మాతృభాషకు మంగళం | telugu medium ban in municiple schools | Sakshi
Sakshi News home page

మాతృభాషకు మంగళం

Published Wed, Jan 4 2017 11:36 PM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM

మాతృభాషకు మంగళం

మాతృభాషకు మంగళం

మున్సిపల్‌ స్కూళ్లలో తెలుగు మీడియం రద్దు
 25 వేల మంది విద్యార్థులకు దూరం కానున్న తెలుగు వెలుగు
 భగ్గుమంటున్న ఉపాధ్యాయ సంఘాలు
 
 
ఏలూరు సిటీ :
తెలుగు వెలుగులకు తెలుగుదేశం సర్కారు పాతరేస్తోంది. రాష్ట్రంలోని నగరపాలక, పురపాలక సంఘాల పరిధిలోని పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దు చేస్తూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్‌ స్కూళ్లను ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలుగా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు భగ్గుమంటుంటే.. భాషాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యను అందించడం కోసమే ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతున్నట్టు ప్రభుత్వం చెబుతుండగా.. మాతృభాషను విద్యార్థులకు దూరం చేసే హక్కు సర్కారుకు లేదని ఉపాధ్యాయ సంఘాలు, భాషాభిమానులు మండిపడుతున్నారు. 
 
25 వేల మంది విద్యార్థులకు తెలుగు దూరం
సర్కారు నిర్ణయంతో జిల్లాలో సుమారు 25వేల మంది విద్యార్థులు తెలుగు మీడియంకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏలూరు నగరపాలక సంస్థ, జిల్లాలోని 8 పురపాలక సంఘాల పరిధిలోని పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దు చేయాల్సి ఉంది. జిల్లాలో పురపాలక ఉన్నత పాఠశాలలు 35 ఉండగా, వాటిలో 13,963 మంది, ప్రాథమికోన్నత పాఠశాలలు 15 ఉండగా 2,018 మంది,  ప్రాథమిక పాఠశాలలు 158 ఉండగా, వాటిలో 9,322 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటిలో 1వ తరగతి నుంచీ 9వ తరగతి వరకూ తెలుగు మీడియంను రద్దు చేస్తారు. 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలు సమీపించిన దృష్ట్యా ఈ ఉత్తర్వులను ప్రస్తుత విద్యా సంవత్సరానికి వాయిదా వేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 
 
తగదంటున్న ఉపాధ్యాయ సంఘాలు
తెలుగు జాతిని ఉద్ధరించేందుకు.. తెలుగు తేజాన్ని దశదిశలా వ్యాప్తి చేసేందుకు పుట్టినట్టుగా చెప్పుకునే తెలుగుదేశం పార్టీ పాలనలో తెలుగు మీడియం రద్దు చేయటాన్ని ఉపాధ్యాయులంతా వ్యతిరేకిస్తున్నారు. విద్యా సంవత్సరం మూడు నెలల్లో పూర్తి కావస్తుంటే ఇప్పటికప్పుడు తెలుగు మీడియం పాఠశాలలను ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లుగా మార్పు చేయాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కార్పొరేట్‌ విద్యాసంస్థలకు మేలు చేసే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంగ్లిష్‌ మీడియం బోధనకు తాము వ్యతిరేకం కాదని.. అయితే, విద్యార్థుల సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి మున్సిపల్‌ స్కూల్లో తెలుగు మీడియం తరగతులు ఉండాల్సిందేననే డిమాండ్‌ వినిపిస్తోంది. 
 
 జీవోను రద్దు చేయాలి
ఒక్కసారిగా అంగ్ల మాధ్యమాన్ని అమలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం సరికాదు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 14ను తక్షణమే రద్దు చేయాలి. తొందరపాటు నిర్ణయాలతో విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటం ఆడుతున్నారు. విద్యార్థులకు ఇష్టమైన భాషలో చదువుకునే అవకాశం లేకుండా బలవంతంగా ఆంగ్ల మాధ్యమాన్ని రుద్దటం అమానుషం. 
 గుగ్గులోతు కృష్ణ, ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్‌ 1938 జిల్లా శాఖ
 
 తుగ్లక్‌ పాలనను మరిపిస్తోంది
టీడీపీ సర్కారు తుగ్లక్‌ పాలనను తలపిస్తోంది. అకస్మికంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మున్సిపల్‌ స్కూళ్లలో డ్రావుట్స్‌ పెరిగిపోతారు. పాఠ్యపుస్తకాలు లేకుండా, ఇంగ్లిష్‌ మీడియం బోధనపై ఉపాధ్యాయులకు ప్రత్యేక తరగతులు నిర్వహించకుండా ఉత్తర్వులు జారీ చేయటం దారుణం. ఆంగ్లమాధ్యమ విద్యకు మేం వ్యతిరేకం కాదు. తెలుగు మీడియం కూడా ఉండాల్సిందే. 
 షేక్‌ సాబ్జీ, కార్యదర్శి, యూటీఎఫ్‌ రాష్ట్ర శాఖ
 
 మాతృభాష లేకుండా చేస్తారా
భాష పేరుతో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ చివరకు రాష్ట్రంలో తెలుగు భాషను లేకుండా చేయాలనే ఆలోచనలో ఉందా. మనో విజ్ఞాన శాస్త్రవేత్తలు మాతృభాషలో విద్యాబోధన జరగాలని చెబుతుంటే.. తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేయటం మంచిది కాదు. అన్ని తరగతుల్లోనూ తెలుగు, ఇంగ్లిష్‌ మాధ్యమాలు అమలు చేయాలి.
 బీఏ సాల్మన్‌రాజు, ప్రధాన కార్యదర్శి, ఏపీటీఎఫ్‌ జిల్లా శాఖ
 
 వ్యతిరేకిస్తున్నాం 
మున్సిపల్‌ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ఉత్తర్వుల వల్ల విద్యార్థులకు ప్రయోజనం చేకూరకపోగా, నష్టం జరుగుతుంది. ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. పాఠ్యపుస్తకాలు లేకుండా విద్యాబోధన ఎలా జరుగుతుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఆంగ్ల, తెలుగు మా«ధ్యమాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి.
 పి.వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు, పీఆర్‌టీయూ జిల్లా శాఖ
 
 పేద వర్గాలకు షాకిచ్చారు 
మున్సిపల్‌ పాఠశాలల్లో చదివే పిల్లలంతా పేద, బలహీన వర్గాల వారే. ఎల్‌కేజీ నుంచి ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టి దశలవారీగా అమలు చేయకుండా ఇలా అర్ధాంతరంగా ఉత్తర్వుల జారీ చేయటం తగదు. ఇప్పుడు తెలుగు మీడియం లేదంటే పిల్లలంతా ఎక్కడికి వెళ్లాలి. 9వ తరగతి పిల్లలు ఆంగ్లమాధ్యమంలో చదవటం కష్టం.
నెరుసు రాంబాబు, గౌరవాధ్యక్షుడు, పీఆర్‌టీయూ 
 
 
 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement