
సినీ కలలకు శ్రీ జగపతి రక్ష
చిన్న సినిమాల పెద్ద విజయాలతో... టాలెంట్ ఉంటే అవకాశాలకు, విజయాలకూ కొదవలేదనే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తుండడంతో సినీరంగం వైపు పెద్ద ఎత్తున యువత అడుగులు వేస్తోంది. అయితే సిటీకి అలా వచ్చేయగానే ఇలా సినీ ప్రవేశం దొరకడం జరిగేది కాదు. అది జరిగేలోగా సినిమా ఆశల్ని సొమ్ము చేసుకునేందుకు, రంగుల కలల్ని ఆసరాగా తీసుకొని ఎన్నో విధాలుగా కాటేసేందుకు బోలెడన్ని విషనాగులు ఎదురు చూస్తుంటాయి. మరి నిజాయతీగా సినిమా మీద ఆసక్తితో వచ్చే వారికి అంతే నిజాయతీగా మార్గం చూపేవారు ఎక్కడ? అంటే ‘నేనున్నా’ అంటున్నారు హీరో జగపతిబాబు.
– శిరీష చల్లపల్లి
బడికెళ్లే వయసు నుంచే సినిమాల మీద మక్కువతో కుటుంబాన్ని, ఊరిని వదిలి భాగ్యనగర స్టూడియోల చుట్టూ తిరుగుతూ... అవకాశాల కోసం కాళ్లు పట్టుకుంటూ... తెచ్చుకున్న డబ్బులు అయిపోతే కన్న కలలను త్యాగం చేయలేక... మనసు చంపుకొని బతకలేక... సొంత ఊరికి ముఖం చూపించలేక... కాకా హోటల్‌లో బేరర్‌గా.. బడ్డీ కొట్టులో సేల్స్ బాయ్‌గా... నిజ జీవిత పాత్రలకి పరిమితమైపోతున్న వారెందరో.
‘సినిమాల్లోకి ఎంటర్ అవడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డాను. చీకటి గదుల్లో కూర్చొని కుమిలిపోయిన రోజులూ ఉన్నాయి. ఫిలిం బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నాకే ఇన్ని కష్టాలు తప్పలేదంటే.. ఇక సినీరంగంపై మోజుతో ఊర్లలో నుంచి వచ్చే వారికి ఇంకెన్ని కష్టాలుంటాయి?’ అనే ప్రశ్నే తనను ఈ క్లిక్ సినీ క్రాఫ్ట్ కంపెనీని ప్రారంభించేందుకు దోహదం చేసిందంటారు జగపతిబాబు.
కలర్‌ఫుల్ కలలకు స్వాగతం...
అవకాశాలు రాకపోవడం ఒకెత్తయితే, ఒకటీ రెండు సినిమాల్లో ఛాన్సులు దక్కించుకున్నా... ఆ తర్వాత అవకాశాలు లేక ఎలా బతకాలో, ఏం చేయాలో తెలియక బలవన్మరణానికి పాల్పడటమూ జరుగుతోంది. అయితే తమ ‘క్లిక్ సినీ క్రాఫ్ట్ (సీసీసీ)’ వెబ్‌సైట్ ద్వారా ప్రతి ఒక్కరి సినీ కలలను నిజం చేసేందుకు తలుపు తెరిచి ఆతిథ్యమిచ్చేందుకు రెడీగా ఉన్నామంటున్నారు ఈ కంపెనీ ఎండీ, టాలీవుడ్ స్టార్ జగపతిబాబు. సినీ రంగంపై ఆసక్తి ఉండి, అందులోకి రావాలనుకునే వారికి సరైన వేదిక లేదంటున్న ఆయన... తమ సీసీసీ ఆ ఖాళీని పూరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశార
వెబ్‌సైట్.. సినిమా రూట్
హీరో హీరోయిన్స్, స్క్రిప్ట్ రైటర్స్, కెమెరా మెన్స్, హాస్య నటులు... ఇలా సినిమాకి అవసరమైన 24 క్రాఫ్ట్‌్సకు సంబంధించి ఏ కళలో ప్రావీణ్యమున్న వారైనా సరే ఈ కంపెనీ వెబ్‌సైట్ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి సులభంగా ప్రవేశించొచ్చని దీని రూపకర్తలు హామీ ఇస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడున్న వారైనా సరే తమ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయితే సినీ రంగంలోకి ఎలా ప్రవేశించాలో సమాధానం లభిస్తుందన్నారు.
ఎవరైనా సరే తమ వీడియోలు, పోర్ట్‌ఫోలియోను వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకుంటే వారి అర్హతలను బట్టి, వీలైనంత త్వరగా వారిని ఆడిషన్స్‌కి పిలిచి అవకాశాలు కల్పిస్తామని చెబుతున్నారు. ప్రతి ఒక్క క్రాఫ్ట్‌కి సంబంధించిన వారు ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చు.
అందరికీ ఉచితమే...
అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఎవరైనా సరే ఉచితంగా వీరి సేవలు వినియోగించుకోవచ్చు. తమదైన శైలిలో మంచి సినిమాలు తీసి ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకోవాలనుకునే వారు సైతం ఇందులో పేరు నమోదు చేసుకోవచ్చు. ‘ప్రొడ్యూసర్‌కి అవరసమైన పబ్లిసిటీ ఇస్తూ, రిలీజ్ గ్యారంటీ భరోసాను సైతం ఇస్తూ అతి తక్కువ బడ్జెట్‌లో (రూ.రెండు, మూడు కోట్లలో) సినిమా తీసి ఇవ్వడమే మా ప్రధాన లక్ష్యం’ అంటున్నారు రూపకర్తలు.
ఈ కంపెనీ మొదలు పెట్టిన నాలుగు నెలల్లోనే ఐదు వేల మంది రిజిస్టర్ చేసుకున్నారని చెప్పారు జగపతిబాబు. ఈ స్పందన తన లక్ష్యాన్ని చేరే నమ్మకాన్ని అందించిందని ఆనందం వ్యక్తం చేశారు. ‘గొప్ప జీవితాన్నిచ్చిన ఇండస్ట్రీకి నా వంతుగా టాలెంట్ ఉన్న వారిని పరిచయం చేయాలని ఈ ప్రాజెక్టుని మొదలుపెట్టాను. దీని ద్వారా అంతులేని మానసిక సంతృప్తిని పొందుతున్నాన’ని చెప్పారాయన.
వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ఔత్సాహికులకు ఆడిషన్స్ నిర్వహిస్తున్న దృశ్యాలు....
వెబ్‌సైట్: www.clickcinecraft.com