జేఎన్‌టీయూ : ఎంసెట్ రాత పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. ఈనెల 12 నుంచి ర్యాంకు కార్డులు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అదే రోజే ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా ప్రకటించనున్నారు. ఈ తరుణంలో ఇంజనీరింగ్ విద్యార్ధులు, తల్లిదండ్రుల్లో ఏ కోర్సులో చేరాలి, ఏ కళాశాలను ఎంచుకోవాలి అనే సందిగ్దం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా 16 ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా, 20కి పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వేల సంఖ్యలో సీట్లున్నా కళాశాలను, కోర్సును ఎంచుకోవడంలో తర్జన భర్జనలు పడుతూనే ఉన్నారు. ఏ కళాశాలలో ఏయే కోర్సులు బాగున్నాయి, వాటికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అని విస్తృతంగా పరిశీలిస్తున్నారు.
కళాశాల ఎంపికే కీలకం
నాణ్యమైన విద్యను అందించే కళాశాల ఎంపికే చాలా కీలకం. ఎంచుకున్న కళాశాలల ప్రాధాన్యత ఇంచు మించు ఒకేలా ఉన్నపుడే కోర్సు ఎంపిక ముఖ్యమవుతుంది. కళాశాలను ఎంపిక చేసుకునే క్రమంలో అక్కడ విద్యార్థికి దిశానిర్ధేశం చేసే వాతావరణం ఉందో లేదో తెలుసుకోవాలి. అక్కడి అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు సాధించిన ఘనతను పరిగణలోకి తీసుకోవాలి. బోధన, ల్యాబ్ నాణ్యతగా ఉన్నాయా, లేదా అని పరీశీలించాలి. 100 శాతం ప్రాంగణ నియామకాలున్న వాటిపై దృష్టి పెట్టాలి. అలాగే కళాశాలకు రవాణా సౌకర్యాలు ఎలా ఉన్నాయి, ఆకతాయి చేష్టల నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా తెలుసుకోవాలి. భోదన, ప్రయోగశాల, గ్రంథాలయాలు, వసతి గృహం, ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయో వైబ్‌సైట్ల ద్వారానో, ప్రత్యక్షంగా పరిశీలించడం ద్వారానో తెలుసుకోవాలి. అక్కడ చదువుతున్న విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, తెలిసిన వారితో మాట్లాడి మరిన్ని వివరాలు సేకరించాలి. వీటన్నింటికితోడు నిపుణుల సలహాలు తీసుకోవాలి. ఎందుకంటే నాలుగేళ్లపాటు చదవాల్సిన కళాశాల విషయంలో తప్పటడుగులు వేస్తే అది భవిష్యత్‌పై చెడు ప్రభావం చూపుతుంది.
జిల్లాలో 8,050 సీట్లు
జిల్లాలో రెండు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలతోపాటు 16 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. 8,050 సీట్లు బీటెక్‌లోను, 360 సీట్లు బీఫార్మసీలోనూ ఉన్నాయి. ఎంసెట్‌కు ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 7,600 మంది హాజరయ్యారు. ఇందులో 6,171 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఎస్వీయూ రీజియన్ పరిధిలో అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల వారు స్థానికులవుతారు. వచ్చిన ర్యాంకుల ఆధారంగా 85 శాతం సీట్లు వీరికే కేటాయిస్తారు.
జేఎన్‌టీయూపైనే ఆసక్తి
నాణ్యతతో కూడిన ఇంజనీరింగ్ విద్యనందించడం, ప్రాజెక్టుల్లో తర్ఫీదు ఇవ్వడం, టాప్ టెన్‌లో ఉన్న బహుళ జాతి సంస్థలైన ఐబీఎం, టీసీఎస్‌లు క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తుండటంతో అభ్యర్థులు జేఎన్‌టీయూపైనే ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో 285 మంది టీసీఎస్‌లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో ఇక్కడ సీటొస్తే ఉద్యోగం గ్యారంటీ అనే ధీమా వారిలో వ్యక్తమవుతోంది.
ఎస్కేయూలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు
ఇంజనీరింగ్ కళాశాలలో సెల్ఫ్ ఫైనాన్స్ ద్వారా ఇంజనీరింగ్ సీట్లను భర్తీ చేస్తారు. రెండు సంవత్సరాల నుంచి మెకానికల్ విభాగం ప్రారంభించారు. సివిల్, ఈఈఈ, ఈసీఈ, సీఎస్‌ఈ బ్రాంచ్‌లు అందుబాటులో ఉన్నాయి. క్యాంపస్‌లో నూతనంగా బీటెక్ బాలుర వసతి గృహాన్ని నిర్మించారు.
నైపుణ్యమే ప్రామాణికం
విద్యార్థి ఇంజనీరింగ్‌లో సాధించిన నైపుణ్యమే ఉద్యోగానికి తొలిమెట్టు. ప్రకటనల కన్నా స్వయంగా ఆయా కళాశాలలను పరిశీలించిన తర్వాతే చేరాలా? వద్దా? అని నిర్ణయించుకోవాలి. 75 శాతం హాజరు ఉంటేనే పరీక్షలకు అనుమతిస్తారు. నాలుగేళ్లు ప్రణాళికాబద్ధంగా చదివితే ఎక్కడైనా ఉపాధి దొరుకుతుంది.
- ఎ.ఆనందరావు, అకడమిక్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్, జేఎన్‌టీయూ
అనుభవంతో కూడిన అధ్యాపకులు ఉండాలి
ఇంజినీరింగ్‌ను ఆషామాషీగా అభ్యసించకూడదు. ఇంటి దగ్గర నుంచి కార్పొరేట్ కొలువుల వరకు విద్యార్థులను తీసుకెళ్లే బాధ్యత కళాశాలలదే. వాటిలో అనుభవమున్న అధ్యాపకులు, ఈ లెర్నింగ్ లాంటి సదుపాయాలు ఉండాలి. అన్ని బ్రాంచుల వారు ఐటీ వైపు వెళ్లడానికి అవకాశం ఉంది కాబట్టి బ్రాంచ్ ఎంపిక కీలకం కాబోదు.
- కె.హేమచంద్రారెడ్డి, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం, జేఎన్‌టీయూ
ప్రకటనలు చూసి మోసపోవద్దు
ప్లేస్‌మెంట్స్ ప్రకటనలు చూసి మోసపోవద్దు. ఆ ఉద్యోగాలు ఎలాంటి కంపెనీల్లో వచ్చాయో పరిశీలించాలి. ఇంజినీరింగ్ అంటే అందమైన ఊహాలోకం అనుకోకుండా నాలుగేళ్ల కోర్సు కష్టపడి చదవాలి. కేవలం పట్టా కోసమే చదివితే సమయం వృథా అవుతుందే తప్ప ప్రయోజనం లేదు. కమ్యూనికేషన్స్ స్కిల్స్‌పై దృష్టి సారించాలి.
- కె.విజయ్‌కుమార్, అడ్మిషన్స్ డైరెక్టర్, జేఎన్‌టీయూ
నచ్చిన కోర్సా.. మెచ్చిన కళాశాలా?
Published Sun, May 7 2017 12:24 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM
Advertisement
Advertisement