
పీఆర్సీపై దోబూచులాట
వేతన సవరణ అమలు విషయంలో ప్రభుత్వం దోబూచులాడుతోంది. సినిమా ట్రైలర్‌ను చూపించినట్టుగా..
- 4 జీవోల నంబర్ల జారీకే పరిమితమైన ఏపీ ప్రభుత్వం
- వెబ్‌సైట్‌లో మాత్రం ఖాళీ పేజీల దర్శనం
- పూర్తి జీవోలు నేడు వెల్లడి
- ఉద్యోగ సంఘాల విమర్శ
- మిగతా జీవోలపై ఇంకా స్పష్టత కరువే
సాక్షి, హైదరాబాద్: వేతన సవరణ అమలు విషయంలో ప్రభుత్వం దోబూచులాడుతోంది. సినిమా ట్రైలర్‌ను చూపించినట్టుగా.. గురువారం కేవలం జీవోల నంబర్ల జారీకే పరిమితమై పూర్తి జీవోల విడుదలను శుక్రవారానికి వాయిదా వేసింది. 43 శాతం ఫిట్‌మెంట్, నూతన వేతనాల స్థిరీకరణకు అవసరమయ్యే డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏ.. మొత్తం నాలుగు జీవోలు (నం. 46, 47, 48, 49) గురువారం రాత్రి వెబ్‌సైట్‌లో పెట్టారు. తీరా వాటిని తెరచి చూస్తే ఖాళీ పేజీలు దర్శనమిచ్చాయి. ఈ అంశంపై సాక్షి ఆర్థిక శాఖ అధికారులను సంప్రదించింది. జీవోలకు నంబర్లు మాత్రమే ఇచ్చామని, పూర్తి జీవోలను శుక్రవారం అప్‌లోడ్ చేస్తామని వారు సమాధానం చెప్పారు. గురువారమే జీవో నంబర్లు ఇవ్వడం.. ప్రభుత్వం ఏప్రిల్‌లోనే పీఆర్సీ అమలు జీవోలు జారీ చేసిందని చెప్పుకోవడానికి మినహా ఎందుకూ ఉపయోగపడదని ఉద్యోగ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.
మిగతా జీవోలు ఎప్పుడో..: పీఆర్సీ సిఫారసులను యథాతథంగా ఆమోదిస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే మిగతా జీవోలు ఎప్పుడు జారీ చేస్తారనే విషయంలో మాత్రం ఇప్పటివరకు స్పష్టత లేదు. పీఆర్సీలో కీలకమైన 43 శాతం ఫిట్‌మెంట్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫిబ్రవరి 9న ప్రకటించిన విషయం విదితమే. ఏప్రిల్ నెల నుంచి కొత్త వేతనాలు అమల్లోకి వస్తాయని, అంటే మే 1న అందే జీతంలో నగదు పెంపు కనిపిస్తుందని సీఎం చెప్పారు. కానీ వాస్తవంగా అమలు చేసే సమయానికి బాబు మాట తప్పారు. ఏప్రిల్ నుంచి కాకుండా మే నుంచి కొత్త వేతనాలు అమలవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి పరిస్థితుల్లో పీఆర్సీ మిగతా సిఫారసుల అమలుకు గాను జీవోల కోసం మళ్లీ కాళ్లరిగేలా తిరగకతప్పదని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
ప్రభుత్వం ఆమోదించాల్సిన సిఫారసులివే..
కేంద్ర ప్రభుత్వం తరహాలో మహిళా ఉద్యోగులకు 2 ఏళ్లపాటు పిల్లల సంరక్షణ సెలవు.
ఈఎల్స్‌ను ఉద్యోగ విరమణ సమయంలో నగదుగా మార్చుకొనే అవకాశాన్ని స్థానిక సంస్థల ఉద్యోగులు, టీచర్లు, ఎయిడెడ్ విద్యా సంస్థల సిబ్బందికి పునరుద్ధరణ.
పే స్కేళ్లు పెరిగిన నేపథ్యంలో.. రిటైర్‌మెంట్ గ్రాట్యుటీ గరిష్ట పరిమితి రూ. 8 లక్షల నుంచి రూ. 12 లక్షలకు పెంపు.
అంత్యక్రియల ఖర్చు రూ. 10 వేల నుంచి రూ. 20 వేలకు పెంపు.
25 ఏళ్లపాటు సర్వీసు ఉంటే పూర్తి పెన్షన్‌కు అర్హత.
కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగినులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవు.
ఎల్టీసీ (లీవ్ ట్రావెల్ కన్సెషన్) పరిమితి రూ. 12,500 నుంచి రూ.18,750కు పెంపు.
పిల్లల చదువులకు చెల్లించే ట్యూషన్ ఫీజు రూ. 1,000 నుంచి రూ.2,500కు పెంపు.