క్రికెట్ బెట్టింగ్‌పై ఉక్కుపాదం
- డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు
- బుకీ అరెస్ట్, 1.50 లక్షలు స్వాధీనం
ఆదోని టౌన్: పట్టణంలో కొంతకాలంగా హైటెక్ స్థాయిలో సాగుతున్న క్రికెట్ బెట్టింగ్‌పై ఉక్కుపాదం మోపుతామని డీఎస్పీ కొల్లి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆదోని అయ్యప్ప స్వామి గుడి సమీపంలో బెట్టింగ్ లావాదేవీలు కొనసాగిస్తున్న శివశంకర్ నగర్‌కు చెందిన బోయ తుకారాంను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ విలేకరులకు వెల్లడించారు. బోయ తుకారాం కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు..
ఎస్కేడీ కాలనీ మూడవ రోడ్డులోని అయ్యప్ప స్వామి గుడి సమీపంలో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా కొంతమంది యువకులతో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో సీఐ ఘంటా సుబ్బారావు, ఎస్‌ఐ రమేష్‌బాబు, సిబ్బంది దాడి చేసి పట్టుకున్నారు. బెట్టింగ్‌లో గెలుపొందిన నిర్వాహకులకు రహస్యంగా పేమెంట్ చేయడం, బెట్టింగ్ కట్టిన నిర్వాహకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. అతని వద్ద నుంచి 1,48,560 నగదు, సెల్‌ఫోను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ చెప్పారు. గుట్టు చప్పుడు కాకుండా బెట్టింగ్ నిర్వహిస్తూ వేలకు వేలు గడిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. క్రికెట్ , మట్కా, పేకాటపై నిఘా పెంచామని, ఇందులో భాగంగా ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు ఆయన వెల్లడించారు. విలేకరుల సమావేశంలో త్రీ టౌన్ సీఐ చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.