ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చారు
పరకాల సభలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి
వరంగల్ నుంచి సాక్షి ప్రతినిధి : ముఖ్యమంత్రి కేసీఆర్ అహంకారంతో తీసుకున్న నిర్ణయంతోనే వరంగల్ ఉప ఎన్నికలు వచ్చాయని... ప్రజల సమస్యలను పూర్తిగా మరచిపోయిన టీఆర్‌ఎస్ పార్టీని, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలను ఓడించాలని వైఎస్సార్‌సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం రాత్రి పరకాలలోని బస్టాండ్ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో స్వయంగా ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం మండుటెండలో పాదయాత్ర చేశారని... ప్రజల దీవెనలతో ముఖ్యమంత్రి అయి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పారు. రైతును రాజు చేయడమే కాకుండా మహిళలు, మైనార్టీలు, విద్యార్థులు, నిరుద్యోగులకు అండగా నిలిచారన్నారు.
టీఆర్‌ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రాష్ట్రంలో కుటుంబ పాలన తీసుకువచ్చిందని పొంగులేటి విమర్శించారు. ఉప ఎన్నికల్లో కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. రైతులకు రూ.లక్ష చొప్పున రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి మరిచిపోయారని ఆరోపించారు. 2004కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు జరిగేవని, తెలంగాణ వచ్చిన తరువాత మళ్లీ రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణకు బదులు ఆత్మహత్యల రాష్ట్రంగా మారిందని పేర్కొన్నారు. ఇక్కడ కేసీఆర్, అక్కడ చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్ అభిమానులకు భరోసా కల్పించడం కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు జగన్ వచ్చారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.