సోనియా తలుచుకుంటే కేసీఆర్ ఎంత?
ప్రజల ఆకాంక్షను గౌరవించే రాష్ట్ర విభజన: జానారెడ్డి
మిర్యాలగూడ: కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కె.జానారెడ్డి తొలిసారిగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. నాడు యూపీఏ అధినేత్రి సోనియాగాంధీ తలుచుకుంటే కేసీఆర్ ఎంత టివాడని, ఆయన ఉద్యమం పాకిస్తాన్‌తో చేసిన యుద్ధం కంటే ఎక్కువా అని ప్రశ్నించారు. ప్రజల ఆకాంక్షను గౌరవించే సోనియా తెలంగాణ ఇచ్చారని గుర్తుచేశారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు.
రాష్ట్రంలో టీఆర్‌ఎస్ బలంగా ఉందని సర్వేల్లో వెల్లడైందని చెబుతున్న ఆ పార్టీ నాయకులు ఇతర పార్టీల వారిని ఎందుకు చేర్చుకుంటున్నారని ప్రశ్నిం చారు. సర్వేల పేరుతో ప్రజలను గోల్‌మాల్ చేయాలని చూస్తున్నారన్నారు. వాగ్దానాల అమలులో ప్రభుత్వానికి విశ్వసనీయత లేదన్నారు. డబుల్ బెడ్రూం పథకం వస్తుందని చెబుతున్నారే తప్ప అమలు చేయడం లేదన్నారు. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై దరఖాస్తులు స్వీకరించి రాష్ట్రపతికి అందజేస్తామన్నారు.