వానా.. ట్రాక్ పని గోవిందా!
వానా..? ట్రాక్ పని గోవిందా!
Published Sat, Oct 1 2016 5:18 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
* తరచూ రైళ్ల రాకపోకలకు అంతరాయం
* ఇటీవలి వర్షాలకు సత్తెనపల్లి– పిడుగురాళ్ల రైల్వే ట్రాకుకు భారీ నష్టం
* నిర్వహణలోపంతోనే ఈ పరిస్థితి
గుంటూరు (నగరంపాలెం): గుంటూరు డివిజనులో రైళ్ల రాకపోకలు పూర్తిగా వాతావరణం మీదే ఆధారపడి నడుస్తున్నాయి. ఆశ్చర్యంగా ఉందా..నిజమే.. నిర్వహణలోపంతో ఒక మోస్తరు వర్షం ధాటికే రైల్వేట్రాకు కిలోమీటర్లు మేర కొట్టుకుపోతుండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. గత నెలరోజుల కాలంలో వర్షాల కారణంగా గురజాల వద్ద 800 మీటర్లు వరకు ట్రాకు కొట్టుకుపోగా, ఇటీవల కురిసిన వర్షాలకు సత్తెనపల్లి– పిడుగురాళ్ల మధ్యలో రైల్వే ట్రాకుకు భారీ నష్టం వాటిల్లింది. రాజుపాలెం– బెల్లంకొండ, బెల్లంకొండ– రెడ్డిగూడెం మధ్యలో రెండు చోట్ల భారీగా, మూడు చోట్ల రైల్వేట్రాకు కింద మట్టి కొట్టుకుపోయి పట్టాలు సైతం పక్కకు పోయాయి. సత్తెనపల్లి నుంచి నడికూడి మధ్య లో కనీసం 20 చోట్ల పైగా రైల్వే ట్రాకు మీద నుంచి వరదనీరు ప్రవహించటంతో మరమ్మతులకు గురైం ది. డివిజనులో రైల్వే ట్రాకు నిర్వహణ సక్రమంగా లేకపోవటంతోనే భారీగా ట్రాకుకు నష్టం వాటిల్లిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నూతనంగా నిర్మించిన ఆర్‌యుబీల వద్ద, బ్రిడ్జిల పక్క న సక్రమంగా గట్లు పటిష్టం చేయకపోవటంతో ఎక్కువ స్థాయిలో రైల్వే ట్రాకు కు నష్టం వాటిల్లింది. గత మేనెలలో కూడా డివిజను పరిధిలో వలి గొండ మండలంలో ఆర్‌యూ బీ వద్ద వర్షానికి ట్రాకు కింద మట్టికొట్టుకుపోయి డెల్టా ఎక్స్‌ప్రెస్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. నడికూడి నుంచి పగిడిమర్రి వరకు 100కిలోమీటర్ల వేగంతో రైలు నడపటానికి తగ్గ సామర్థ్యంతో ట్రాకు నిర్మించామని రికార్డులో చూపుతున్నా...కాల్వలు, చెరువుల వద్ద 20 వరకు కాషన్ ఆర్డర్స్ ఉండటంతో సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కూడా 60కిలోమీటర్లు మించి ప్రయాణించటం లేదు. ఇక ప్యాసింజరు, ఎక్స్‌ప్రెస్‌ల స్పీడు సరాసరి 30 నుంచి 40 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. జోన్ నుంచి ఉన్నతస్థాయి అధికారులు ట్రాకు పరిశీలనకు వచ్చినప్పుడు ట్రాకు పై కంకర ఎలైన్‌మెంట్, సుందరీకరణ చేస్తున్నారు తప్పితే పటిష్టత గురించి పట్టించుకోవటం లేదన్న ఆరోపణలున్నాయి. చిన్నపాటి వర్షానికే ట్రాకు సమీపం లో భారీగా నిలుస్తున్న వర్షంనీటి గురించి గానీ, భారీ వర్షం వస్తే నీటి మళ్ళింపు ఏర్పాట్ల పై గానీ డివిజ ను స్థాయి అధికారులు పట్టించుకోవటం లేదు. ట్రాక్‌మెన్లను, గ్యాం గ్‌లోని సభ్యులను తగ్గించి వేయటంతో ట్రాకు తనిఖీలు నామమాత్రంగా జరుగుతున్నాయి. ప్రతి షిఫ్ట్‌లో ఒక వ్యక్తి రెండు కిలోమీటర్లు మాత్రమే రెండుసార్లు తనిఖీ చేయా ల్సి ఉండగా సిబ్బంది తక్కువగా ఉండటంతో ఎనిమిది కిలోమీటర్ల వరకు తనిఖీ చేయాల్సి వస్తోంది.
జీఎం రవీందర్ గుప్తా పనులు పరిశీలన..
పునరుద్ధరణ పనులను గురువారం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ జనరల్ మేనేజరు రవీందర్ గుప్తా గురువారం పరిశీలించారు. మేజరుగా దెబ్బతిన్న రెడ్డిగూడెం సమీపంలోని అనుపాలెం వద్ద, సత్తెనపల్లి వద్ద దూళిపాళ్ళ వద్ద లైట్ ఇంజనుతో నిర్వహించిన ట్రయల్‌రన్‌ను పరిశీలించారు. పూర్తిస్థాయిలో మరమ్మతులు నిర్వహించి శుక్రవారం అర్ధరాత్రి నుంచి రైళ్ళు నడిచేలా చర్యలు తీసుకుంటామన్నారు.
వారం పైగానే నిలిచిన రైళ్ల రాకపోకలు..
గుంటూరు డివిజనుకు ప్రధానమైన నడికూడి–సికింద్రాబాద్ రైల్వేమార్గంl22వ తేదీన వరదనీటికి దెబ్బతినటంతో రైళ్లరాకపోకలు నిలిపివేశారు. దీనితో డివిజనుకు ఆర్థికంగా భారీ నష్టం వచ్చింది. డివిజనులో ప్రయాణికుల ద్వారా రోజుకు రూ.30లక్షల ఆదాయం వస్తుండగా ఈ సెక్షన్∙ద్వారానే రూ. 25లక్షలు సమకూరుతుంది. ఆదే విధంగా సరకు రవాణా వాహనాలు ద్వారా వచ్చే ఆదాయం కూడా గణనీయంగా ఈ మార్గం ద్వారానే వస్తుంది. సత్తెనపల్లి– రెడ్డిగూడెం మధ్యలో 48 కిలోమీటరు వద్ద 1.2కిలోమీటరు , 52 కిలోమీటరు వద్ద కీలోమీటరు వరకు కొట్టుకుపోయిన రైల్వేట్రాకు పనులు గురువారం కొంత ముందుకు సాగాయి. ఈ రెండు ప్రాంతాల్లో జోన్ నుంచి వచ్చిన పీ అండ్ డీ చీఫ్ ఇంజనీరు , చీఫ్ బ్రిడ్జి ఇంజనీరు పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
Advertisement
Advertisement