ఓడలు బండ్లవుతాయి.. బండ్లు ఓడలవుతాయి
♦ వరంగల్‌లో టీఆర్‌ఎస్ గెలిచినా మున్ముందు ప్రజాగ్రహం తప్పదు
♦ దీక్ష విరమణ సభలో వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ‘వరంగల్‌లో టీఆర్‌ఎస్‌కు ప్రజాతీర్పు మెజారిటీ ఇచ్చినా ఓడలు బండ్లు...బండ్లు ఓడలవుతాయి. దీనికి ఎంతో సమయం పట్టదు. రాబోయే రోజుల్లో అన్ని రాజకీయపార్టీలతో కలసి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజాక్షేత్రంలోకి పోతాం. అప్పుడు ప్రజాగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధి, పలు సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లాకేంద్రంలోని ధర్నాచౌక్ వద్ద ఆయన చేపట్టిన రెండురోజుల దీక్ష మంగళవారం సాయంత్రంతో ముగిసింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, సీపీఐ నేత సింగు నర్సింహారావు, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, లంబాడీ మహిళలు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేపట్టిన దీక్షకు ప్రజాభిమానం వెల్లువెత్తింది. దీనికి ముందు ఆయన సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాదిన్నరలో ప్రజాసమస్యలపై ఖమ్మం జిల్లాకు సీఎం ఒక్కసారైనా వచ్చా రా..? అని ప్రశ్నించారు. పాలకులు జిల్లాపై తీవ్ర వివక్ష చూపుతున్నారనడానికి ఇదే నిదర్శనమన్నా రు. ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చిన తర్వా త కేసీఆర్ ఏ వాగ్దానాన్నీ అమలు చేయలేద న్నారు. రాష్ట్ర విభజనతో ఖమ్మం జిల్లా నుంచి ఏడు మండలాలు పోయి అన్యాయం జరిగిందన్నారు. బయ్యారంలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణం ఊసెత్తకుండా కేంద్రం అలసత్వం ప్రదర్శిస్తోం దని పొంగులేటి అన్నారు. ప్రభుత్వం సమస్యలపై స్పందించకపోతే కలసి వచ్చేపార్టీలతో ఆమరణదీక్ష చేపడతానన్నారు.