, నివసించిన ఇల్లు రెండింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని వాటిని సాహితీ కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్న హామీని సైతం ముఖ్యమంత్రి విస్మరించడం దురదష్టకరమన్నారు. విజయనగరంలోని గురజాడ ఇంటిని సాహిత్య కేంద్రంగా మలిచేందుకు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్న గురజాడ మనవడికి జీతభత్యాలు పెంచే విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. నందమూరి తారక రామారావుకు గురువైన ప్రముఖ తెలుగు సాహితీవేత్త విశ్వనాథ సత్యనారాయణ గహాన్ని విజయవాడలో సాహితీ కేంద్రంగా తీర్చిదిద్దవలసిన ఆవశ్యకత ఉందన్నారు.
అమరావతి ఫలకాలు ఆంగ్లంలోనా..
ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలు కల్గిన సాంస్కతిక రాజధానిగా తీర్చిదిద్దుతామని ఒకపక్క చెబుతూనే అమరావతి శిలాఫలకాలను అన్నింటినీ ఆంగ్లంలో తయారు చేయించడం దురదష్టకరమన్నారు. వాటిని తిరిగి తెలుగులో తయారు చేయించినా అవి ఇంతవరకు ప్రతిష్టకు నోచుకోకపోవడం తెలుగు భాష పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. తెలుగుకు ప్రాచీన హోదాలో భాగంగా రాష్ట్రంలో ఒక పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాల్సి ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా ఒక్క అడుగూ ముందుకు వేయకపోవడం తీవ్రంగా పరిగణించాలన్నారు. ప్రెస్ అకాడమీ, ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయాలను ఆంధ్రప్రదేశ్‌కు మార్చిన ప్రభుత్వం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్‌కు మార్చకపోవడం విమర్శలకు తావిస్తోందన్నారు. విలేకరుల సమావేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త బి.వి.రెడ్డి, కర్నూలు లలిత కళాసమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య, తెలుగు భాషా వికాస ఉద్యమ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.ఎస్.ఆర్.కె.శర్మ పాల్గొన్నారు.
Advertisement