మాఫికి టోపి
మాఫికి టోపి
Published Mon, Oct 10 2016 12:08 AM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM
కలగా మిగిలిన చేనేత రుణమాఫీ ∙ఏళ్లు గడుస్తున్నా నెరవేరని హామీ
జిల్లాలో మాఫీ కావాల్సిన రుణాలు రూ.4.75 కోట్లు
రూ.110 కోట్లు విడుదల చేశామంటూ ప్రభుత్వం ప్రకటనలు
నయాపైసా కూడా మాఫీ కాని వైనం
పిఠాపురం : చేనేత రుణమాఫీ చేస్తామంటూ ఎన్నికల వేళ చంద్రబాబు ఇచ్చిన హామీ.. రెండున్నరేళ్లు గడిచినా నెరవేరకపోవడంతో.. తాము నట్టేట మునిగామని నేతన్నలు వాపోతున్నారు. చేనేత రుణమాఫీకి రూ.110 కోట్లు విడుదల చేశామని ప్రభుత్వం ప్రకటించి ఏళ్లు గడుస్తున్నా. మాఫీ కాక, చేసిన అప్పులు తీరక నేతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. మాఫీ పేరుతో ప్రభుత్వం తమ నెత్తిన టోపీ పెట్టినట్టుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 50 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. వీటి పరిధిలో 17,062 చేనేత మగ్గాలున్నాయి. 45 వేలకు పైగా నేత కార్మికుల కుటుంబాలున్నాయి. సుమారు 2 లక్షల మంది కార్మికులు చేనేతపై ఆ«ధారపడి జీవిస్తున్నారు. వీరుకాక సంఘాల్లో లేకుండా మరో 30 వేల మంది నేత కార్మికులున్నారు. చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యాన వివిధ బ్యాంకుల ద్వారా 2,177 మంది నేత కార్మికులు రూ.5.6 కోట్లకు పైగా వ్యక్తిగత, సంఘాల రుణాలు తీసుకున్నారు. వీటిలో 2,017 మందికి రూ.4,17,49,326 వ్యక్తిగత రుణాలు, 160 మందికి రూ.22,24,918 మేర గ్రూపు కార్మికుల వ్యక్తిగత రుణాలు, 52 పవర్‌లూమ్స్‌కు సంబంధించి రూ.59,66,479 రుణాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా రూ.4.75 కోట్ల మేర చేనేత రుణమాఫీ చేయాలని చేనేత, జౌళి శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. నెలలు గడుస్తున్నా ఒక్క పైసా కూడా మాఫీ జరగలేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఖాతాలో డబ్బు పడితే ఖతం
మరోపక్క రుణాలు తీసుకున్న నేత కార్మికులు కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. వారి బ్యాంకు ఖాతాల్లో ఎవరు డబ్బులు వేసినా వెంటనే సంబంధిత బ్యాంకు సిబ్బంది ఆయా కార్మికుల అప్పులకు సంబంధించిన వడ్డీల కింద ఆ మొత్తాన్ని జమ చేసుకుంటున్నారు. కొందరు కార్మికుల పిల్లలు ఇతర ప్రాంతాల్లో ఉపాధికి వెళ్లి అక్కడ నుంచి తల్లిదండ్రుల ఖాతాలకు డబ్బు పంపుతున్నారు. ఆ మొత్తాన్ని బ్యాంకులు వడ్డీగా జమ చేసుకోవడంతో పలువురు తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. చివరకు గ్యాస్ సబ్సిడీ వచ్చినా కూడా వడ్డీ కింద జమ చేసుకుంటున్నారని నేత కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకుల ఒత్తిడి ఎక్కువైందని అంటున్నారు.
Advertisement