ఈ ప్రశ్నకు బదులేది?
►ఎస్వీయూ అధికారుల వైఖరి మారదా?
► వరుస తప్పులతో విద్యార్థులకు అవస్థలు
► సెకండియర్ పరీక్షలకు మారిపోయిన ప్రశ్నపత్రం
►పరీక్ష రద్దు యోచనలో అధికారులు
చిత్తూరు ఎడ్యుకేషన్/తిరుపతి సిటీ: శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ సెకండ్ ఇయర్ తెలుగు ప్రశ్న పత్రానికి బదులుగా విద్యార్థులకు ఫస్ట్ ఇయర్‌కు చెందిన తెలుగు ప్రశ్న పత్రాన్ని ఇచ్చిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. ప్రశ్న పత్రం చూసుకున్న విద్యార్థులు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. వెంటనే ఎగ్జామ్ సెంటర్లలో ఉన్న ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శనివారం పరీక్ష రాసిన జిల్లాలోని 20వేల మందికి పైగా విద్యార్థుల జీవితం ప్రశ్నార్థకంగా మారింది. పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 9గంటలకు విద్యార్థులకు థర్డ్ సెమిస్టర్ అని పొందుపరిచిన ప్రశ్నపత్రాన్ని సెకండియర్ విద్యార్థులకు ఇచ్చారు. అందులోని ప్రశ్నలన్నీ ఫస్టియర్‌కు చెందిన రెండో సెమిస్టర్ ప్రశ్నలు ఉండడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. వెంటనే ఇన్విజిలేటర్ల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోరుుంది.
డిగ్రీ థర్డ్ సెమీస్టర్ తెలుగు ప్రశ్నాపత్రానికి బదులు సెకండ్ సెమీస్టర్ ప్రశ్నలు ఇవ్వటంతో శనివారం జరిగిన థర్డ్ సెమిస్టర్ తెలుగు పరీక్షను రద్దు చేసే యోచనలో వర్సిటీ అధికారులు ఉన్నారు. సోమవారం వీసీ, రిజిస్ట్రార్ ఇతర అధికారులు సమావేశమై పరీక్షను రద్దు చేయాలా ? వద్దా అనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఎస్వీయూ అధికారుల తీరులో మార్పులేదు
ప్రశ్నపత్రాల పంపిణీలో వర్సిటీ పరీక్షల విభాగం అధికారులు, ఉన్నతాధికారుల నిర్లక్ష్యం బట్ట బయలైంది. అది జరిగి రెండురోజులు కూడా కాకముందే మళ్లీ ఇలాంటి తంతే సాగడంతో ఎస్వీయూ అధికారుల్లో బాధ్యతారాహిత్యం కనిపిస్తోంది. అధికారుల తప్పిదం వల్ల వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.