నిర్లక్ష్యపు ‘జోన్‌’ | injustice for visaka over railway zone | Sakshi
Sakshi News home page

నిర్లక్ష్యపు ‘జోన్‌’

Published Sun, Sep 11 2016 8:50 AM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

నిర్లక్ష్యపు ‘జోన్‌’ - Sakshi

నిర్లక్ష్యపు ‘జోన్‌’

విశాఖ రైల్వే జోన్‌పై ఆది నుంచి అలక్ష్యమే
► నాడు నిబంధన  సడలించి జోన్లు ఇచ్చిన ఎన్డీయే
► నేడు మెలికలు.. జోన్‌ ఊసే ఎత్తని చంద్రబాబు
► సంబంధం లేనట్టుగా కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు

సాక్షి, విశాఖపట్నం :

రైల్వే జోన్‌ ఏర్పాటుకు కావాల్సిన అన్ని అర్హతలున్నా విశాఖపట్నానికి అన్యాయమే జరుగుతోంది. రైల్వే జోన్‌ కోసం ప్రజలు, విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ, వామపక్షాలు చేస్తున్న ఆందోళనలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు చెవికెక్కడం లేదు. రైల్వే జోన్‌ వల్ల ఒనగూరే ప్రయోజనాలపై అందరూ గొంతెత్తుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదు. పైగా జోన్‌ కోసం ఉద్యమించే వారిని అణగదొక్కేందుకు ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు 44సార్లు విశాఖకు వచ్చారు. అయినా ఒక్కసారి కూడా రైల్వే జోన్‌ ప్రస్తావన తీసుకురాలేదు. ఇక విశాఖ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబుదీ అదే వైఖరి. తనను గెలిపిస్తే విశాఖలో రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన ఆయన.. గెలిచాక మాత్రం జోన్‌ అంశాన్ని పట్టించుకోవడం మానేశారు. పొరుగున ఉన్న విజయనగరం జిల్లాకు చెందిన కేంద్రమంత్రి అశోక్‌ గజపతిరాజు కూడా రైల్వే జోన్‌ వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నట్టు ప్రవర్తిస్తున్నారు. చివరికి విశాఖకు రైల్వే జోన్‌ అంశం విభజన చట్టంలో పొందుపర్చినప్పటికీ దీనిపై అటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

వనరులున్నా..
ప్రత్యేక జోన్‌ చేయడానికి మిగతా డివిజన్ల కంటే కూడా విశాఖకే ఎక్కువ అవకాశాలు, అర్హతలున్నాయి. కానీ విశాఖ కంటే తక్కువ వనరులున్న ఇతర రాష్ట్రాల్లోని డివిజన్లను రైల్వే జోన్లు చేశారు.  
600 కి.మీల రైల్వే లైన్‌ ఉంటే జోన్‌ ఇవ్వొచ్చన్న నిబంధన ఉంది. కానీ 1998లో అప్పటి ఎన్డీయే ప్రభుత్వం 292 కి.మీలు ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు, 411 కి.మీల రైల్వే లైన్‌ ఉన్న జార్ఖండ్‌కు జోన్‌ ఇచ్చింది. కానీ 1,052 కి.మీల రైల్వే లైన్‌ ఉన్న వాలే్తరు డివిజన్‌ను జోన్‌గా చేసేందుకు మాత్రం పితలాటకం పెడుతోంది.
తూర్పు కోస్తా రైల్వే జోన్‌లో ఆదాయాన్ని తెచ్చిపెట్టే అతిపెద్ద డివిజన్‌ ఇది. ఏటా ఈ డివిజన్‌కు దాదాపు రూ.7 వేల కోట్ల రాబడి సమకూరుతోంది. 2015–16లో జోన్‌కు రూ.15,978.28 కోట్లు రాగా.. అందులో ఒక్క వాలే్తరు డివిజన్‌ నుంచే రూ.7,034.58 కోట్ల ఆదాయం వచ్చింది. సాధారణ టిక్కెట్ల ద్వారానే రోజుకు రూ.25 లక్షల ఆదాయం వస్తోంది.
జోన్‌ ఏర్పాటుకు 200 ఎకరాల స్థలం ఉంటే చాలు. అదే విశాఖలో 782 ఎకరాల రైల్వే జాగా ఉంది. అలాగే రెండు మేజర్‌ పోర్టులు, స్టీల్‌ప్లాంట్, హెచ్‌పీసీఎల్, పలు ప్రభుత్వ రంగ సంస్థలు, తూర్పు నావికాదళ  కేంద్రం వంటివెన్నో ఇక్కడ ఉన్నాయి.

జోన్‌ వల్ల ప్రయోజనాలు..
♦ కొత్తగా రైల్వే లైన్లు వస్తాయి. కొత్త ప్రాజెక్టులూ మంజూరవుతాయి.
♦ ఉద్యోగ నియామకాల కోసం రైల్వే బోర్డు ఏర్పాటవుతుంది.
♦ జనరల్‌ మేనేజర్‌ కార్యాలయం వస్తుంది. కొత్తగా రెండు వేల నుంచి మూడు వేల క్వార్టర్ల నిర్మాణం కూడా జరుగుతుంది.
♦ డిమాండ్‌ ఉన్న ప్రాంతాలకు రైల్వే బోర్డుతో పనిలేకుండా కొత్త రైళ్లను వేసుకోవచ్చు. లోకల్‌ ట్రైన్లు కూడా నడుపుకోవచ్చు.
♦ విశాఖలో ప్లాట్‌ఫాంల సంఖ్య పెరుగుతుంది.
♦ రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్లు పెరుగుతాయి. జోనల్‌ ఆస్పత్రి ఏర్పాటు అవుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement