జలసిరి.. వర్షార్పణం
► జలసిరి-2 అమలు తీరిదీ..
►10,223 జలసిరి బోర్ల లక్ష్యం
►5,850గుర్తించిన బ్లాక్‌లు
►1,185నీటి లభ్యత బ్లాక్‌లు
►106మంజూరు
►74వేసిన బోర్లు
► 39 నీళ్లు పడిన బోర్లు
ఆయకట్టును పెంపొందించే ఉద్దేశంతో అమలు చేస్తున్న జలసిరి పథకం జిల్లాలో చతికిల పడింది. కాలువల్లో నీరు పారకపోయినా పంటలు ఎండిపోకూడదని బోర్లు వేసేందుకు తీసుకున్న నిర్ణయం అపహాస్యమవుతోంది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు.. అధికారుల్లో చిత్తశుద్ధి లోపించడం వల్ల పుణ్యకాలం కాస్తా గడిచిపోతోంది. వర్షాకాలం ప్రారంభం కావడంతో ఇక బోర్లు వేసే అవకాశం కూడా లేకుండాపోతోంది.
ఆయకట్టు ప్రాంతాల్లో 10,223 బోర్ల తవ్వకానికి అనుమతి లభించింది. ఆయకట్టు ప్రాంతాల్లో రెండు నుంచి మూడెకరాల భూమి కలిగిన రైతులు ఈ పథకానికి అర్హులు. ఆయకట్టు ప్రాంతాల్లోని చివరి భూములకు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. అర్హులైన లబ్ధిదారుల జాబితాను జన్మభూమి కమిటీ ఆమోదించాల్సి ఉండగా.. లబ్ధిదారుడు పట్టాదారు పాసు పుస్తకం నకలు, ఆధార్‌కార్డు, ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డు అందజేయాలనే నిబంధనలు విధించారు. ప్రభుత్వం బోరు తవ్వుకునేందుకు రూ.1,19,000 ఇస్తుందనే మాటే కానీ.. క్షేత్ర స్థాయిలో సవాలక్ష నిబంధనలు రైతులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కేవలం ఆయకట్టు ప్రాంతాల్లోనే బోరు బావి తవ్వాలనే నిబంధన వల్ల ఈ పథకం లక్ష్యాన్ని చేరుకోలేకపోయినట్లు తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోవడం.. ప్రభుత్వం నిర్ణీత అడుగుల వరకే డబ్బు చెల్లిస్తామని చెప్పడంతో పథకం నీరుగారింది.
అదనపు భారం రైతుపైనే..
విద్యుదీకరణ సబ్సిడీ, పంపుసెట్ ఖరీదుపై లబ్ధిదారుడు ఎస్సీ, ఎస్టీలైతే 5శాతం(రూ.4,500), ఇతరులు 20శాతం(రూ.18,000) చెల్లించాలి. విద్యుదీకరణకు రూ.50వేల సబ్సిడీ మినహాయించి మిగిలిన మొత్తమంతా లబ్ధిదారుడే భరించాల్సి వస్తోంది. ఇక్కడే అసలు సమస్య ఉత్పన్నమవుతోంది. కేవలం విద్యుదీకరణకే కొందరు రైతులకు రూ.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు వెచ్చిస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారులు అవసరమైన కెపాసిటీ ట్రాన్స్‌ఫార్మర్ కంటే అధిక కెపాసిటీ ట్రాన్స్‌ఫార్మర్‌ను అమరుస్తుండటంతో రైతులపై మరింత భారం పడుతోంది. బోరు బావి తవ్వేందుకు, కేసింగ్ పైపు వేసేందుకు గరిష్టంగా రూ.24వేలు చెల్లిస్తామని చెబుతున్నా, బోరు ఫెయిలైతే మాత్రం కొంత మొత్తాన్ని లబ్ధిదారుడే భరించాల్సి ఉంది. చిన్న, సన్నకారు రైతులు ఆ మొత్తాన్ని వెచ్చించలేక పథకంపై పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
వర్షాకాలంలో బ్రేక్ పడినట్లే..
వర్షాకాలం ప్రారంభం కావడంతో బోరు బావుల తవ్వకాలపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆయకట్టు ప్రాంతాల్లోనే బోరుబావులు తవ్వాలనేది పథకంలోని నిబంధన. ఆయకట్టు ప్రాంతాల్లో అధికంగా వరిమళ్లు ఉండటం.. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో ఆ పొలాల్లోకి వెళ్లేందుకు బోరువెల్ వాహన యజమానులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒకసారి పొలంలో వాహనం దిగబడిందంటే దానిని బయటకు తీసుకొచ్చేందుకు భారీగా ఖర్చు అవుతుందని జంకుతున్నారు. ఫలితంగా పథకానికి ఈ సీజన్‌లో బ్రేక్ పడినట్లేననే చర్చ జరుగుతోంది.