పాలనలో సీఎం కేసీఆర్ విఫలం
ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు
ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీకే ప్రజల పట్టం: పొంగులేటి
కాజీపేట రూరల్: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమర్థవంతమైన పాలనను అందించడంలో సీఎం కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యూరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆక్షేపించారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌ను గెలిపించాలని కోరుతూ ఆయన హన్మకొండలో ఆదివారం పాదయాత్ర చేశారు. ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ టీఆర్‌ఎస్ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలో చేసిన ప్రకటనలు.. అధికారంలోకి వచ్చి 17 నెలలైనా ఎందుకు అమలు చేయలేకపోతున్నారో సీఎం కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, లక్ష ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చిన హామీలు నెరవేరలేదన్నారు.
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, అప్పటి వైఎస్సార్ పాలనను.. ప్రస్తుతం కేసీఆర్ పాలన తీరును ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు పాలనలో ప్రజలు మోసపోతున్నారని, ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో మేలు చేసిన వైఎస్‌ఆర్ పథకాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్‌సీపీ ముందుకు వెళ్తోందని, ప్రజలలో వైఎస్సార్‌సీపీకి మంచి ఆదరణ స్పందన లభిస్తున్నదని శ్రీనివాసరెడ్డి అన్నారు.
వైఎస్.రాజశేఖరరెడ్డి లాంటి పాలన.. ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. వైఎస్సార్‌సీపీ నుంచి వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్యాన్ గుర్తుతో పోటీ చేస్తున్న నల్లా సూర్యప్రకాష్‌ను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ పాదయూత్రలో ఎంపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్, వైఎస్సార్‌సీపీ ఏపీ రాష్ట్ర నాయకురాలు నందమూరి లక్ష్మిపార్వతి, జిల్లా పరిశీలకుడు కొండా రాఘవరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శివకుమార్, గట్టు శ్రీకాంత్‌రెడ్డి, రహమాన్, జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, వరంగల్ గ్రేటర్ అధ్యక్షుడు కాయిత రాజ్‌కుమార్ యాదవ్, రంగారెడ్డి జిల్లా అద్యక్షుడు సురేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.