కేసీఆర్.. ఇదేం భాష?
మా ఓపికకూ హద్దుంటుంది: జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ భాష, వ్యాఖ్యల తీరు సరికాదని, తమ సహనానికీ ఓ హద్దుంటుందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత కె.జానారెడ్డి హెచ్చరించారు. తాము కూడా సీఎం భాషను ఉపయోగించాలనుకుంటే మూడు రెట్లు ఎక్కువగా మాట్లాడగలమన్నా రు. కానీ హుందాతనం, సంస్కారం అడ్డు వస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార పైత్యంతో పైశాచికంగా వ్యవహరిస్తోందన్నా రు. అధికారంలో ఉన్నవారు అవగాహన లేకుండా అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. వారి తీరువల్లే కోర్టుల్లో సర్కారుకు మొట్టికాయలు పడుతున్నాయన్నారు.
అవగాహనారాహిత్యాన్ని, తప్పులను కప్పిçపుచ్చుకోవడానికే కాంగ్రెస్‌పై కేసీఆర్ నోరు పారేసుకుంటున్నారన్నారు. గురువారమిక్కడ శాసన మండలిలో కాంగ్రెస్ పక్షనేత షబ్బీర్ అలీ, ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డితో కలసి జానా విలేకరులతో మాట్లాడారు. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలను అడ్డుకున్నది జాగృతి నేతలు కాదని చెప్పగలరా అంటూ సవాల్ విసిరారు. ‘‘సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్సే కోరింది. మా పార్టీ అభివృద్ధిని అడ్డుకోవడం లేదు. ప్రభుత్వ నిర్ణయాలతో కడుపు మండినవారు కోర్టులకు పోతే కాంగ్రెస్‌పై నిందలు వేయడం కేసీఆర్‌కు తగ దు. న్యాయం కోసం కోర్టులకు పోవడం నేర మా? గతంలో టీఆర్‌ఎస్ ఎన్నిసార్లు కోర్టుకుపోయిందో గుర్తుకు తెచ్చుకోవాలి.
సీఎం అడ్డ్డ గోలుగా రాజ్యం నడపాలని చూస్తున్నారు. కొత్త ప్రాజెక్టుల ద్వారా 2018లోపు విద్యుదుత్పత్తి జరిగితే అద్భుతమే. కానీ కేసీఆర్ చెబు తున్న ఆ స్థాయిలో ఉత్పత్తి 2020కి కూడా సాధ్యంకాదు. వాస్తవాలను చెప్పకుండా నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సీఎం ఆయన స్థాయికి తగినట్టుగా వ్యవహరించాలి. వట్టి మాటలు, అబద్ధాలు మానుకోవాలి’’ అని జానారెడ్డి హితవు పలికారు.
కేసీఆర్ వాడుతున్న భాష రాష్ట్రానికి మంచిది కాదని, ఇదే భావజాలాన్ని ప్రజలకు చెప్పాలని భావిస్తున్నారా అని ప్రశ్నించారు. కమ్యూనిస్టు పార్టీలను ఉద్దేశించి ‘నా కొడుకులు..’ అని సీఎం మాట్లాడటం దారుణమన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం చేసిన చరిత్ర వామపక్షాలదన్నారు. అధికారం శాశ్వతం కాదన్న సంగతిని కేసీఆర్ గుర్తుంచుకోవాలన్నారు.