ఇదేనా ‘సభ్యత’?
ఇదేనా ‘సభ్యత’?
Published Tue, Dec 13 2016 12:04 AM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM
= టీడీపీ సభ్యత్వం తీసుకుంటేనే రేషన్, పింఛన్
= తారాస్థాయికి అధికార పార్టీ ఆగడాలు
= కార్డుదారులను ముప్పుతిప్పలు పెడుతున్న ‘పచ్చ’ డీలర్లు
= రూ.వంద కట్టించుకుని బలవంతంగా సభ్యత్వం ఇస్తున్న వైనం
ధర్మవరం : అధికార పార్టీ ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పార్టీ సభ్యత్వ నమోదులోనూ అడ్డదారులు తొక్కుతున్నారు. ఇష్టమున్నా, లేకున్నా బలవంతంగా సభ్యత్వ రశీదును అంటగడుతున్నారు. రూ.వంద చొప్పున ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. పింఛన్దారులు, రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా టీడీపీ సభ్యత్వం తీసుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. లేదంటే ‘కోత’ పెడతామంటూ బెదిరిస్తున్నారు. దీనివల్ల బాధితులు లబోదిబోమంటున్నారు.
అధికార టీడీపీ నాయకులు ప్రతియేటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సభ్యత్వ నమోదు చేయిస్తున్నారు. అయితే.. ఈ సారి తమ అధినేత వద్ద మార్కులు కొట్టేయాలని భావించిన ధర్మవరం నియోజకవర్గ నాయకులు ఓ అడుగు ముందుకేసి తమ పార్టీ కేడర్‌కు, అనుయాయులకు టార్గెట్‌లు పెట్టారు. స్టోర్ డీలర్లు, పింఛన్ పంపిణీదారులు, ఉపాధి మేట్లకు కూడా టార్గెట్లను నిర్దేశించారు. వారు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులందరినీ టీడీపీ సభ్యులుగా చేరాలంటే ఒత్తిడి చేస్తున్నారు. ధర్మవరం నియోజకవర్గంలో మొత్తం 72,490 రేష¯ŒSకార్డులు ఉన్నాయి. 41,819 మంది పింఛన్దారులు ఉన్నారు. వీరిలో దాదాపు 80 శాతం మందికి టీడీపీ సభ్యత్వం అంటగట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా రేషన్ డీలర్లు తమ వద్దకు సరుకుల కోసం వచ్చే వారిని తప్పనిసరిగా సభ్యత్వం తీసుకోవాలంటూ బలవంతం చేస్తున్నారు. సభ్యత్వం కోసం రూ.వంద కట్టి సరుకులు తీసుకెళ్లండని, లేకపోతే ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. వాస్తవానికి పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఈ నెల సరుకులను అరువుపై ఇవ్వాలని డీలర్లను ప్రభుత్వం ఆదేశించింది. అయితే.. డీలర్లు మాత్రం తప్పనిసరిగా రూ.వంద చెల్లించాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. అలాగే ఈ నెల నుంచి «పింఛన్ దారులకు ఇబ్బందులు తలెత్తకూడదని నేరుగా అకౌంట్లకు పింఛన్ మొత్తాలను జమ చేశారు. వారిలో చాలా మందికి అకౌంట్లు లేకపోవడం, ఉన్నా ఆన్లైన్లో నమోదు కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకున్న అధికార పార్టీ నాయకులు పింఛన్ రావాలంటే తప్పనిసరిగా రూ.100 చెల్లించి సభ్యత్వం తీసుకోవాలని వృద్ధులు, వికలాంగులను భయపెడుతున్నారు.
ఒకవైపు రేషన్.. మరోవైపు సభ్యత్వ నమోదు
టీడీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి వచ్చిన సిబ్బంది రేషన్ పంపిణీ కేంద్రాల వద్ద కూర్చుని, కార్డుదారుల వివరాలు అక్కడికక్కడే సేకరించి సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారు. రూ.100 కట్టించుకుని వారికి రశీదులు ఇచ్చిపంపుతున్నారు. టీడీపీ సభ్యత్వం తీసుకుంటే ఇన్సూరెన్సు ఉంటుందని, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్యం అందుతుందని మభ్యపెడుతున్నారు. దీనిపై ధర్మవరం ఆర్డీఓ బాలానాయక్‌ను సంప్రదించగా..ఈ విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. ఎవరు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.
Advertisement
Advertisement