జయహో సింధు..
అచ్యుతాపురం: డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో సోమవారం గురుకుల పాఠశాల విద్యార్థినులు జయహో సింధు.. ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుంచి అచ్యుతాపురం కూడలి వరకూ ర్యాలీచేసి మానవహారం ఏర్పడ్డారు. ఒలింపిక్స్‌లో రజిత పథకం సాధించి సింధు హైదరాబాద్‌కు చేరుకున్న సందర్భంగా సామూహిక స్వాగతాంజలి సమర్పించారు. డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలని, గ్రామీణ ప్రాంతాల్లో ఇకనైనా ప్రభుత్వాలు స్టేడియాల నిర్మాణాలు చేపట్టాలని కోరారు. విద్యార్థుల్లో క్రీడాస్పూర్తి ఉన్నప్పటికీ మైదానం, క్రీడాసామగ్రి లేని కారణంగా వెనకబడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పాఠశాలల్లో ఆటలకు ప్రాధాన్యం కల్పించాలని, మండల కేంద్రాల్లో మినీ స్టేడియాల నిర్మాణం చేపట్టాలన్నారు. తెలుగుతేజం సింధు దేశానికి ఖ్యాతిని తీసుకురావడం గర్వకారణంగా ఉందని పలువురు వక్తలు కొనియాడారు.