అక్కడేమైనా ఫ్యాక్షన్ గొడవలున్నాయా?
– ముచ్చుమర్రిలో 144 సెక్షన్ విధింపుపై బైరెడ్డి ప్రశ్న
– పుష్కర నిధుల్లో 90శాతం.. నేతల జేబుల్లోకి వెళ్లాయని ఆరోపణ
జూపాడుబంగ్లా: కృష్ణాపుష్కరాలకు సంబంధించి చేపడుతున్న పనులు పూర్తిగా అవినీతి మయమని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. కోట్లాది రూపాలయ నిధులు వెచ్చిస్తున్నట్లు చెబుతున్నా 90శాతం నేతల జేబుల్లోకి వెళ్తుండగా పదిశాతం మాత్రమే పనులకు వెచ్చిస్తున్నారని విమర్శించారు. జూపాడుబంగ్లా వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం జరిగిన వివాహ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. కృష్ణాపుష్కరాలకోసం కేటాయించిన నిధుల్లో అత్యధికం కోస్తాంధ్రకే విడుదల చేశారన్నారు. రాయలసీమ ప్రాంతంలో కేవలం కంటి తుడుపు చర్యగా నిధులు వెచ్చిస్తున్నారని ఆరోపించారు. పనులు నాసీరకంగా చేపట్టడంతో నిర్మించిన వారం రోజులకే కృష్ణార్పణమయ్యాయన్నారు. పుష్కరఘాట్ల నిర్మాణంలో ముందుచూపు లేకుండా కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, సీఎం, కలెక్టర్ ఇంటి నుంచి తెచ్చినవైతే ఇలా చేస్తారా అని ప్రశ్నించారు.
144 సెక్షన్ ఎందుకు..
ముచ్చుమర్రిలో పుష్కరఘాట్ వద్ద 144 సెక్షన్ విధించడంపై బైరెడ్డి మాట్లాడుతూ ముచ్చుమర్రిలో ఏమైనా మతపరమైన గొడవలు ¯ð లకొన్నాయా, ఫ్యాక్షన్ తగాదాలు ఏర్పడ్డాయా అని ప్రశ్నించారు. అలాంటివేమీ లేనప్పుడు 144 సెక్షన్ ఎందుకు విధించారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆచార వ్యవహారాల జోలికి వస్తే సీఎం చంద్రబాబుకు తగినగుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ముచ్చుమర్రి గ్రామంలో ఎవరికి ఏమిజరిగినా అందుకు బాబే బాధ్యుడన్నారు. ఎవ్వరడ్డుకున్నా ఈనెల 12న వెయ్యిమంది ముత్తయిదువులతో గ్రామంలో విగ్రహ ఊరేగింపు ఉంటుందని స్పష్టం చేశారు. రాయలసీమ ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సైఫూద్దీన్, రషీద్‌మియ్య, ఉసేనయ్య, శ్రీనివాసరెడ్డి, బాలనారాయణ, చెక్కరసాహెబ్ తదితరులు పాల్గొన్నారు.