► ఒకే మండలంలో రెండు కార్పొరేషన్ పదవులు
► టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం
► సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు
కొండపాక(గజ్వేల్): కొండపాక మండలంలో మర్పడ్గ మదిర నాగిరెడ్డిపల్లికి చెందిన మడుపు భూంరెడ్డిని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌గా, జప్తినాచారం గ్రామానికి చెందిన లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియామకం చేస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన చేయడంతో మండలంలోని టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం నిండుకుంది. తెలంగాణ ఉద్యమంలో అన్నింటా ముందుండి పోరాటం చేసిన కొండపాక మండలాన్ని సీఎం కేసీఆర్ ఆలస్యంగానైనా గుర్తించడంపై ధన్యవాదాలు చెప్పారు. పార్టీలో మొదటి నుంచి పని చేసిన నాయకులను, కార్యకర్తలను ఎప్పుడూ మర్చిపోదన్న నమ్మకాన్ని సీఎం ప్రజల్లో కల్పించారు.
మండల పరిధిలోని మర్పడ్గ మదిర నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మడుపు భూంరెడ్డి సీఎం కేసీఆర్‌తో మొదటి నుంచి సన్నిహితంగా ఉంటున్నారు. ఈ క్రమంలో పార్టీలో నామినేటెడ్ పదవుల నియామకాలు జరిగినప్పుడల్లా మడుపు భూంరెడ్డికి చోటు దక్కుతుందనే ప్రజల ఆశలు నెరవేడం లేదు. దీంతో భూంరెడ్డి, ప్రజలు కాస్త నిరాశ పడ్డారు. పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో భూంరెడ్డి ముందుండి పని చేస్తున్నారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో భూంరెడ్డి భూ నిర్వాసితులకు నచ్చజెప్పుతూ రిజిస్ట్రేషన్ చేయించారు. ఆయన ఓపిక చివరకు రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరకు తీసుకొచ్చిందంటూ మండలంలో జోరుగా ప్రచారం సాగుతోంది.
మండల పరిదిలోని లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి టీఆర్‌ఎస్ కొండపాక మండల అధ్యక్షుడిగా పని చేశారు. ఇప్పటి వరకు ఆయనకు ఎలాంటి పదవి లేదు. అయినా అధిష్టానం ఆదేశాలు, సూచనలు పాటిస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్ట్యాత్మకంగా తీసుకొని నిర్మింపదలచిన మల్లన్న సాగర్ విషయంలో తొగుట మండలంలోని ఏటిగడ్డకిష్టాపూర్, వేముల గట్టు, పల్లెపహాడ్ తదితర గ్రామాల్లో జరుగుతున్న భూసేకరణలో కాంగ్రెస్, టీడీపీ భూ నిర్వాసితుల పక్షాన నిలుస్తూ ప్రాజెక్టు నిర్మాణానికి భూములివ్వకుండా అడ్డుపడుతున్నాయి. ప్రజలను భూసేకరణకు దూరంగా ఉంచేలా ఇప్పటికీ చూస్తున్నాయి.
మల్లన్నసాగర్ నిర్మాణ విషయంలో గట్టి పట్టుదలతో ఉన్న ప్రభుత్వం (మంత్రి హరీశ్‌రావు) సూచనలు, సలహాల మేరకు దుబ్బాక ఎమ్మెల్యే (రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ) సోలిపేట రామలింగారెడ్డితో కలిసి పని చేస్తూ మెల్లమెల్లగా ఒక్కో గ్రామంలో బంధువులకు, స్నేహితులకు నచ్చజెప్పుతూ ప్రాజెక్టు పేరిట భూములను రిజిస్ట్రేషన్ చేయించే పనిలో నిమగ్నమయ్యారు. ఒక్క వేములగట్టు గ్రామం తప్పా మిగతా గ్రామాల్లో దాదాపు అందరు రైతులు భూములను రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమాచారం. ఈ విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ లక్కిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదివిని కట్టబెట్టారు. ఏదిఏమైనా కొండపాక మండలంలోని ఇద్దరికి కార్పొరేషన్ సంస్థలో సీఎం కేసీఆర్ అవకాశం కల్పించడంపై టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిదులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.